CMs meeting
-
ఏప్రిల్ 27న ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో తాజా పరిస్థితి, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారని అధికారులు శనివారం చెప్పారు. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రజంటేషన్ ఇస్తారు. చదవండి: (ఢిల్లీలో డేంజర్ బెల్స్) -
Mamata Banerjee: మోదీ సమావేశం సూపర్ ఫ్లాప్
కోల్‌కతా: దేశంలో కోవిడ్ పరిస్థితిపై గురువారం జరిగిన వర్చువల్ సమావేశంలో కొన్ని రాష్ట్రాల సీఎంల పట్ల మోదీ వ్యవహరించిన తీరుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన ఈ సమావేశం ఒక సర్వసాధారణమైన ‘సూపర్ ఫ్లాప్’ అని మమత అభివర్ణించారు. సమావేశం ముగిసిన తర్వాత మమత మీడియాతో మాట్లాడారు. మోదీతో వర్చువల్ సమావేశానికి రాష్ట్రాల ముఖ్యమంత్రు లను ఆహ్వానించారుగానీ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేద ని, ఆ సీఎంల ప్రతిష్టను మోదీ ఆటబొమ్మల స్థాయికి దిగజార్చారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంలను మాట్లాడనీయకుండా వారిని మోదీ అవమానించారని మమత ఆరోపిం చారు. మోదీ అభద్రతాభావంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారని మమత వ్యాఖ్యానించారు. అయితే, మమత వ్యాఖ్యలపై మాజీ తృణమూల్ సీనియర్ నేత, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే సువేంధు అధికారి స్పందించారు. ‘మోదీ పూర్తిగా కోవిడ్ సంబంధ విషయాలు చర్చించిన సమావేశాన్ని మమత రాజకీయమయం చేశారు. గతంలో ఎన్నోసార్లు ప్రధానితో భేటీల నుంచి మమత ఉద్దేశపూర్వకంగా తప్పుకుని, ఇప్పుడేమో మోదీ–కలెక్టర్ల భేటీలో మాట్లాడే అవకాశం రాలేదంటున్నారు ’ అని సువేంధు వ్యాఖ్యానించారు. వారి కోసం 20 లక్షల డోస్‌లు ఇవ్వండి బెంగాల్‌లోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 20 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులను కేటాయించాలని మోదీని మమత కోరారు. ఈ మేరకు మమత గురువారం మోదీకి ఒక లేఖ రాశారు. బ్యాంకింగ్, రైల్వే, బొగ్గు, ఎయిర్‌పోర్టులు తదితర ఫ్రంట్‌లైన్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా డోస్‌లు రాష్ట్రానికి పంపాలని మమత కోరారు. -
Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ‘తౌక్టే’ పెను విధ్వంసం
ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్: గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను ‘‘తౌక్టే’’ సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ‘రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది’ అని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు. తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను ‘తౌక్టే’ ను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘టౌటే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. పోర్ట్ల్లో ప్రమాద హెచ్చరికలు గుజరాత్‌లోని పోరు బందరు, మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య సోమవారం ‘తౌక్టే’ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిమీ నుంచి 165 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. రంగంలోకి నేవీ బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని మహువాలో భీకరగాలుల ధాటికి చెట్లు కూలడంతో నిలిచిన ఆక్సిజన్ సిలిండర్ల ట్రక్కు వణుకుతున్న గుజరాత్ భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. ‘తౌక్టే’ తీరాన్ని దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను టౌటేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు. సీఎంలతో ప్రధాని సమీక్ష తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు. మహారాష్ట్రలో బీభత్సం మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో ‘తౌక్టే’ తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
లాక్‌డౌన్‌పై ప్రధాని మోదీ కీలక ప్రకటన
ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి విజృంభణ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదేశించారు. దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ ఉండదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ను విస్తృతం చేయాలని ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 11 నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనా వ్యాప్తి విజృంభనతో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ముఖ్యమంత్రులతో మాట్లాడి రాష్ట్రాల వారీగా వివరాలు తెలుసుకున్నారు. కరోనా వల్ల మరోసారి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా కట్టడికి సీఎంలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ కంటే ఎక్కువ తీవ్రత ఉందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా ఉందని గుర్తుచేశారు. వ్యాక్సినేషన్ కన్నా పరీక్షలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల సంఖ్యను భారీగా పెంచాలని, అందరూ తప్పనిసరిగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటానికి మళ్లీ యుద్ధ ప్రాతిపదికన సిద్ధం కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యమంత్రులకు తెలిపారు. ఫస్ట్ వేవ్‌ను జయించాం.. సెకండ్ వేవ్‌ను కూడా జయించగలం అని స్పష్టం చేశారు. పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యం చెప్పారు. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఒక ప్రత్యామ్నాయం అని తెలిపారు. 45 ఏళ్లు దాటినవారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. -
15 ఏళ్ల కాలం మనకు అత్యంత కీలకం
న్యూఢిల్లీ: భారత్‌లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆరేళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు. పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014–19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్‌సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు. అనుకున్నవన్నీ గడువులోగా పూర్తి చేయాలి ప్రస్తుత దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే లోక్‌సభ(2024–29) కాలం ప్రధానమైన పాత్ర పోషించబోతోందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మనం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ప్రజల మైండ్‌సెట్ మారింది 130 కోట్ల మంది ప్రజల కలలను నిజం చేసే వనరులు, గట్టి సంకల్పం మనకు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉందని వివరించారు. దేశ ప్రజల మైండ్‌సెట్ మారిందనడానికి 16వ లోక్‌సభ ఒక ఉదాహరణ అని అన్నారు. 16వ లోక్‌సభలో 300 మందికిపైగా ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో 260 మంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వారేనని పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు. నేడు సీఎంలతో భేటీ ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో నేడు రెండు వేర్వేరు వర్చువల్ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో సమావేశం జరుపనున్నారు. వీటిలో కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్ పంపిణీ గురించి చర్చించనున్నారు. కరోనాపై ప్రధాని మోదీ రాష్ట్రాలతో ఇప్పటికే వర్చువల్ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. -
కృష్ణకు గో‘దారి’పై..
సాక్షి, హైదరాబాద్ : వీలైనంత తక్కువ భూసేకరణ, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుంచి, ఎలా తరలించాలి, అలైన్మెంట్ ఎలా ఉండాలి అనే విషయాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివిధ ప్రత్యామ్నాయ మార్గాలపై సీఎంలిద్దరూ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సాయంత్రం 5.10 గంటలకు ప్రగతి భవన్ చేరుకోగా రాత్రి 9 గంటల వరకు చర్చలు సాగాయి. తొలుత తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా కారు వద్దకు వచ్చి ఏపీ సీఎంకు సాదర స్వాగతం పలికారు. దుమ్ముగూడెం నుంచి తరలింపుపై... దుమ్ముగూడెం నుంచి నాగార్జున సాగర్‌లోకి గోదావరి జలాలను తరలించి అక్కడి నుంచి రివర్సబుల్ టర్బైన్స్ ద్వారా శ్రీశైలం జలాశయానికి నీటిని తరలించే అంశంపై ఈ సమావేశంలో కేసీఆర్, జగన్ ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. నాగార్జున సాగర్ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుకాగా కనీసం 230 టీఎంసీల నిల్వ కొనసాగిస్తూ ఇక్కడి నుంచి శ్రీశైలం జలాశయానికి రివర్స్ టర్బైన్స్ ద్వారా నీటిని తరలించే అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలియవచ్చింది. దీంతోపాటు పలు ఇతర ప్రత్యామ్నాయాలను సీఎంలు ఇద్దరూ పరిశీలించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై మరోసారి రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఇంజనీర్ల స్థాయిలో సమావేశాలు జరిపి సాంకేతికపరమైన అంశాలపై అధ్యయనం జరిపించాలనే అభిప్రాయానికి వచ్చారు. గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తే దక్షిణ తెలంగాణతోపాటు రాయలసీమ జిల్లాల రైతు సమస్యలు తీరుతాయని సీఎంలిద్దరూ అభిప్రాయపడ్డారు. ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా నదీ జలాల తరలింపు, నీటి వినియోగం జరిపే దిశగా చర్చలు సాగాయి. ఈ విషయంలో ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని సీఎంలు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 18 వేల పోలీసుల నియామకం ..ఏపీలో శిక్షణ విద్యుత్, పోలీస్ ఉద్యోగుల విభజనతోపాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన ఇతర పెండింగ్ అంశాలపై సీఎంలిద్దరూ ఈ సమావేశంలో చర్చలు జరిపారు. తెలంగాణలో 18 వేల మంది పోలీసులను ఒకేసారి నియమిస్తున్న నేపథ్యంలో వారందరికీ ఏకకాలంలో శిక్షణ ఇచ్చేందుకు స్థలం చాలనందున 4 వేల మందికి ఆంధ్రప్రదేశ్‌లో శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఏపీ సీఎం జగన్‌ను కోరారు. ఇందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకేసారి శిక్షణ ఇవ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలగనుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ ఆహ్వానపత్రికను సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు అందజేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి, మిథున్‌రెడ్డి తిరుమల బ్రహ్మోత్సవాలకు రండి... ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు జరగనున్న తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సావాలకు విచ్చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ వైఎస్ జగన్ ఆహ్వాన పత్రిక అందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తోపాటు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
నేడు నీతి ఆయోగ్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం(17న) సమావేశం కానుంది. ఇక్కడి రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ఉదయం 9.45 నుంచి సాయంత్రం 4 వరకు సమావేశం జరగనుంది. పాలకమండలి చైర్మన్‌గా ఉన్న ప్రధాని సహా మండలి సభ్యులైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొంటారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. కేసీఆర్ గురువారమే ఢిల్లీకి వెళ్లగా, చంద్రబాబు శనివారం సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్నారు. గత సమావేశ నిర్ణయాల అమలు, రైతుల ఆదాయం రెట్టింపు, ఆయుష్మాన్ భారత్, పోషణ్ మిషన్, మిషన్ ఇంద్రధనుష్, మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
21న ముఖ్యమంత్రుల భేటీ?
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేసీఆర్, చంద్రబాబు ఓకే భేటీ తేదీపైనే భిన్నాభిప్రాయాలు 19కి ఓకే చెప్పిన చంద్రబాబు.. 21న కుదురుతుందన్న కేసీఆర్ 21 తర్వాత విదేశీ పర్యటనకు వెళ్లనున్న ఉమాభారతి ఆలోగా జరగకుంటే.. అక్టోబర్‌లోనే సీఎంల సమావేశం కేంద్ర జల వనరుల శాఖ నిర్ణయం మేరకు నిర్వహణ నీటి లెక్కలపై ముఖ్యమంత్రితో హరీశ్‌రావు చర్చలు కృష్ణా, గోదావరి నీటి వాడకంపై అధికారులతో సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాల పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు ఈ నెల 21న భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి అధ్యక్షతన ఢిల్లీలో జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీకి ఇరువురు సీఎంలు ఇప్పటికే సమ్మతి తెలిపారు. అయితే ఏ రోజున సమావేశమవుతారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 19న భేటీకి చంద్రబాబు ఓకే చెప్పగా.. 21న నిర్వహించాలని కేసీఆర్ కోరనున్నారు. ఇక 21వ తేదీ తర్వాత కేంద్ర మంత్రి ఉమాభారతి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మేరకు అపెక్స్ కౌన్సిల్ భేటీ ఉండనుంది. ఈ నెలలో జరిగేనా..? రాష్ట్ర విభజన నాటి నుంచి కొనసాగుతున్న జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేసింది. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరుకావాల్సి ఉంది. చర్చలు జరిపేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ఇప్పటికే తమ సమ్మతి తెలియజేశారు. దాంతో భేటీ కోసం ఈనెల 11, 18, 19 తేదీల్లో ఏదో ఒక తేదీని సూచించాలని కేంద్రం కోరగా.. 19వ తేదీకి ఓకే చెబుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే లేఖ రాశారు. కానీ 19న తమకు వీలు కాదని.. 21వ తేదీన భేటీ ఏర్పాటు చేయాలంటూ కేంద్రానికి లేఖ రాయాలని కేసీఆర్ నిర్ణయించారు. వినాయక ఉత్సవాలు, జిల్లాల పునర్వ్యవస్థీకరణ కసరత్తు, సమీక్షల దృష్ట్యా 19వ తేదీకి ముందు భేటీ కుదరదని... 