విశాఖ నగరంపై కమ్ముకున్న మబ్బులు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి, అమరావతి: అరేబియా సముద్రంలో ఏర్పడిన టౌటే తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో తక్కువ ఎత్తులో దక్షిణ/ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వీటివల్ల రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నంలో ఆదివారం భిన్న వాతావరణం నెలకొంది. పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా.. ఇంకొన్నిచోట్ల ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడ్డారు.
అప్రమత్తమైన వ్యవసాయ శాఖ
తుపాను ప్రభావంతో రాష్ట్రంలో వీస్తున్న ఈదురు గాలులు, చిరు జల్లులతో రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆదివారం ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన చిరు జల్లులు కురిశాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులను అప్రమత్తం చేస్తోంది. చేలల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకోవాలని, పరదాలు కప్పి పంట తడవకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. తడిసిన ఉత్పత్తులను ఆరబెట్టే డ్రైయర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. రైతులు ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న, ధాన్యాన్ని జాగ్రత్త చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈదురు గాలులకు పండ్లు, కూరగాయల పంటలకు నష్టం జరిగే అవకాశం ఉండడంతో అరటి చెట్లకు కర్రలు కట్టి ఊతమిస్తున్నారు. రైతులకు అవసరమైన సాయం అందించేలా అధికారులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ ఆదేశాలిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment