Cyclone Tauktae
-
రెండు రాష్ట్రాల తీరాల్లో 10 మృతదేహాలు
ముంబై/వల్సద్: టౌటే తుఫాను తీరం దాటుతున్న సమయంలో అరేబియా సముద్రంలో ఉన్న పీ– 305 బార్జ్ మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో గల్లంతైన వారివిగా భావిస్తున్న 10 మృతదేహాలు మహారాష్ట్ర, గుజరాత్‌లలోని పలు తీరాలకు కొట్టుకొచ్చాయి. మృతదేహాలపై ఉన్న దుస్తులు, లైఫ్ జాకెట్లను బట్టి వారిని పీ– 305 బార్జ్‌కు చెందిన వారిగా భావిస్తున్నామని పోలీసులు ఆదివారం వెల్లడించారు. అయితే ఆ వ్యక్తులు ఎవరన్న దానిపై విచారణ సాగుతోందని చెప్పారు. మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో దొరికిన మృతదేహాల్లో మాండ్వా తీరంలో అయిదు, అలీబౌగ్‌లో రెండు, మురుద్‌లో ఒకటి ఉన్నాయని చెప్పారు. మరోవైపు గుజరాత్‌లోని వల్సద్ జిల్లాలో ఆదివారం రెండు మృతదేహాలు కనిపించాయి. శనివారం నుంచి మొత్తం ఆరు మృతదేహాలు దొరికినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మొత్తం 261 మంది ఉన్న పీ305 పడవ మునిగిపోగా వారిలో 186 మందిని రక్షించగలిగారు. ఇప్పటివరకూ ఈ పడవకు సంబంధించి 66 మంది మరణించారు. (చదవండి: SC Committee: ఈ–కోర్టుల మొబైల్ సేవలు) -
రూ. 30 కోట్ల భారీ సెట్ ధ్వంసమైంది.. బోని కపూర్ ఆవేదన
ఒకవైపు కరోనా మహమ్మారితో దేశ ప్రజలు అల్లాడుతుంటే.. మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నట్లుగా తౌటే తుఫాన్ వచ్చి దేశంలో కల్లోలం సృష్టించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబైలోని పలు ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ తుఫాన్ ప్రభావం చిత్ర పరిశ్రమపై కూడా భారీగానే పడింది. బాలీవుడ్‌కు చెందిన చాలా సినిమాల సెట్టింగులు దెబ్బ తిన్నాయి. వందల కోట్ల నష్టం వాటిల్లింది. కేవలం మైదాన్ అనే సినిమాకు సంబంధించి తుపాను కారణంగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లిందట. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత బోని కపూర్ మీడియాకు వెల్లడించారు. అజయ్ దేవగణ్ హీరోగా బోనికపూర్ నిర్మిస్తున్న మైదాన్ చిత్రం కోసం భారీ సెట్‌ను ముంబైలో వేశారు. అయితే తౌటే తుఫాన్ దాటికి ఆ సెట్ పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో బోనికపూర్ మాట్లాడుతూ..‘గతేడాది లాక్డౌన్ సమయంలో మైదాన్ కోసం వేసిన సెట్‌ను తొలిసారి కూలగొట్టాం. ఆ తర్వాత మళ్లీ రెండోసారి సెట్ వేసి చిత్రీకరించాం. ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మరోసారి సెట్ నిర్మించాం. అయితే ప్రస్తుత తౌటే తుఫాన్ ధాటికి మళ్లీ సెట్ అంతా కూలిపోయింది. దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది ’అని బోనికపూర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
Uddhav Thackeray: గాలిలో చక్కర్లు కొట్టలేదు కదా!
ముంబై: తుపాను ప్రభావిత కొంకణ్ ప్రాంతంలో తన పర్యటనపై ప్రతిపక్ష బీజేపీ చేస్తున్న విమర్శల పట్ల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. తాను హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేయలేదని, క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నానని శనివారం చెప్పారు. గాలిలో చక్కర్లు కొట్టలేదని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. మోదీ ఇటీవలే గుజరాత్లో ఏరియల్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం కొంకణ్ ప్రాంతంలోని రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో పర్యటించారు. తుపాను వల్ల నష్టపోయిన ప్రజలను రెండు రోజుల్లోగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఉద్ధవ్ ఠాక్రే కేవలం 3 గంటలపాటే పర్యటించడాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. 3 గంటల్లోనే పంట నష్టాన్ని ఎలా తెలుసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ఉద్ధవ్ ఠాక్రే బదులిస్తూ.. తాను ఫొటోల కోసం హెలికాప్టర్లో పర్యటనకు వెళ్లలేదని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి వెళ్లానని అన్నారు. (చదవండి: ఢిల్లీలో మూతబడ్డ వ్యాక్సినేషన్ కేంద్రాలు) -
వైరల్ వీడియో: ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
-
ఒక్కటైన ఆ గుంపును ‘టౌటే’ కదిలించలేకపోయింది!
గాంధీనగర్: ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు...ఆ బలానికి ఉండే శక్తి ఎలాంటిదంటే పెను తుపానునైనా ఎదిరించి నిలవగలదు. టౌటే తుపాను సాక్షిగా మరోసారి ఈ సత్యం సాక్షాత్కరించింది. మే 18న గంటకు 140 కిలోమీటర్ల వేగంతో టౌటే తుపాను గుజరాత్లో తీరం దాటింది. ఆ సమయంలో భారీ సైజు నిర్మాణాలే చిగురుటాకుల వణికి పోయాయి. అరేబియా సముద్రంలో నౌకలు కొట్టుకుపోయాయి. కానీ గుజరాత్‌లోన గదదలో ఇంటి బీమ్‌కి వేలాడుతున్నతేనేటీగలు ఆ తుపాను ఎదిరించాయి. పరిమాణంలో చిన్నవైన తేనేటీగలు ఒకదాన్నొకటి గట్టిగా పట్టుకుని ప్రచండ గాలులును కాచుకున్నాయి. ఐకమత్యం స్ఫూర్తిని నిలిపాయి. -
‘పీ 305’ ప్రమాదంలో 49 మంది మృతి
ముంబై: భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్ బోట్ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. టౌటే తుపాను ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన పీ–305 బార్జ్ సోమవారం మునిగిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళ విపత్తు సహాయ బృందం గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ తేజ్‌లతో పాటు పీ–81 నిఘా విమానం, ఇతర నౌకాదళ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. మొత్తంగా 600 మందికిపైగా ఓఎన్జీసీ సిబ్బందిని కాపాడామని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. పశ్చిమతీరంలోని చమురు వెలికీతీత కేంద్రాల్లోని మొత్తం 6,961 ఉద్యోగులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ తేలిగ్గా తీసుకున్నాడు టౌటే తుపాను హెచ్చరికను పీ–305 బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ తేలికగా తీసుకున్నారని దాని చీఫ్ ఇంజనీర్ రహమాన్ షేక్ ఆరోపించారు. గాలుల వేగం పెద్దగా ఉండదని, తుపాన్ ప్రభావం గంటసేపు మాత్రమే ఉంటుందని చెబుతూ... హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి కారణమయ్యారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమాన్ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. కెప్టెన్ బల్విందర్ గల్లంతైన వారిలో ఉన్నారు. -
Cyclone Tauktae: కడలి కబళించింది
ముంబై: టౌటే తుపాను కారణంగా సముద్రంలో కొట్టుకుపోయి, మునిగిపోయిన పీ 305 బార్జ్‌లోని సిబ్బందిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది ఆచూకీ తెలియరాలేదు. 186 మందిని నౌకాదళం రక్షించింది. సముద్రంలో అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ బార్జ్‌పై మొత్తం 261 మంది (తొలుత 273 మంది అని ప్రకటించినా దీనిని నిర్వహిస్తున్న కంపెనీ 261 మందే ఉన్నారని బుధవారం తెలిపింది) సిబ్బంది ఉన్నారు. ‘గల్లంతైన వారిని గుర్తించి, రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని రక్షించే అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని నౌకాదళ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో రెండు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారన్నారు. జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్‌లోని మొత్తం 137 మంది సిబ్బందిని మంగళవారమే నేవీ, కోస్ట్‌గార్డ్స్ రక్షించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ (సపోర్ట్ స్టేషన్) 3 బార్జ్‌లోని 196 మంది సిబ్బంది, సాగర్ భూషణ్ ఆయిల్ రిగ్‌పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నారని నేవీ వెల్లడించింది. చనిపోయిన 26 మంది మృతదేహాలను ఐఎన్ఎస్ కొచి యుద్ధనౌకలో ముంబైకి తీసుకువచ్చారు. ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ తల్వార్, పీ 81 యుద్ధ విమానం, సీ–కింగ్ చాపర్లు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఎస్సీఐ వినియోగిస్తున్న నౌకలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పీ 305 బార్జ్ సోమవారం సాయంత్రం నుంచి సముద్రంలో మునగడం ప్రారంభమయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇది అత్యంత క్లిష్టమైన గాలింపు, సహాయ కార్యక్రమమని డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మురళీధర్ సదాశివ్ పవార్ వ్యాఖ్యానించారు. సహాయం కోరుతూ అభ్యర్థన వచ్చిన వెంటనే రంగంలోకి దిగామని, సోమవారం నుంచి సమన్వయంతో, సముద్రంలో నెలకొన్న దారుణమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ గాలింపు, సహాయ చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై పీఎం ఆరా టౌటే తుపాను వల్ల అరేబియా సముద్రంలో మునిగిపోయిన బార్జ్ పీ 305లోని సిబ్బందిని రక్షించే సహాయ చర్యలపై బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. నేవీ సీనియర్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం బార్జ్ మునిగిపోతోంది. మరో మార్గం లేదు... అరేబియా సముద్రంలోకి దూకేయడమే. చుట్టూ చిమ్మచీకటి, 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు. బలమైన గాలులు. లైఫ్ జాకెట్లు వేసుకున్నా... కల్లోల కడలిలో ఏం జరుగుతోందోననే భయం. ఎవరైనా సాయానికి వస్తారా? ఎప్పటికి చేరుకుంటారు? అసలు బతికి బట్టకడతామా? జలసమాధి కావాల్సిందేనా? ఎన్నెన్నో ప్రశ్నలు. భయాలు. ఏకంగా 12 గంటలపాటు జీవన్మరణ పోరాటం... చివరకు మంగళవారం ఉదయం నేవీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రక్షించిన వారిలో 125 మందిని ఐఎన్ఎస్ బుధవారం ముంబైకి తీసుకొచ్చింది. ముంబైకి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో హీరా ఆయిల్‌ఫీల్డ్ ఉంది. ఇందులో పనిచేసే వారికోసం పీ–305 బార్జ్పైన తాత్కాలిక నివాసాలున్నాయి. టౌటే తుపాను తీవ్రతకు సోమవారం దీని లంగరు తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాత్రికి మునిగిపోయింది. అప్పుడు దీనిపై 261 మంది ఉన్నారు. వీరిలో 186 మందిని నేవీ రక్షించింది. అచ్చు టైటానిక్ దృశ్యాలే ‘‘టైటానిక్ ఓడ మునిగిపోవడం, అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో నీళ్లలో దూకేయడం, చుట్టూ శవాలు, వాటి మధ్యలో కొందరి జీవన్మరణ పోరాటం... ఇవన్నీ ప్రజలు సినిమాలో చూసుంటారు. కానీ మా కళ్ల ముందే ఇదంతా జరిగింది. టైటానిక్ కంటే దారుణంగా ఉండింది పరిస్థితి. చుట్టూ నీళ్లపై మా సహచరుల మృతదేహాలు తేలియాడుతున్నాయి. లైఫ్‌జాకెట్ సహాయంతో 14 గంటలు అలా నీళ్లపై తేలుతూ ఉన్నాను. ఏమీ కాదు.. బతుకుతామని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. చివరకు నేవీ సిబ్బంది దేవుళ్లలా వచ్చి కాపాడారు’ అని 28 ఏళ్ల విశ్వజీత్ బంద్‌గార్ తెలిపారు. ‘అత్యంత భీతావహ పరిస్థితి. