IMD: Cyclone Biparjoy To Cross Near Jakhau Port In Gujarat On June 15 - Sakshi
Sakshi News home page

Cyclone Biparjoy Updates: అత్యంత తీవ్ర తుపానుగా బలపడిన బిపర్‌జోయ్‌

Published Tue, Jun 13 2023 5:52 AM | Last Updated on Tue, Jun 13 2023 6:37 PM

Cyclone Biparjoy to cross near Jakhau Port in Gujarat on June 15 - Sakshi

న్యూఢిల్లీ/అహ్మదాబాద్‌: అత్యంత తీవ్రంగా మారిన బిపర్‌జోయ్‌ తుపాను ఈ నెల 15న గుజరాత్‌లోని జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరించింది. అరేబియా సముద్ర తీర ప్రాంత జిల్లాలైన కచ్, పోరుబందర్, ద్వారక, జామ్‌నగర్, జునాగఢ్, మోర్బిల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. ‘ 15వ తేదీ మధ్యాహ్నానికి బిపర్‌జోయ్‌ తుపాను జఖౌ పోర్టు వద్ద తీరాన్ని తాకే అవకాశాలున్నాయి.

ఆ సమయంలో గంటకు గరిష్టంగా దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. అతి భారీ వర్షాలు కురుస్తాయి’అని గుజరాత్‌లోని ఐఎండీ కేంద్రం డైరెక్టర్‌ మనోరమ మహంతి చెప్పారు. ఈ నెల 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర–కచ్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలను ఎగురవేయడంతోపాటు 16వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటను వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.

గుజరాత్‌లో పాఠశాలలకు ఈనెల 15 వరకు సెలవులు ప్రకటించారు. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కచ్‌–సౌరాష్ట్ర జిల్లాల్లో తీరానికి 10 కిలోమీటర్లలోపు దూరంలోని గ్రామాల వారిని మంగళవారం నుంచి తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఉండే సుమారు 10 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలో ఉంచుతామని కచ్‌ కలెక్టర్‌ అమిత్‌ అరోరా చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 12 బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు  సిద్ధంగా ఉన్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్‌గార్డ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

తక్షణమే చర్యలు తీసుకోండి: ప్రధాని
తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశించారు. సోమవారం ఆయన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ‘తుపాను ప్రభావంతో విద్యుత్, టెలీకమ్యూనికేషన్స్, ఆరోగ్యం, తాగునీరు వంటి అత్యవసర సౌకర్యాలకు ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే పునరుద్ధరించాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. ఇందుకు గాను కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని కోరారని తెలిపింది. తపానుతో ఉత్పన్నమైన పరిస్థితులను తెలుసుకునేందుకు హోం శాఖ రాష్ట్ర యంత్రాంగంతో నిరంతరం టచ్‌లో ఉంటుందని పీఎంవో వివరించింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్‌ షా,  ఐఎండీ డీజీ మృత్యుంజయ్‌ తదితరులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement