సాక్షి, హైదరాబాద్: శాసనసభ అంటే అందరిదీ.. ఏ ఒక్క పార్టీకి చెందినది కాదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కొత్తగా శాసనసభకు ఎన్నికైన నేతలందరూ సభకు హాజరయ్యే సంప్రదాయం కొనసాగించాలని కోరారు. సిద్ధాంతపరంగా బేధాలున్నప్పటికీ.. సభలో ఎవరి పాత్ర వాళ్లు పోషించాలన్నారు.
శాసనసభ వ్యవహారాలపై తెలంగాణ శాసనసభ, మండలి సభ్యులకు బుధ, గురువారాల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..‘మొదటి సారి ఎన్నికైన శాసనసభ్యులు 57 మంది శాసన సభలో ఉన్నారు. శాసన సభ అందరిది.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో మరొక పార్టీదో కాదు. ఈ ట్రైనింగ్ సెషన్స్ కోసం అందరికీ ఆహ్వానం పంపించాము.
పాత రోజుల్లో సిద్ధాంత పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా సభలో ఎవరి పాత్ర వారు పోషించారు. నేను మొదటిసారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నేను నాలుగోసారి సభలో ఉన్నప్పుడు పీఏసీని ప్రతిపక్షానికి ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు అందరూ శాసనసభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలి. ఎమ్మెల్యేగా గెలిచి సభ రాకుండా దూరంగా ఉండకండి. పార్లమెంట్‌లో ఎలాగైతే ఉత్తమ పార్లమెంటేరియన్ ఇస్తున్నారో అదే విధంగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు ఇవ్వాలని స్పీకర్‌ను కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..‘చట్టాలను రూపొందించే హక్కు శాసన సభ్యులకు ఉంటుంది. గతంలో శాసనసభ సమావేశాలు ఉంటే సినిమా రిలీజ్ వాయిదా వేసుకునే వారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి గొప్ప వ్యక్తులు బాగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్ మాదిరిగా ఉత్తమ శాసనసభ వక్త అవార్డు పరిశీలన చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ..‘గాలివాటం రాజకీయాలు ప్రారంభం అయినప్పటికీ కొత్త వాళ్ళు మళ్ళీ గెలవడం లేదు. మొదటిసారి ఎన్నికై రాజకీయాల్లో సక్సెస్ అయ్యే వారి శాతం 25శాతమే. కొందరు నాయకులు గెలిచాక ప్రజలతో మమేకం కావడం లేదు. ఎమ్మెల్యేకు కోటరీ వల్ల ప్రజలు స్వయంగా ఎమ్మెల్యేను కలిసే అవకాశం ఎక్కువగా ఉండదు. ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.. ఫోన్లు ఎత్తాలి. నేను ఒకసారి ఓడిపోవడానికి నాకు సెక్యూరిటీ సమస్య వల్లే. ప్రజలు ఎమ్మెల్యేకు దూరం అవ్వడానికి కారణం పీఏలు, పీఆర్వోలు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment