ఏపీ భవనాలన్నీ మాకు అప్పగించండి
► గవర్నర్‌కు మంత్రివర్గ తీర్మానాన్ని అందించిన సీఎం కేసీఆర్
► ఆమోదం రాగానే కొత్త సచివాలయ నిర్మాణ పనులు
► నవంబర్ 26న పునాదిరాయి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు, సచివాలయంలోని బ్లాక్‌లను తిరిగి తెలంగాణకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం చేసిన తీర్మాన ప్రతిని గవర్నర్‌కు స్వయంగా అందజేశారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన బ్లాకుల్లో ఆ ప్రభుత్వ కార్యకలాపాలు నడవట్లేదని, ఇప్పటికే ఏపీ కార్యాలయాలు అమరావతికి తరలి వెళ్లాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో తమ అవసరాల దృష్ట్యా వృథాగా ఉంటున్న ఏపీ బ్లాక్‌లను తమకు అప్పగించాలని కోరారు. ఏపీ అధీనంలో ఉన్న అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలు కూడా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో అరగంట సేపు భేటీ అయ్యారు. కొత్త సచివాలయ నిర్మాణం, పాత సచివాలయం తరలింపు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు సమాచారం.
సమ్మతించిన ఏపీ సర్కారు!: సచివాలయం, అసెంబ్లీ, కౌన్సిల్ భవనాలను తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం కూడా సంకేతాలిచ్చింది. దీంతో గవర్నర్ ఆమోదించిన వెంటనే ఈ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలాఖరున కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఏపీ ఆఫీసుల అప్పగింతకు ఆమోదం లభించడం లాంఛనమే అన్నట్లు తెలంగాణ ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకుంది.
దీపావళి తర్వాత నవంబర్ మొదటి వారంలో సచివాలయంలో ఉన్న సీఎం కార్యాలయంతో పాటు మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల ఆఫీసులన్నీ తాత్కాలిక భవనాలకు తరలిస్తారు. వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత కూల్చివేత పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. నవంబర్ 26న కొత్త సచివాలయం నిర్మాణానికి పునాది రాయి వేసేందుకు ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారు లు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.