Arabian Sea coast
-
తీరాన్ని తాకిన భీకర బిపర్జోయ్
కఛ్(గుజరాత్)/న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా ప్రచండ వేగంతో సుడులు తిరుగుతూ భీకర గాలులతో పెను భయాలు సృష్టించిన బిపర్జోయ్ తుపాను ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్లో తీరాన్ని తాకింది. దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు ఉన్న తుపాను కేంద్రస్థానం(సైక్లోన్ ఐ) సాయంత్రం 4.30 గంటలకు తీరాన్ని తాకగా పూర్తిగా తీరాన్ని దాటి భూభాగం మీదకు రావడానికి ఆరు గంటల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను కఛ్ జిల్లాలోని జఖౌ పోర్ట్ సమీపంలో తీరం దాటి దాని ప్రతాపం చూపిస్తోంది. ఖఛ్, దేవభూమి ద్వారక, ఓఖా, నలియా, భుజ్, పోర్బందర్, కాండ్లా, ఆమ్రేలీ జిల్లాల్లో గురువారం ఉదయం నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కఛ్ జిల్లాలోని జఖౌ, మంద్వీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. నిర్మాణ దశలో ఉన్న చిన్నపాటి ఇళ్లు కూలిపోయాయి. గురువారం రాత్రి ఏడింటికి అందిన సమాచారం మేరకు ఎక్కడా ప్రాణనష్టం లేదని గుజరాత్ హోంశాఖ సహాయ మంత్రి హర్‡్ష సంఘ్వీ చెప్పారు. దేవభూమి ద్వారక జిల్లాలో చెట్టు మీదపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్ఎఫ్ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ‘ కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్ జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముంపు ప్రాంతాల్లో వరద బీభత్సం ఉండొచ్చు. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌సరఫరా దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 14 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చు’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. నష్టం జరగొచ్చనే భయంతో ముందస్తుగా సముద్రప్రాంతంలో చమురు అన్వేషణ, నౌకల రాకపోకలు, చేపల వేటను నిలిపేశారు. నష్టం తగ్గించేందుకు.. తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంతమేర తగ్గించేందుకు ఎన్డీఆర్ఎఫ్ పలు చర్యలు తీసుకుంది. చేపల పడవల్ని దూరంగా లంగరు వేశారు. భారీ నౌకలను సముద్రంలో చాలా సుదూరాలకు పంపేశారు. ఉప్పు కార్మికులు, గర్భిణులుసహా లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4,000 భారీ హోర్డింగ్‌లను తొలగించారు. గుజరాత్, మహారాష్ట్రలో 33 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ చెప్పారు. ఎడతెగని వానలకు జలమయమయ్యే ముంపుప్రాంతాల ప్రజలను తరలించేందుకు రబ్బరు బోట్లను సిద్ధంచేశారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని పురమాయించారు. ఉత్తర దిశలో పంజాబ్ బఠిందాలో, తూర్పున ఒడిశాలో, దక్షిణాన చెన్నై అరక్కోణంలో ఇలా తుపాను ప్రభావం ఉండే అవకాశమున్న ప్రతీ చోటా వాయుసేన అప్రమత్తంగా ఉన్నారు. -
కోస్తాకు రేపు భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని ఉత్తర కోస్తా తీర ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వైపు తేమను తీసుకువస్తోంది. దీనికితోడుగా ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 2.1 నుంచి 3.6 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది క్రమంగా ఛత్తీస్‌గఢ్ వైపు పయనించనుందని తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. సోమవారం శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని వివరించారు. ఈ నెల 13 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. గడిచిన 24 గంటల్లోనూ అనకాపల్లిలో 6.7 సెం.మీ., మధురవాడలో 6.6, సూళ్లూరుపేటలో 6, కోటనందూరులో 5.7, పరవాడలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ‘తౌక్టే’ పెను విధ్వంసం
ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్: గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను ‘‘తౌక్టే’’ సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ‘రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది’ అని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు. తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను ‘తౌక్టే’ ను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘టౌటే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. పోర్ట్ల్లో ప్రమాద హెచ్చరికలు గుజరాత్‌లోని పోరు బందరు, మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య సోమవారం ‘తౌక్టే’ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిమీ నుంచి 165 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. రంగంలోకి నేవీ బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని మహువాలో భీకరగాలుల ధాటికి చెట్లు కూలడంతో నిలిచిన ఆక్సిజన్ సిలిండర్ల ట్రక్కు వణుకుతున్న గుజరాత్ భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. ‘తౌక్టే’ తీరాన్ని దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను టౌటేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు. సీఎంలతో ప్రధాని సమీక్ష తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు. మహారాష్ట్రలో బీభత్సం మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో ‘తౌక్టే’ తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