20వ తేదీ నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే ఆ లేఖలో పేర్కొననున్నారు. దాంతో 21న భేటీ నిర్వహిస్తే సహేతుకంగా ఉంటుందని సూచించనున్నారు. గురువారం ఈ లేఖ రాసే అవకాశముంది. మరోవైపు అపెక్స్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఉమాభారతి 21వ తేదీ తర్వాత అందుబాటులో ఉండటం లేదని.. ఆమె విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశాలున్నాయని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అంటే ఈలోగానే ఇద్దరు సీఎంలు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. లేకపోతే అపెక్స్ కమిటీ భేటీ వచ్చే నెలకు వాయిదా పడనుంది. సీఎంతో మంత్రి హరీశ్‌రావు చర్చలు అపెక్స్ భేటీ తేదీలు, అందులో చర్చించాల్సిన అంశాలను ఖరారు చేసేందుకు నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో రెండు విడతలుగా భేటీ అయ్యారు. ఉదయం జరిగిన సమావేశంలో అపెక్స్ భేటీ అంశంతో పాటు, కేంద్రం-నాబార్డ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం, ఏపీ జలచౌర్యంపై ఫిర్యాదు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లుగా తెలిసింది. అయితే ప్రస్తుత వాటర్ ఇయర్లో కృష్ణా జలాల లభ్యత, వినియోగం, బోర్డు కేటాయింపులు, పట్టిసీమ ద్వారా ఏపీ చేసిన నీటి వినియోగం, పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవా, కేసీ కెనాల్ ద్వారా తరలించిన నీటి లెక్కలతో రావాలని సీఎం సూచించడంతో... హరీశ్‌రావు అధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇప్పటివరకు సాగర్, శ్రీశైలం, జూరాల కింద ఇరు రాష్ట్రాలు చేసిన నీటి వినియోగంపై చర్చించారు. ఇటీవల ఖరీఫ్ సాగు అవసరాలకు బోర్డు చేసిన కేటాయింపులు, అందులో తెలంగాణకు తగ్గిన కేటాయింపులు, పట్టిసీమ, శ్రీశైలం కుడి కాల్వ నుంచి ఏపీ తరలించిన నీటి లెక్కలు తెలుసుకున్నారు. అనంతరం సీఎంతో మళ్లీ భేటీ అయి ఈ వివరాలను వెల్లడించారు. -
ఇరు రాష్ట్రాల సీఎంలతో జనవరిలో ప్రధాని భేటీ ?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు రాష్ట్రాల సీఎంలతో ఆయన సమావేశం కానున్నట్టు తెలిసింది. జనవరి 5న లేదా తరువాత ఒకటి రెండు రోజుల్లో ఈ సమావేశం ఉండొచ్చు. దీనిపై సీఎంలకు సమాచారం అందిందని తెలిసింది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల రద్దు, శ్రీశైలం జలాలు తెలంగాణ వాడుకోవడంపై వివాదం, నిధుల వినియోగంతో పాటు ఇతరత్రా పలు వివాదాల పరిష్కారానికి ఈ సమావేశం దోహదపడే అవకాశం ఉంది. కాగా, సమస్యల పరిష్కారానికి ఇప్పటికే గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఇద్దరు సీఎంలు భేటీ అయిన సంగతి తెలిసిందే. ప్రధాని భేటీ విషయంపై శనివారం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారిని విలేకరుల సమావేశంలో ప్రశ్నించగా.. అలాంటి సమాచారమేదీ తమకు అందలేదని, కేసీఆర్ వచ్చే నెల ఢిల్లీ వస్తున్నారని చెప్పారు. -
ముఖ్యమంత్రుల మండలి ఉండాలి: చంద్రబాబు
-
ముఖ్యమంత్రుల మండలి ఉండాలి: చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘం స్థానే ముఖ్యమంత్రుల మండలి ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు. ప్రధాని అధ్యక్షతన ఆదివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నూతన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం ప్రధాని ఆలోచిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ప్రణాళిక సంఘాన్ని ఒక తంతుగా కింద ఉపయోగించుకునేవారని విమర్శించారు. విజన్- 2050 తయారు చేసుకోవాల్సిన అవసముందన్నారు. రాజకీయాల కంటే అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు చెప్పారు. -
రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. ఈ సమావేశంలో మోదీ మాట్లాడుతూ... దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రణాళిక విధానంలో కింది నుంచి పైస్థాయి వరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రణాళికా సంఘం స్థానంలో సుస్థిరమైన సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను మోదీ ఈ సందర్భంగా వివరించారు. ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై మోదీ తన నివాసంలో ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమైయ్యారు. ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై వారితో మోదీ చర్చించారు. ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సలహాలు, సూచనలను మోడీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ సీఎంలు ఈ సమావేశానికి హాజరుకాలేదు.