నావికాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వేలా | INS Vela commissioned into Indian Navy in Mumbai | Sakshi
Sakshi News home page

నావికాదళంలోకి ఐఎన్‌ఎస్‌ వేలా

Published Fri, Nov 26 2021 4:42 AM | Last Updated on Fri, Nov 26 2021 4:42 AM

INS Vela commissioned into Indian Navy in Mumbai - Sakshi

గురువారం ముంబై తీరంలో వేలా జలాంతర్గామి

ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్‌ఎస్‌ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్‌ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్‌ క్లాస్‌ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది.

ఈ సందర్భంగా కరమ్‌బీర్‌ సింగ్‌ మాట్లాడుతూ ఐఎన్‌ఎస్‌ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్‌ఎస్‌ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్‌ డాక్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి.

అయితే ఫ్రాన్స్‌ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్‌ఎస్‌ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్‌ఎస్‌ ఖండేరి, ఐఎన్‌ఎస్‌ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్‌ఎస్‌ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్‌ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్‌ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు.  

పాక్‌కు చైనా ఎగుమతులు
చైనా నుంచి పాకిస్తాన్‌కు మిలటరీ హార్డ్‌వేర్‌ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్‌ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్‌ సిద్ధంగా ఉండాలన్నారు.  

ప్రత్యేకతలు..
► వేలా సబ్‌మెరైన్‌ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది.  
► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.
► ఐఎన్‌ఎస్‌ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్‌మెజర్‌ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్‌ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు.  
► ఎనిమిది మంది  అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది.
► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్‌ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement