
ఢిల్లీలో విలేకరులతో మాట్టాడుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
హైదరాబాద్: ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి పన్ను విధించనున్నట్లు తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాహనాలపై పన్ను విధించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరనున్నట్లు తెలిపారు. ''రాష్ట్రాలు విడిపోయినా మనది ఒకే భాష.మనం అందరం కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాలూ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని వైఎస్ జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రైవేట్ బస్సుల యజమానులు ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను ఆపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరుతున్నట్లు తెలిపారు. ఏపీ వాహనాలపై పన్నును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ని కోరతామని చెప్పారు.