Biparjoy Updates: Cyclone Biparjoy Makes Landfall On Gujarat Coast After Sustaining For 222 Hrs - Sakshi
Sakshi News home page

Cyclone Biparjoy Updates: తీరాన్ని తాకిన భీకర బిపర్‌జోయ్‌

Published Fri, Jun 16 2023 6:17 AM | Last Updated on Fri, Jun 16 2023 8:37 AM

Cyclone Biparjoy makes landfall on Gujarat coast - Sakshi

కఛ్‌(గుజరాత్‌)/న్యూఢిల్లీ: అరేబియా సముద్రంలో పది రోజులకుపైగా ప్రచండ వేగంతో సుడులు తిరుగుతూ భీకర గాలులతో పెను భయాలు సృష్టించిన బిపర్‌జోయ్‌ తుపాను ఎట్టకేలకు గురువారం సాయంత్రం గుజరాత్‌లో తీరాన్ని తాకింది. దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు ఉన్న తుపాను కేంద్రస్థానం(సైక్లోన్‌ ఐ) సాయంత్రం 4.30 గంటలకు తీరాన్ని తాకగా పూర్తిగా తీరాన్ని దాటి భూభాగం మీదకు రావడానికి ఆరు గంటల సమయం పడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

తుపాను కఛ్‌ జిల్లాలోని జఖౌ పోర్ట్‌ సమీపంలో తీరం దాటి దాని ప్రతాపం చూపిస్తోంది. ఖఛ్, దేవభూమి ద్వారక, ఓఖా, నలియా, భుజ్, పోర్‌బందర్, కాండ్లా, ఆమ్రేలీ జిల్లాల్లో గురువారం ఉదయం నుంచే కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. కఛ్‌ జిల్లాలోని జఖౌ, మంద్వీ పట్టణాల్లో పెద్ద సంఖ్యలో చెట్లు, విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. నిర్మాణ దశలో ఉన్న చిన్నపాటి ఇళ్లు కూలిపోయాయి. గురువారం రాత్రి ఏడింటికి అందిన సమాచారం మేరకు ఎక్కడా ప్రాణనష్టం లేదని గుజరాత్‌ హోంశాఖ సహాయ మంత్రి హర్‌‡్ష సంఘ్వీ చెప్పారు. దేవభూమి ద్వారక జిల్లాలో చెట్టు మీదపడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.

లక్ష మంది సురక్షిత ప్రాంతాలకు
తీర ప్రాంతాలకు చెందిన లక్ష మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 15 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 12 రాష్ట్ర విపత్తు స్పందన దళాలు, భారత వాయు సేన, నేవీ, ఆర్మీ బలగాలు, తీరగస్తీ దళాలు, బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది తుపాను సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ‘ కఛ్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, పోర్‌బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్‌ జిల్లాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ముంపు ప్రాంతాల్లో వరద బీభత్సం ఉండొచ్చు. పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్‌సరఫరా దెబ్బతినే ప్రమాదముంది. దాదాపు 14 మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడొచ్చు’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర చెప్పారు. నష్టం జరగొచ్చనే భయంతో ముందస్తుగా సముద్రప్రాంతంలో చమురు అన్వేషణ, నౌకల రాకపోకలు, చేపల వేటను నిలిపేశారు.  

నష్టం తగ్గించేందుకు..
తుపాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని వీలైనంతమేర తగ్గించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ పలు చర్యలు తీసుకుంది. చేపల పడవల్ని దూరంగా లంగరు వేశారు. భారీ నౌకలను సముద్రంలో చాలా సుదూరాలకు పంపేశారు. ఉప్పు కార్మికులు, గర్భిణులుసహా లక్ష మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 4,000 భారీ హోర్డింగ్‌లను తొలగించారు. గుజరాత్, మహారాష్ట్రలో 33 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కార్వాల్‌ చెప్పారు. ఎడతెగని వానలకు జలమయమయ్యే ముంపుప్రాంతాల ప్రజలను తరలించేందుకు రబ్బరు బోట్లను సిద్ధంచేశారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు సిబ్బందిని పురమాయించారు. ఉత్తర దిశలో పంజాబ్‌ బఠిందాలో, తూర్పున ఒడిశాలో, దక్షిణాన చెన్నై అరక్కోణంలో ఇలా తుపాను ప్రభావం ఉండే అవకాశమున్న ప్రతీ చోటా వాయుసేన అప్రమత్తంగా ఉన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement