ద్విగుణీకృతమైన సాగర పాటవం  | PM Modi Dedicates Naval Combatants INS Surat, Nilgiri and Vaghsheer | Sakshi
Sakshi News home page

ద్విగుణీకృతమైన సాగర పాటవం 

Published Wed, Jan 15 2025 11:48 AM | Last Updated on Thu, Jan 16 2025 6:37 AM

PM Modi Dedicates Naval Combatants INS Surat, Nilgiri and Vaghsheer

తిరుగులేని శక్తిగా భారత్‌: ప్రధాని 

మూడు యుద్ధనౌకలు జాతికి అంకితం  

ముంబై: భారత్‌ తిరుగులేని సాగరశక్తిగా ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్‌ సూరత్, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ను బుధవారం ముంబై నావల్‌ డాక్‌ యార్డులో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్‌ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. 

సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి జాఢ్యాల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్‌ మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. ‘‘మూడు యుద్ధనౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేస్తుండటమే ఇందుకు కారణం. గత పదేళ్లలో మా హయాంలో 40 నౌకలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. 

వాటిలో ఏకంగా 39 భారత్‌లోనే తయారవడం విశేషం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహా్నలను రూపొందించుకున్నాం. రూ.1.5 లక్షల కోట్లతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. సాగరగర్భంలో దాగున్న అపారమైన అవకాశాలను ఒడిసిపట్టే ప్రయత్నమూ జోరుగా సాగుతోంది. మన పరిశోధకులు 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్రయాన్‌ ప్రాజెక్టు ఊపందుకుంది’’ అని వివరించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతం భాగస్వామ్య దేశాలన్నింటికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం నిలబెట్టుకున్నాక మోదీ మహారాష్ట్రలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మహాయుతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.

ఐఎన్‌ఎస్‌ నీలగిరి 
→ ప్రాజెక్ట్‌ 17ఏ స్టెల్త్‌ ఫ్రి గేట్‌ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.
→ శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్‌ టె క్నాలజీ దీని సొంతం.
→ గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్‌ టెక్నాలజీ ఉంది. 
→ ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. 
→ ఐఎన్‌ఎస్‌ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.
→ ఎంహెచ్‌–60ఆర్‌ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.

ఐఎన్‌ఎస్‌ సూరత్‌ 
→ ప్రాజెక్ట్‌ 15బి స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక. 
→ ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. 
→ అత్యాధునిక ఆయుధ, సెన్సర్‌ వ్యవస్థలు, అధునాతన నెట్‌వర్క్‌ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం. 
→ దీన్ని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (ఎండీఎల్‌) నిర్మించింది. 
→ 80% దేశీయంగా∙తయారవడం విశేషం.

ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌ 
→ ప్రాజెక్ట్‌ 75 స్కార్పియన్‌ శ్రేణిలో ఆరో జలాంతర్గామి. 
→ దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్‌ గ్రూప్‌ కూడా పాలుపంచుకుంది. 
→ యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్‌ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. 
→ నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది. 
→ అత్యాధునిక ఎయిర్‌–ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ టెక్నాలజీ దీని సొంతం. 
→ డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. 
→ దీనిలో అధునాతన సోలార్‌ వ్యవస్థ, యాంటీ షిప్‌ మిసైళ్లు, వైర్‌ గైడెడ్‌ టార్పెడోలను మోహరించారు. 
→ భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేసుకునే వెసులుబాటు.

 

యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement