శాసనసభలో హరీశ్ వర్సెస్ భట్టి
ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ పరస్పర విమర్శలు
వాస్తవాలు నిరూపించేందుకు సిద్ధమంటూ సవాళ్లు
ఎఫ్‌ఆర్‌బీఎం కింద రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశామన్న భట్టి
గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు,
గ్యారంటీ లేని రుణాలు రూ.10,999 కోట్లు సమీకరించినట్లు వెల్లడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే రూ.1,27,208 కోట్లు అప్పు చేసిందన్న హరీశ్
తాము పదేళ్లలో కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే అప్పు చేసినట్లు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన అప్పులు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసిన అప్పులు.. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని వేడెక్కించాయి. ఆరోపణలు.. ప్రత్యారోపణలు, సవాళ్లు.. ప్రతి సవాళ్లతో స భ అట్టుడికింది. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావుల మధ్య వాడివేడి వాదనలు కొనసాగాయి. అసత్యాలతో ప్రజలను త ప్పుదోవ పట్టిస్తున్నారని పరస్పరం విమర్శించుకుంటూ వారివారి లెక్కలను సభ ముందుంచారు.
ప్రివిలేజ్ మోషన్‌పై మాట మార్చారు: భట్టి
‘రాజకీయాలు చేయటమే లక్ష్యంగా వ్యవహరించే హరీశ్‌రావు సభలో అన్నీ అబద్ధాలే చెబుతారు. ఏడాదిలో మేం చేసిన అప్పులపై ఆయన చెప్పే లెక్కలు సరికాదు. పదేళ్ల వారి పాలనలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు కొంత అప్పు చేయక తప్పలేదు. ఇక పదేళ్ల వారి హయాంలో చేసిన అప్పుల లెక్కల్లోనూ ఆయనది ప్రజలను తప్పుదారి పట్టించే పద్ధతే. అందుకే మేం అధికారంలోకి రాగానే శ్వేతపత్రం రూపంలో వాస్తవాలను ప్రజల ముందుంచాం. మళ్లీ చర్చ పెడితే నిరూపించేందుకు సిద్ధం. బీఆర్‌ఎస్ నేతలు 10 సంవత్సరాల పాలనలో తప్పులు చేసినందుకు గత డిసెంబర్‌లో జనం శిక్షించారు.
ఆరు నెలల్లో పార్లమెంటు ఎన్నికలప్పుడు డిపాజిట్ దక్కకుండా వారికి మతిపోయేలా చేశారు. అయినా వారిలో మార్పు రాలేదు. ఆ పార్టీది భూస్వామ్య మనస్తత్వం. భూమిలేని నిరుపేదలకు ఆర్థిక సాయం చేయరా? అని ఖమ్మంలో ఓ విలేకరి అడిగినప్పుడు, వారికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పా. దాని ఆధారంగా ప్రివిలేజ్ మోషన్ ఇచ్చి, ఇప్పుడు అప్పుల మీద అవాస్తవాలు మాట్లాడితే ఇచ్చామంటున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వారికి అనుకూలంగా సభ నియమాలు రూపొందించుకున్నారు.
వారి నిబంధనల్లోనే సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని ఉంది..కానీ నిన్న తీసుకొచ్చారు. వీరా నామీద ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేది? వారి హయాంలో స్పీకర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నప్పుడు బీఏసీలో పాటించిన పద్ధతినే మేం ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇప్పుడు ప్రసాద్‌కుమార్ స్పీకర్‌గా ఉన్నారు. వ్యక్తి మారారు తప్ప స్పీకర్ స్థానం అదే. ఆ స్థానాన్ని గౌరవించాలి కదా.. నిన్న బీఏసీలో కాగితాలు విసిరి బయటకొచ్చి ఏవేవో మాట్లాడుతున్నారు.
ఆ ప్రచారంలో వాస్తవం లేదు
మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.లక్ష కోట్లు అప్పు చేసిందని విపక్షాలు చేసే ప్రచారంలో వాస్తవం లేదు. ఎఫ్‌ఆర్‌బీఎం కింద మేము రూ.51,277 కోట్లు మాత్రమే అప్పు చేశాం. గ్యారంటీల కింద రూ.61,991 కోట్లు, గ్యారంటీ లేని రుణా లు రూ.10,999 కోట్లు సమీకరించాం. మీ హయాంలో చేసిన అప్పుపై వడ్డీ రూపేణ రూ.66 వేల కోట్లు చెల్లించాం. మీరు పెట్టిపోయిన పెండింగు బిల్లులు రూ.40 వేల కోట్లలో ఇప్పటికి రూ.14 వేల కోట్లు చెల్లించాం.
ప్రజల ఆస్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ఔటర్ రింగురోడ్డును ఆ ప్రభుత్వం 30 ఏళ్ల లీజు పేరుతో అమ్ముకుంది. అదే పద్ధతిలో మేం వచ్చే 30 ఏళ్ల కాలానికి జీఎస్టీ లాంటి ఆదాయ వ్యవహారాలను ఏ అదానికో, అంబానికో లీజుకిస్తే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి?..’అని భట్టి నిలదీశారు.
పరిమితంగానే మా అప్పులు: హరీశ్‌రావు
‘మా ప్రభుత్వం పరిమితంగా చేసిన అప్పును తప్పుడు లెక్కలతో పెంచి భూతద్దంలో చూపి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అబద్ధపు అప్పుల బూచి చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఆటలు సాగనివ్వం. మేం చెప్పే లెక్కలే సరైనవని నిరూపించేందుకు సిద్ధం. సభలో ప్రత్యేక చర్చ పెట్టండి, ఆడిటర్లను, ఆర్థిక నిపుణులను పిలిపించుకోండి.. నేను చెప్పేవే సరైన లెక్కలని నిరూపిస్తాను.
ఇది నా ఛాలెంజ్. ఆర్బీఐ నేటి లెక్కల ప్రకారం గత ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు రూ.1,27,208 కోట్లు. ఐదేళ్లలో చేయబోయే అప్పు దాదాపు రూ.6,36,400 కోట్లు. కానీ మా ప్రభుత్వం పదేళ్ల కాలంలో తెచి్చన అప్పులు కేవలం రూ.4,17,496 కోట్లు మాత్రమే. ‘ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఆయన ఉటంకించారు) కరోనా కారణంగా కేంద్రం అదనంగా 1.75 శాతం అప్పు తీసుకోవాలని సూచించడంతో తీసుకున్నాం. లేకపోతే అంతకూడా అప్పు అయ్యేది కాదు.
దీనిపై నేను సవాల్ విసురుతున్నా.. చర్చకు సిద్ధం. మేం రూ.6,71,757 కోట్లు అప్పు తీసుకున్నామని ఒకసారి, రూ.7 లక్షల కోట్లు అని మరోసారి, సభలో రూ.7,11,911 కోట్ల అప్పులంటూ నోటికొచి్చనట్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తా. ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం చేసిన అప్పులపై తప్పుడు లెక్కలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీఏసీతో సంబంధం లేకుండా సభలో బిల్లులు ప్రవేశపెట్టడం వింతగా ఉంది. గత సభలో అప్పుల గురించి తప్పుడు లెక్కలు చూపినందుకే భట్టి విక్రమార్కపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం. కానీ మరో అంశంపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్టు అబద్ధాలు చెప్తున్నారు. చర్చ పెడితే వాస్తవాలు నిరూపిస్తాం..’అని హరీశ్‌రావు సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment