దేశ పశ్చిమ తీరంలో తుపాను తీవ్రతను తెలుపుతున్న శాటిలైట్ ఫొటో
ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్: గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను ‘‘తౌక్టే’’ సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ‘రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది’ అని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు.
తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను ‘తౌక్టే’ ను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘టౌటే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి.
పోర్ట్‌ల్లో ప్రమాద హెచ్చరికలు
గుజరాత్‌లోని పోరు బందరు, మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య సోమవారం ‘తౌక్టే’ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిమీ నుంచి 165 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్‌లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్‌లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు.
రంగంలోకి నేవీ
బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్‌స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్‌ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు.
గుజరాత్‌లోని మహువాలో భీకరగాలుల ధాటికి చెట్లు కూలడంతో నిలిచిన ఆక్సిజన్ సిలిండర్ల ట్రక్కు
వణుకుతున్న గుజరాత్
భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. ‘తౌక్టే’ తీరాన్ని దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్‌సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను టౌటేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు.
సీఎంలతో ప్రధాని సమీక్ష
తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు.
మహారాష్ట్రలో బీభత్సం
మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో ‘తౌక్టే’ తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది.
తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment