21న ముఖ్యమంత్రుల భేటీ?
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు ఓకే
భేటీ తేదీపైనే భిన్నాభిప్రాయాలు
19కి ఓకే చెప్పిన చంద్రబాబు.. 21న కుదురుతుందన్న కేసీఆర్
21 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఉమాభారతి
ఆలోగా జరగకుంటే.. అక్టోబర్‌లోనే సీఎంల సమావేశం
కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం మేరకు నిర్వహణ
నీటి లెక్కలపై ముఖ్యమంత్రితో హరీశ్‌రావు చర్చలు
కృష్ణా, గోదావరి నీటి వాడకంపై అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు ఈ నెల 21న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఇరువురు సీఎంలు ఇప్పటికే సమ్మతి తెలిపారు.
అయితే ఏ రోజున సమావేశమవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 19న భేటీకి చంద్రబాబు ఓకే చెప్పగా.. 21న నిర్వహించాలని కేసీఆర్ కోరనున్నారు. ఇక 21వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి ఉమాభారతి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉండనుంది.
ఈ నెలలో జరిగేనా..?
రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉంది. చర్చలు జరిపేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ సమ్మతి తెలియజేశారు. దాంతో భేటీ కోసం ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒక తేదీని సూచించాలని కేంద్రం కోరగా.. 19వ తేదీకి ఓకే చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాశారు.
కానీ 19న తమకు వీలు కాదని.. 21వ తేదీన భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని కేసీఆర్ నిర్ణయించారు. వినాయక ఉత్సవాలు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ కసరత్తు, సమీక్షల దృష్ట్యా 19వ తేదీకి ముందు భేటీ కుదరదని... 20వ తేదీ నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే ఆ లేఖలో పేర్కొననున్నారు. దాంతో 21న భేటీ నిర్వహిస్తే సహేతుకంగా ఉంటుందని సూచించనున్నారు.
గురువారం ఈ లేఖ రాసే అవకాశముంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఉమాభారతి 21వ తేదీ తర్వాత అందుబాటులో ఉండటం లేదని.. ఆమె విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అంటే ఈలోగానే ఇద్దరు సీఎంలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే అపెక్స్ కమిటీ భేటీ వచ్చే నెలకు వాయిదా పడనుంది.
సీఎంతో మంత్రి హరీశ్‌రావు చర్చలు
అపెక్స్ భేటీ తేదీలు, అందులో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఉదయం జరిగిన సమావేశంలో అపెక్స్ భేటీ అంశంతో పాటు, కేంద్రం-నాబార్డ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం, ఏపీ జలచౌర్యంపై ఫిర్యాదు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుత వాటర్ ఇయర్‌లో కృష్ణా జలాల లభ్యత, వినియోగం, బోర్డు కేటాయింపులు, పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన నీటి వినియోగం, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, కేసీ కెనాల్ ద్వారా తరలించిన నీటి లెక్కలతో రావాలని సీఎం సూచించడంతో... హరీశ్‌రావు అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు.
ఇప్పటివరకు సాగర్, శ్రీశైలం, జూరాల కింద ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. ఇటీవల ఖరీఫ్ సాగు అవసరాలకు బోర్డు చేసిన కేటాయింపులు, అందులో తెలంగాణకు తగ్గిన కేటాయింపులు, పట్టిసీమ, శ్రీశైలం కుడి కాల్వ నుంచి ఏపీ తరలించిన నీటి లెక్కలు తెలుసుకున్నారు. అనంతరం సీఎంతో మళ్లీ భేటీ అయి ఈ వివరాలను వెల్లడించారు.