శివాజీ విగ్రహానికి రూ.100 కోట్లు
ముంబై: నగరంలోని అరేబియా సముద్ర తీరంలో ఏర్పాటుచేయనున్న ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం రూ.వంద కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం వేశారు. ఐతే ఇది ప్రపంచంలోనే ఎతైన విగ్రహామని తెలిపిన సీఎం చవాన్ ఎంతమేర ఉంటుందో వెల్లడించేందుకు నిరాకరించారు. దీనికోసం అంతర్జాతీయ బిడ్లు నిర్వహిస్తామని తెలిపారు. సముద్రంలో అలలు వచ్చిన విగ్రహానికి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా స్మారక రూపకల్పనకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ ప్రాంతం రాజ్ భవన్ నుంచి 1.2కిలోమీటర్లు, గిర్గావ్ నుంచి 3.6 కిలోమీటర్లు, నారీమన్ పాయింట్ నుంచి 2.6 కిలోమీటర్లు ఉంటుందన్నారు. గుజరాత్‌లోని ప్రతిపాదిత 182 మీటర్ల సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే దక్షిణ ముంబైలోని మెరీన్ డ్రైవ్‌లో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును మొదలెట్టింది. ఎన్నికలకు ముందే శివాజీ స్మారక పనులు సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ప్రతిపాదిత ఛత్రపతి శివాజీ స్మారక నిర్మాణ పనులకు లోక్‌సభ ఎన్నికలకు ముందే శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం ఆరాటపడుతోంది. వీటి పనులను పర్యవేక్షిస్తున్న ముంబై జిల్లా ఇన్చార్జి మంత్రి జయంత్ పాటిల్ నేతృత్వంలోని కమిటీ పర్యావరణ శాఖ మినహా మిగతా శాఖల నుంచి అనుమతులన్నీ తీసుకొచ్చింది. పర్యావరణ శాఖ నుంచి అనుమతి పొందేందుకు అవసరమైన ప్రతిపాదనను పదిహేను రోజుల్లో పంపించనున్నట్లు మంత్రాలయ వర్గాలు పేర్కొన్నాయి. స్మారకం నిర్మిస్తున్న ప్రాంతం మహారాష్ట్ర తీర ప్రాంత(సీఆర్‌జడ్)-4 పరిధిలోకి వచ్చింది. దీంతో నియమ, నిబంధనాల్లో కొంత వెసులుబాటు కల్పించాలని కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేకంగా సీఆర్‌జెడ్‌కు సిఫార్సు చేసింది. దీంతో కీలక అడ్డంకులన్నీ తొలగిపోవడంతో ఇక శంకుస్థాపన చేయడమే మిగిలిపోయింది. అయితే శివాజీ విగ్రహా స్మారకాన్ని చూసేందుకు వచ్చే పర్యాటకులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా బయటపడాలనేదానిపై బీఎంసీకి, అక్కడికి చేరుకునేందుకు ఎలాంటి రవాణా వ్యవస్థ ఏర్పాటుచేయాలనే దానిపై ట్రాఫిక్ పోలీసు శాఖకు నివేదికలు రూపొందించే బాధ్యతలు అప్పగించారు. ఈ శాఖల నుంచి నివేదికలు రాగానే అనుమతి కోసం పర్యావరణ శాఖకు ప్రతిపాదన పంపిం చనున్నట్లు మంత్రాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే శివాజీ స్మారకం ఊహా చిత్రాన్ని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ రూపొందించిందని వెల్లడించాయి. కాగా, ఈ శివాజీ విగ్రహ స్మారక నిర్మాణంపై ప్రభుత్వం చొరవ చూస్తుంటే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ అంశాన్ని కూడా వినియోగించుకోవాలనుకుంటున్న ఊహగానాలు ఊపందుకున్నాయి. నగరంలోని అరేబియా సముద్రంలో ఛత్రపతి శివాజీ భారీ స్మారకాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గేట్ వే ఆఫ్ ఇండియా, శివాజీపార్క్, బాంద్రా, గిర్గావ్ (చర్నిరోడ్) తదితర తీర ప్రాంతాలను ఎంపిక చేసింది. చివరకు మెరైన్ డ్రైవ్ లోని అరేబియా సముద్రంలో ఒడ్డు నుంచి 1.5 కి.మీ. దూరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీనికోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జయంత్ నటరాజన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ స్మారకం నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో జయంత్ పాటిల్ అధ్యక్షతన మంత్రులతో కూడా ఓ కమిటీ ఏర్పాటు చేశారు. అయితే లోక్‌సభ , ఆ తర్వాత శాసనసభ ఎన్నికలు ఉండటం, మార్చిలో ఎప్పుడైన ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్) అమలులోకి వచ్చే అవకాశముండటంతో ఆలోపే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని సర్కార్ ఆరాటపడుతోంది. లేకుంటే లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలు ఆ తర్వాత శాసన సభ ఎన్నికలు, ఫలితాలు వచ్చేవరకు వేచిచూడాల్సి ఉంటుంది. మెరైన్ డ్రైవ్ తీరప్రాంతం నుంచి 1.5 కిమీల దూరంలో నిర్మించనున్న ఈ స్మారకానికి సముద్రంలో 18 హెక్టార్ల ప్లాట్ఫారం నిర్మించాల్సి ఉంది. ఆ ప్రాంతాన్నంత మట్టితో నింపాల్సి ఉండడంతో, అందుకు సంబంధించిన అధ్యయన పనులు చురుగ్గా సాగుతున్నాయి.