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బతికి బయటపడతానని అనుకోలేదు. ఏడు, ఎనిమిది గంటల పాటు అలా నీళ్లలో ఈదుతూ ఉన్నాను. చివరికి నేవీ వచ్చి రక్షించింది.’ అని మనోజ్ గీతే తెలిపాడు. కొల్హాపూర్‌కు చెందిన 19 గీతే నెలరోజుల కిందటే హెల్పర్‌గా ఆయిల్రిగ్పై పనికి కుదిరాడు. పీడకల లాంటి అనుభవం తర్వాత మళ్లీ తాను రిగ్‌పైకి వెళ్లబోనని తేల్చిచెప్పాడు. ‘బతికున్నాను... అదే సంతోషం’ అన్నాడు. తుపాను దెబ్బకు తన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ సముద్రంలో కలిసిపోయాయన్నాడు. నేవీ వల్లే బతికాం.. లేకపోతే ఏమయ్యేదో... అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు మరో కార్మికుడు. -
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి
ముంబై : ఓ వైపు కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతుంటే టౌటే తుఫాన్ మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను ధాటికి ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. మే నెలలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 230 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. తుపాను ప్రభావంతో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక టౌటే తుపాను తనకు కూడా ఎంతో నష్టం కలిగించిందని నటి రాఖీ సావంత్ తెలిపారు. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు తన ఇంటి బాల్కనీ పైకప్పు కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఇది చూసి తానెంతో బాధపడుతున్నానని, నిన్నటి నుంచి పైకప్పు నుంచి పడుతున్న వర్షపు నీటిని బకెట్‌తో బయట పారబోశానని తెలిపింది. అంతేకాకుండా తుపాను ధాటికి చెట్లు విరిగిపోవడం గురించి స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే ఇలా చెట్లు విరిగిపోతే మనకు ప్రాణవాయువు ఎక్కడినుంచి వస్తుంది? ఇంకా దేవుడు ఏమేం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టౌటే తుపాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికి 100 మంది వరకు గల్లంతయినట్టు సమాచారం. ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా ఉన్న టౌటే మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ Amitabh Bachchan: ఆఫీసును ముంచెత్తిన వరద -
టౌటే ఎఫెక్ట్: గుజరాత్‌కు రూ.వెయ్యి కోట్ల తక్షణ సాయం
గుజరాత్: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ పశ్చిమ తీరంలో పెను విధ్వంసం సృష్టించింది. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అతి భీకరంగా విరుచుకుపడ్డ ఈ తుఫాన్‌తో భారీ ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, డయూలో పర్యటించారు. గుజరాత్లో సహాయ చర్యల కోసం రూ.వెయ్యి కోట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్ జిల్లాలు, డయూలలో ప్రభావిత ప్రాంతాలపై వైమానిక సర్వే నిర్వహించిన తర్వాత ప్రధాని ఈ ప్రకటన చేశారు. అలాగే, ఈ తీవ్ర తుపాను కారణంగా మరణించిన కుటుంబాలకు రాష్ట్రాలతో సంబందం లేకుండా రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. గుజరాత్‌కు తక్షణ సహాయం కింద ఒకేసారి రూ.1,000 కోట్ల అందించనున్నట్లు కేంద్రం పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఈ విపత్తు వల్ల జరిగిన నష్టాల స్థాయిని అంచనా వేయడానికి ఒక అంతర్-మంత్రి బృందం రాష్ట్రాన్ని సందర్శించిన తర్వాత మరింత సహాయాన్ని విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి పరిస్థితిని ప్రధాని మోదీ అధికారులను అడిగి తెలుసకున్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, అధికారులు ఉన్నారు. ఇతర తుపాను బాధిత రాష్ట్రాలు నష్ట స్థాయిని కేంద్రంతో పంచుకున్న తర్వాత వెంటనే ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ రాష్ట్రంలో తుఫాను సంబంధిత సంఘటనల్లో 45 మంది మరణించారు. టౌటే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చదవండి: టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి -
టౌటే బీభత్సం: ప్రభావిత ప్రాంతాలలో ప్రధాని ఏరియల్ సర్వే
అహ్మదాబాద్: అత్యంత తీవ్ర తుపాను ‘టౌటే’ పెను విధ్వంసం సృష్టించింది. ఇక తీర ప్రాంత జిల్లాల్లో పెను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అహ్మదాబాద్ సహా గుజరాత్ రాష్ట్రంలోని 35 తాలూకాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్‌తో భారీ ఆస్థి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుజరాత్, డయూలో పర్యటించారు. ఉనా, డయూ, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇందులో ప్రధాని వెంట గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. తుఫాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. తదుపరి సహాయక చర్యలు, తుఫాను కారణంగా వాటిల్లిన నష్టానికి సంబంధించి మరికాసేపట్లో ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ( చదవండి: CycloneTauktae: గుజరాత్ అతలాకుతలం ) #WATCH | Prime Minister Narendra Modi conducts an aerial survey of the #CycloneTauktae affected areas of Gujarat and Diu The PM is conducting an aerial survey of areas such as Una, Diu, Jafarabad, and Mahuva today. He will also hold a review meeting in Ahmedabad later. pic.twitter.com/B3C4qamBwp — ANI (@ANI) May 19, 2021 -
టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి
ముంబై: రెండు రోజుల క్రితం ‘టౌటే’ తుపాను ధాటికి ముంబై తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో 261 మంది ప్రయాణిస్తున్న బార్జ్ పీ-305 భారీ నౌక పెద్ద బండ రాయిని ఢీకొనడంతో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ ఘటనలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న నేవీ 22 మంది మృతదేహాలను బుధవారం గుర్తించి వెలికి తీసింది. ఇప్పటి వరకు బార్జ్ పీ-305లో నౌకలో ప్రయాణిస్తున్న 188 మందిని నావికా దళ సిబ్బంది కాపాడింది. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా 51 మంది ఒఎన్జీసీ కార్మికులు కనిపించలేదు. నావికా నౌకలు టెగ్, బెట్వా, బియాస్, అలాగే పీ 8ఐ విమానం, సీ కింగ్ హెలికాప్టర్లు సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు నావికా దళం పేర్కొంది. అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గాల్ కన్స్ట్రక్టర్కు చెందిన బార్జ్ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. ఎస్ఎస్-3 అనే బార్జ్‌పై ఉన్న 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్ రిగ్ ‘సాగర్‌భూషణ్’పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సముద్రంలో నెలకొన్న కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. చదవండి: ముంబైని అతలాకుతలం చేసిన తుపాను -
టౌటే ఎఫెక్ట్: ముంబై తీరంలో కొట్టుకుపోయిన 3 నౌకలు
-
గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన
-
టౌటే ఎఫెక్ట్; మూగబోయిన టీవీలు.. నిలిచిపోయిన ఇంటర్నెట్
ముంబై (మహారాష్ట్ర): టౌటే తుఫాన్ ప్రభావంతో సోమవారం అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాటిని విద్యుత్ అధికారులు మరమ్మతులు చేసి పునరుద్ధరిస్తున్నప్పటికీ, ఆ స్తంభాలు, చెట్ల మీదుగా వెళ్లే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు తెగిపోవడంతో మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నీటి పైపులు, విద్యుత్ కేబుళ్లు, డ్రైనేజీ లైన్లు భూగర్భంలో నుంచే ఉన్నాయి. అయితే, వాణిజ్య, వ్యాపార సంస్థలకు, కార్యాలయాలకు, నివాస భవనాలకు, చాల్స్, మురికివాడలకు కొన్ని ప్రైవేటు సంస్థలు ఇంటర్నెట్ సేవలు, టీవీ కేబుల్ కనెక్షన్లు ఇస్తున్నాయి. వీటికి సంబంధించిన కేబుల్ వైర్లు భూగర్భంలో నుంచి లేవు. చెట్ల కొమ్మల మీదుగా లేదా విద్యుత్ స్తంభాల మీదుగా, ఎత్తయిన భవనాల టెరెస్ల పైనుంచి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వైర్లు వేసి, ఇంటింటికి కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాయి. సోమవారం ఉదయం నుంచి టౌటే తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాల మీదుగా వెళ్లిన టీవీ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుళ్లు తెగిపోయాయి. అక్కడక్కడా అమర్చిన రిలే బాక్స్‌లలోకి వర్షపు నీరు వెళ్లడంతో షార్ట్ సర్క్యుట్ అయ్యి కాలిపోయాయి. ఫలితంగా మంగళవారం ఉదయం నుంచి అనేక ఇళ్లలో టీవీలు మూగబోయాయి. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు, వ్యాపారులు ఖాళీగానే కూర్చున్నారు. ఇదిలావుండగా కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో గత నెల రోజులుగా అనేక మంది ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీ చూడటం లేదా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేయడం తప్ప వారికి మరో ప్రత్యామ్నాయం లేదు. సోమవారం రాత్రి నుంచి కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ఏం చేయాలో తెలియక వారు గందరగోళంలో పడిపోయారు. లాక్డౌన్ కాబట్టి బయటకు వెళితేనేమో పోలీసుల లాఠీ దెబ్బలు, చివాట్లు తప్పవు. కేబుల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో చిన్న పిల్లలు, విద్యార్థులు, యువతీ యువకులు, గృహిణులు రోజంతా ఇంట్లో కాలక్షేపం ఎలా చేయాలని ప్రశ్నించుకుంటున్నారు. గత్యంతరం లేక కేబుల్ ఆపరేటర్లకు ఫోన్లు చేస్తున్నారు. ఇలా తరచూ వందల ఫోన్లు వస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లు విసుగెత్తిపోతున్నారు. మరోపక్క లాక్డౌన్ ఆంక్షలతో విద్యుత్ సామగ్రి విక్రయించే షాపులన్నీ మూసి ఉంటున్నాయి. దీంతో కేబుల్ వైర్లు, విద్యుత్ పరికరాలు, రిలే బాక్స్‌లు దొరకడం లేదు. పైగా, టీవీ కేబుల్ సేవలు ప్రారంభించాలని కస్టమర్ల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో కేబుల్ ఆపరేటర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి పెడుతున్నారు. కేబుల్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావాలంటే ఎంత సమయం పడుతుందనేది ఇప్పుడే చెప్పలే మని ఆపరేటర్లు వాపోతున్నారు. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో 23న అల్పపీడనం
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమబెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ నెల 25, 26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 23న అల్పపీడనం ఏర్పడినా, బలపడి తుపానుగా మారినా నైరుతి రుతువపనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. 21న అండమాన్ సముద్రంలోకి ‘నైరుతి’.. మరోవైపు ఈనెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే అంటే.. ఈనెల 31న కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. పెరిగిన ఉష్ణోగ్రతలు కాగా, మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీనికితోడు ఉక్కబోత వాతావరణం నెలకొంది. రానున్న 3 రోజులు వాతావరణం మరింత వేడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయన్నారు. ఇదిలావుంటే.. వచ్చే 2 రోజుల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండుచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు. -
హోరున గాలివాన: యముడు లీవ్‌లో ఉన్నాడేమో, లేదంటే!
సాక్షి, ముంబై: తౌక్టే తుపానుతో మహారాష్ట్ర, గుజరాత్, కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కరోనాతో అల్లాడుతున్న ముంబై నగరంపై తౌక్టే మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయ్యాయి. వరద తాకిడికి భారీ సంఖ్యలో చెట్లు, భవనాలు కూలిపోయాయి. ఈక్రమంలోనే ముంబైలో సోమవారం వెలుగుచూసిన ఓ ఘటన భయంగొల్పేదిగా ఉంది. ఈ వీడియో దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో ప్రకారం.. వర్షం పడుతుండటంతో ఓ యువతి గొడుగు పట్టుకుని రోడ్డు వెంట వెళుతోంది. అంతలోనే మరింత గాలి వీయడం, వర్షం కురియడంతో ఆమె తన గొడుగుని ఇంకాస్త అడ్డుగా పెట్టుకుని ముందుకు కదిలింది. అయితే, ఆమెకు అతి సమీపంలో, రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం గాలి వాన ప్రభావంతో ఒక్కసారిగా అడ్డంగా విరిగింది. గొడుగు అడ్డు పెట్టుకుని అటువైపుగా వెళ్తున్న ఆ యువతి ప్రమాదాన్ని గ్రహించి.. క్షణ కాలంలో అక్కడ ఉంచి పరుగెత్తింది. దాంతో చెట్టు భాగాలు ఆమెకు అడుగు దూరంలో నేలకూలాయి. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘ఈరోజు యమధర్మరాజుకు సెలవు. లేదంటే ఆ యువతి ప్రాణాలు హరీ మనేవి’ అని ఒకరు... ‘క్షణకాలం ఆలస్యమైతే ఆమె పరిస్థితి ఏమయ్యేదో. ఊహించేందుకే భయంగా ఉంది’ అని మరొకరు కామెంట్లు చేశారు. అదృష్టం అంటే ఇదే మరి, అప్రమత్తంగా వ్యవహరించి అపాయం నుంచి గట్టెకింది అని మరొకరు అన్నారు. తనకు కూడా ఇటువంటి అనుభవం ఎదురైందని ఓ నెటిజన్ వీడియో షేర్ చేశారు. -
Photo Feature: ‘పరీక్ష’ కాలం.. తుపాను కల్లోలం
కోవిడ్ విజృంభణ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మరోవైపు రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వి వ్యాక్సిన్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కరోనా కష్టాలతో విలవిల్లాడుతున్న ప్రజలను ‘టౌటే’ పెను తుపాను వణికించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. -
Taukte Cycole: ముంబైని అతలాకుతలం చేసిన తుపాను
ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను సోమవారం నాటికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెందింది. ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం, ఈదులు గాలులు వీచాయి. తుపాను గుజరాత్ తీరం వైపు కదలుతున్న క్రమంలో ముంబైలో భారీ నష్టాన్ని మిగిల్చింది. తుపాను మూలంగా భారీ ఈదురు గాలులు ముంబై నగరాన్ని తాకడంతో సిటీలోని అతి పెద్ద వ్యాక్సినేషన్ సెంటర్ అయిన బీకేసీ భారీ నష్టాన్ని చవి చూసింది. టౌటే తుపాను కారణంగా ముంబైలో 230 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మేలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో ఇంత భారీ వర్షపాతం నమోదవ్వడం చరిత్రలో ఇదే ప్రథమం అని ఓ వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. నగరం అంతట పగటిపూట భారీ వర్షపాతం, బలమైన ఈదురు గాలులు వీచాయి. రాబోయే 24 గంటల్లో ముంబై, శివారు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని.. గంటకు120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ మంగళవారం అంచనా వేసింది. తుపాను ప్రభావంతో వ్యాక్సినషన్ కేంద్రాల్లో భారీ నష్టం చోటు చేసుకుంది. భారీ గాలుల వల్ల బీకేసీ, బాంద్ర కుర్ల కాంప్లెక్స్ వ్యాక్సినేషన్ కేంద్రాల రూపు రేఖలు మారిపోయాయి. భారీ వర్షం మూలంగా వీధుల్లో నీరు నిలిచిపోయి చెరువులను తలపించాయి. తూర్పు-పడమర కనెక్టివిటీకి కీలకమైన హింద్మాతా జంక్షన్, అంధేరి సబ్వే, మలాడ్ సబ్వేతో సహా ఆరు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షం నీరు నిలిచిపోయిందని ముంబై పోలీసులు ట్వీట్ చేశారు. ముంబైలోని బాంద్ర వద్ద టౌటే తుపాను కారణంగా ముంబై, బాంద్రాలోని బాంద్రా-వర్లి సముద్ర లింక్ మూసివేశారు. టౌటే తుపాను కారణంగా బలమైన గాలులు వీచడంతో అపార్ట్మెంట్ ఎదుట కూలిపోయిన చెట్లను తొలగిస్తున్న స్థానికులు. భారీ వర్షం కారణంగా పలు రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. బలమైన గాలుల కారణంగా, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) వద్ద సబర్బన్, ప్రధాన మార్గాల మధ్య సాధారణ ప్రయాణీకుల ప్రాంతం పైకప్పును కప్పి ఉంచే కొన్ని ప్లాస్టిక్ షీట్లు ఎగిరిపోయాయి. టౌటే తుపాను వల్ల అలలు రోడ్డుపైకి దూసుకువచ్చాయి. చదవండి: Fact Check: ఇది నిజంగా ముంబైలో జరిగిందా? -
ఇది నిజంగా ముంబైలో జరిగిందా?
-
Fact Check: ఇది నిజంగా ముంబైలో జరిగిందా?
ముంబై: అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపానుగా రూపం దాల్చిన ‘టౌటే’ మహారాష్ట్ర, గుజరాత్లో పెను విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ముంబై, థానెల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను వణికించాయి. ఈ క్రమంలో వరద బీభత్సానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ముంబైలోని ట్రిడెంట్ హోటల్ ముందు పార్కు చేసిన కార్లపై పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు తుపాను తీవ్రతను తెలియజేస్తున్నాయంటూ కొంత మంది నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. అయితే, ఇది టూటే తుపానుకు సంబంధించినది కాదని, 2020 నాటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయని ఆలిండియా రేడియో న్యూస్ ముంబై స్పష్టం చేసింది. రివర్స్ ఇమేజ్ టెక్నిక్‌తో సర్చ్ చేసి చూడగా, పాత వీడియో అని తేలినట్లు పేర్కొంది. ఇందుకు రుజువుగా, ట్రిడెంట్ హోటల్ ముందున్న ప్రస్తుత పరిస్థితులకు అద్దంపట్టే దృశ్యాలను జత చేసింది. ఇక తాము వైరల్ చేస్తున్నది పాత వీడియో అని తెలియడంతో నెటిజన్లు నాలుక్కరచుకుంటున్నారు. మరికొంత మందేమో.. ఏది నిజమో.. ఏది అబద్దమో తెలియకుండా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు మరింత బెంబేలెత్తిపోయేలా చేయవద్దంటూ హితవు పలుకుతున్నారు. వాస్తవం: వైరల్ వీడియో ముంబైకి సంబంధించినది కాదు. 2020లో సౌదీ అరేబియాలో జరిగిన ఘటనకు సంబంధించింది. చదవండి: Cyclone Tauktae: తీరం దాటిన ‘టౌటే’ -
Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ‘తౌక్టే’ పెను విధ్వంసం
ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్: గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను ‘‘తౌక్టే’’ సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ‘రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది’ అని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు. తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను ‘తౌక్టే’ ను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘టౌటే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. పోర్ట్ల్లో ప్రమాద హెచ్చరికలు గుజరాత్‌లోని పోరు బందరు, మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య సోమవారం ‘తౌక్టే’ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిమీ నుంచి 165 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. రంగంలోకి నేవీ బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని మహువాలో భీకరగాలుల ధాటికి చెట్లు కూలడంతో నిలిచిన ఆక్సిజన్ సిలిండర్ల ట్రక్కు వణుకుతున్న గుజరాత్ భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. ‘తౌక్టే’ తీరాన్ని దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను టౌటేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు. సీఎంలతో ప్రధాని సమీక్ష తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు. మహారాష్ట్రలో బీభత్సం మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో ‘తౌక్టే’ తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
Cyclone Tauktae: టౌటే ఉగ్రరూపం
పుట్టుకొచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే మహోగ్రంగా రూపుదాల్చిన టౌటే తుపాను గుజరాత్లో తీరం దాటబోతోంది. ఒకపక్క కరోనా వైరస్ మహమ్మారితో దేశమంతా పోరాడుతున్న వేళ పడమటి తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లను ఈ తుపాను వణికించింది. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం తుపానులకు నిలయాలు. గత అయిదు దశాబ్దాల్లో వచ్చిన తుపానులు, వరదలు, ఇతరత్రా తీవ్ర వాతావరణ పరిస్థితులవల్ల దాదాపు లక్షన్నరమంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఈ తుపానుల కారణంగా జరిగే ఆస్తుల విధ్వంసం కూడా అపారమైనది. కోట్లాది రూపాయల విలువైన పంట నాశనమవుతుంది. లక్షల ఇళ్లు దెబ్బతింటాయి. బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా సముద్రంలో తుపానుల తాకిడి మొదటినుంచీ తక్కువే. కానీ ఇదంతా మారింది. ఇప్పుడు బంగాళాఖాతంతో సమానంగా అరేబియా సముద్రంలోనూ తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడో అరుదుగా తుపానులేర్పడే ఈ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా ఏటా రుతుపవనాల రాకకు ముందు ఠంచనుగా ఒక తుపాను తప్పడం లేదు. ఈ నాలుగు తుపానుల్లో మూడు గుజరాత్, మహారాష్ట్రలను తాకగా 2018లో వచ్చిన మెకాను తుపాను ఒమన్ దేశంపై విరుచుకుపడింది. నిరుడు కరోనాపై పోరుతో మహారాష్ట్ర సతమతమవుతుండగా నిసర్గ తుపాను విరుచుకుపడింది. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏమంటే...ముంబై మహానగరం వందేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయి ఉపద్రవాన్ని చవిచూడబోతున్నదని నిపుణులు అంచనా వేసినా తీరం దగ్గరవుతుండగా అది బలహీనపడింది. ఆరుగురు మరణించడంతోపాటు పెనుగాలులతో ఇళ్లు కూలడం, చెట్లు విరిగిపడటంవంటి ఉదంతాలైతే తప్పలేదు. ఉష్ణమండల తుపానులకు సముద్ర జలాలు వేడెక్కడం ప్రధానమైన షరతు. ఆ వేడి జలాలే తుపానుల పుట్టుకకు కారణం కావడంతోపాటు, వాటికి కావలసినంత శక్తిని సమకూరుస్తాయి. బంగాళాఖాతంలోని జలాలు ఎప్పుడూ 28 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతతో వుంటాయి. కనుకనే అక్కడ తుపానుల తాకిడి అధికం. దాంతో పోలిస్తే అరేబియా సముద్ర జలాలు ఎప్పుడూ ఒకటి, రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతల్లో వుండేవి. కానీ నానాటికీ పెరుగుతున్న భూతాపం దీన్ని తలకిందులు చేసింది. గత వందేళ్లలో అరేబియా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. తరచు అవి పరిమితులను దాటుతున్నాయి. సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఉపరితలంలో 50 మీటర్లలోతు వరకూ వుండే నీరు ఆవిరై భారీ వర్షాలకూ, పెను తుపానులకూ దారితీస్తుంది. వాతావరణంలోకి ఏమేరకు ఆవిరి విడుదలవుతుందో ఆ మేరకు వాతావరణ పీడనం పడిపోతుంది. ఒకసారంటూ అల్పపీడనం ఏర్పడితే అది వివిధ స్థాయిల్లోకి పరివర్తన చెందడం తప్పదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం సగటున ఏటా అయిదు తుపానులు తీసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలోని తుపానులు ఎక్కువగా లక్షద్వీప్ సమీపంలో బయల్దేరతాయి. వేరే దేశాలవైపు సాగిపోతాయి. కానీ ఇటీవలకాలంలో ఈ ధోరణి కూడా మారుతోంది. ఓఖ్రి, ఫణి, ఆంఫన్ తుపానులు నిజానికి చాలా బలహీనంగా మొదలై అతితక్కువ వ్యవధిలో తీవ్రత పెంచుకోవడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని నానుడి. కానీ వాతావరణ అధ్యయనంలో రూపొందే నమూనాలు ఆ పరిస్థితిని చాలావరకూ మార్చాయి. అయితే పర్యావరణం సైతం శాస్త్రవేత్తలతో పోటీ పడుతూ రూపు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది. ఎంతో అధునాతన సాంకేతిక సంపత్తితో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నా, సముద్ర జలాల తీరుతెన్నులు దానికి అందకుండా పోతున్నాయి. ఇలా దోబూచులాడుతూ విరుచుకుపడే తుపానులు ప్రభుత్వాలకు తలనొప్పి సృష్టిస్తాయి. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన వ్యవధి దొరకదు. తుపానుల రాకడనూ, వాటి నడతనూ, తీవ్రతనూ అంచనా వేయడానికి ఆకాశంలో తిరుగాడే ఉపగ్రహాలు మొదలుకొని సముద్ర తీరాల్లో అమర్చే పరికరాల వరకూ అన్నింటి అవసరమూ శాస్త్రవేత్తలకు వుంటుంది. ఈ సమస్త డేటానూ వినియోగించి వేర్వేరు నమూనాలను రూపొందించి, ఏమేరకు తీవ్రత పెరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు అంచనాకొస్తారు. తుపానులైనా, ఇతర విలయాలైనా భూతాపం పెంచే కార్యకలాపాలకు దూరంగా వుండాలని మనిషిని హెచ్చరిస్తున్నాయి. 2030కల్లా భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ మేర తగ్గించాలని 2015నాటి పారిస్ ఒడంబడిక లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్ ఏలుబడిలో అమెరికా ఆ ఒడంబడికనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా, బైడెన్ వచ్చాక ఆ నిర్ణయాన్ని మార్చారు. అయితే ఆస్ట్రేలియా, కొన్ని ఇతర దేశాల శాస్త్రవేత్తలు మాత్రం ఆ లక్ష్యసాధన అసాధ్యమన్నట్టు ఇటీవల మాట్లాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే... ధనిక దేశాలు వెనకబడిన దేశాలకు ఉదారంగా పర్యావరణ అనుకూల సాంకేతికతలను బదిలీ చేస్తే పెద్ద కష్టంకాదని నిపుణులు చెబుతున్న మాట. ఈ విషయంలో బ్రిటన్, యూరప్ యూనియన్ ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకు గ్లాస్గోలో జరగబోయే కాప్–26 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకించి పారిస్ ఒడంబడిక ప్రధాన లక్ష్యాన్ని సాధించడంపై కార్యాచరణను ఖరారు చేయబోతోంది. ఇవన్నీ సక్రమంగా అమలైతేనే భూగోళం సురక్షితంగా మనగలుగుతుంది. -
అతిభీకర తుపానుగా మారిన తాక్టే
-
అతి తీవ్ర తుపానుగా మారిన తాక్టే తుపాను
సాక్షి, న్యూఢిల్లీ: తాక్టే తుపాను అతి తీవ్ర తుపానుగా మారింది. ముంబైకి 150 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గుజరాత్ దిశగా పయనిస్తోన్న తౌక్టే తుపాను గంటకు 20 కి.మీ. వేగంతో కదులుతోంది. సాయంత్రం గుజరాత్ తీరాన్ని తాకనుంది. పోర్బందర్-మహువా మధ్య తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణకు వర్ష సూచన.. తౌక్టే తుపాను ప్రభావంతో రాగల మూడు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ‘తౌక్టే’ అంటే... తీవ్రమైన తుపానుగా మారుతున్న ‘తౌక్టే’ అంటే అర్థమేమిటో తెలుసా. తౌక్టే అంటే బర్మీస్ భాషలో గెకో... ‘గట్టిగా అరిచే బల్లి’. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్ దేశం పెట్టిన పేరిది. మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్/ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలున్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది. చదవండి: ‘‘2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది’’ కోరలు చాస్తున్న బ్లాక్ ఫంగస్: 16 మంది మృతి -
Cyclone Tauktae: అత్యంత తీవ్ర తుపానుగా తౌక్టే
న్యూఢిల్లీ/బెంగళూరు/అహ్మదాబాద్: కరోనా విజృంభనకు తోడు తుపాను ‘తౌక్టే’ తీర రాష్ట్రాలను వణికిస్తోంది. తౌక్టే అత్యంత తీవ్రమైన తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ ఆదివారం ప్రకటించింది. మంగళవారం ఉదయం తీరం దాటనున్న గుజరాత్ తీర ప్రాంతంలో ‘ఆరెంజ్ అలర్ట్’ను జారీ చేసింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం తీవ్రమై తుపానుగా మారిన విషయం తెలిసిందే. తౌక్టే ఉత్తర– వాయవ్య దిశగా గుజరాత్ తీరం వైపు దూసుకు వస్తోందని, సోమవారం రాత్రి గుజరాత్ తీరానికి చేరువవుతుందని వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున పోరుబందరు– మహువ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది. తీరం దాటే సమయంలో అత్యంత తీవ్రమైన వేగంతో.. గంటకు 145 నుంచి 175 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దక్షిణ మహారాష్ట్ర, గోవా, సమీప కర్ణాటక తీర ప్రాంతాల్లోనూ ఈ గాలుల వేగం గంటకు 140– 150 కిమీల వరకు ఉంటుందని తెలిపింది. డయ్యూడామన్ తీర ప్రాంతానికి కూడా ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసినట్లు తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర తీరంలో సోమవారం నుంచే గంటకు 65 నుంచి 85 కిమీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈదురుగాలులకు తోడు ఈ అన్ని తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిం చింది. దక్షిణ గుజరాత్ తీరంలోని పోరుబందర్, జునాగఢ్, గిర్ సోమనాథ్, అమ్రేలీ జిల్లాల్లో, డయ్యూడామన్‌లో గాలుల వేగం మంగళవారం నాటికి తీవ్రమవుతుందని, గంటకు 150 నుంచి 175 కిమీల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. అలాగే ద్వారక, జామ్‌నగర్, భావ్‌నగర్ జిల్లాల్లో మే 18 ఉదయం నుంచి గంటకు 150 నుంచి 165 కిమీల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో జునాగఢ్‌లో అలలు 3 మీటర్ల ఎత్తు వరకు ఎగసే అవకాశముందని తెలిపింది. జునాగఢ్, భావ్‌నగర్ తీవ్రస్థాయిలో ఆస్తి నష్టం జరగవచ్చని పేర్కొంది. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో సమాచార, విద్యుత్ వ్యవస్థలు నిలిచిపోవచ్చని, రైల్వే సేవలకు అంతరాయం కలగవచ్చని హెచ్చరించింది. గుజరాత్ తీరంలో లోతట్టు ప్రాంతాల నుంచి లక్షన్నర మందిని సహా య కేంద్రాలకు తరలించారు. రాష్ట్రానికి చెందిన ఇతర సహాయ బృందాలతో కలిసి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 54 బృం దాలు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటు న్నా యి. మత్స్యకారులను సముద్రంలోకి వెళ్లవ ద్దని కో రామని, ఇప్పటికే వేటకు వెళ్లిన 149 బోట్లలో 107 తిరిగివచ్చాయని సీఎం విజయ్ రూపానీ చెప్పారు. కర్ణాటకలో నలుగురు మృతి తౌక్టే తుపాను కర్ణాటక తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. తీర ప్రాంత జిల్లాల్లోని 98 గ్రామాల్లో ఈ ప్రభావం భారీగా కనిపిస్తోంది. తుపాను కారణంగా ఇక్కడ నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, కొడగు, హసన్, శివమొగ్గ, చిక్మగలూర్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో తుపాను ప్రభావం కనిపించిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా ఈ జిల్లాల్లో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పాటు పండ్ల తోటలకు అపారనష్టం వాటిల్లిందని, రహదారులు ధ్వంసమయ్యాయని తెలిపారు. ప్రధానంగా ఉడిపి జిల్లాలో 23 గ్రామాలు తుపాను బారినపడ్డాయని తెలిపారు. పడవను తీరంలో నిలుపుతున్న వ్యక్తిని మరో బోటు ఢీ కొట్టడంతో ఒకరు(ఉత్తర కన్నడ జిల్లా), విద్యుత్ షాక్‌తో ఒకరు(ఉడిపి), ఇల్లు కూలి ఒకరు (చిక్‌మగళూరు), పిడుగుపాటుకు మరొకరు (శివమొగ్గ) చనిపోయారని వెల్లడించారు. ఇప్పటివరకు తీర ప్రాంతాల్లో 11 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. తీర మల్నాడు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయని, ఈ జిల్లాల్లోని 313 కేంద్రాల్లో సుమారు 64.5 మి.మీ.ల కన్నా ఎక్కువ వర్షపాతం, 15 కేంద్రాల్లో 200 మి.మీ.ల వర్షపాతం నమోదైందన్నారు. ఉడిపి జిల్లాలోని కుందపుర తాలూకా, నాడా స్టేషన్ వద్ద అత్యధికంగా 385 మి.మీ.ల వర్షపాతం నమోదైంద ని వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితిని, సహాయ చర్యలను సీఎం యెడియూరప్ప సమీక్షించారు. కేరళలో ప్రమాదకర స్థాయికి డ్యామ్‌లు కేరళలోని తీర ప్రాంతంలోని పలు డ్యాముల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి పెరిగాయి. ఎర్నాకులం, ఇదుక్కి, మలప్పురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తీర ప్రాంతాల్లోని ప్రజలను సహాయ కేంద్రాలకు తరలించారు. ఎర్నాకులం జిల్లాలోని చెల్లానం తీర గ్రామంపై పెద్ద ఎత్తున అలలు విరుచుకుపడటంతో నౌకాదళం ఆ గ్రామస్తులను కాపాడి, సహాయ కేంద్రాలకు తరలించింది. కొంకణ్, ముంబైల్లో నేడు భారీ వర్షాలు మహారాష్ట్రలోని ఉత్తర కొంకణ్, ముంబై, థానె, పాల్ఘార్‌ల్లో సోమవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముంబైలో ఈదురుగాలులు, వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గోవాలో.. ఆదివారం ఉదయం నుంచే ఈదురుగాలులు, వర్షా లు గోవాలోని పలు ప్రాంతాలను ముంచెత్తాయి. భారీ అలలు తీర ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. తుపాను కారణంగా ఇద్దరు చనిపోయారు. చెట్టు కూలడంతో ఒక బాలిక, బైక్‌పై వెళ్తుండగా విద్యుత్ స్తంభం కూలిపడడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురుగాలుల ధాటికి పలు 33 కేవీ ఫీడర్లు, మహారాష్ట్ర నుంచి గోవాకు విద్యుత్‌ను సరఫరా చేసే పలు 220 కేవీ లైన్లు ధ్వంసమయ్యాయి. పీఎం సమీక్ష రాష్ట్రాల్లో తుపాను సహాయ కార్యక్రమాల సంసిద్ధతను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సమీక్షించారు. ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ముప్పు ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ ఆసుపత్రులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, వాటికి అన్ని సదుపాయాలు అందేలా చూడాలని, టీకా కార్యక్రమానికి విఘాతం కలగకుండా చూడాలని ఆదేశించారు. తీరప్రాంత జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని, కోవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన వర్చువల్ సమావేశంలో తెలిపారు. బోటు మునక.. ఇద్దరు మృతి మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు తీరంలో బోటు మునిగిన దుర్ఘటనలో ఇద్దరు చనిపోగా, ముగ్గురు గల్లంతయ్యారు. మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎమ్మార్పీ ఎల్)కు చెందిన అలయెన్స్ అనే పడవ శనివారం సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో బోటులోని 8 మంది సిబ్బందికిగాను ఇద్దరు చనిపోగా, ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారనీ, మిగతా ముగ్గురి జాడ తెలియాల్సి ఉందని ఎమ్మార్పీఎల్ ఆదివారం వెల్లడించింది. ‘తౌక్టే’ అంటే... తీవ్రమైన తుపానుగా మారుతున్న ‘తౌక్టే’ అంటే అర్థమేమిటో తెలుసా. తౌక్టే అంటే బర్మీస్ భాషలో గెకో... ‘గట్టిగా అరిచే బల్లి’. ప్రస్తుతం తుపాన్‌కు మయన్మార్ దేశం పెట్టిన పేరిది. మయన్మార్ ఎందుకు పెట్టింది అంటే... ఈసారి వాళ్ల వంతు కాబట్టి. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్/ యునైటెడ్ నేషన్స్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ప్యానెల్ తుపాన్లకు పేర్లు పెడుతుంది. ఈ ప్యానెల్‌లోని 13 దేశాలు ఏషియా– పసిఫిక్ ప్రాంతంలో వచ్చే తుపాన్లకు వంతులవారీగా పేర్లు పెడుతుంటాయి. దీంట్లో భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ దేశాలున్నాయి. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున సూచిస్తాయి. ఇలా వచ్చిన మొత్తం 169 పేర్ల నుంచి తుపాన్లకు రొటేషన్ పద్ధతిలో ఆయా దేశాల వంతు వచ్చినపుడు.. వారు సూచించిన పేర్ల నుంచి ఒకటి వాడుతారు. కిందటి ఏడాది అరేబియా సముద్రంలో వచ్చిన తుపానుకు ‘నిసర్గ’గా బంగ్లాదేశ్ నామకరణం చేసింది. వాతావరణ శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ బృందాలు, సాధారణ ప్రజానీకం ప్రతి తుపాన్‌ను ప్రత్యేకంగా గుర్తించడానికి ఈ పేరు ఉపకరిస్తుంది. కన్యాకుమారి తీరంలో అల్లకల్లోలంగా మారిన సముద్రం