Karambir Singh
-
నేవీ చీఫ్‌గా హరికుమార్ బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: దేశ నావికాదళం 25వ చీఫ్‌గా అడ్మిరల్ రాధాకృష్ణన్ హరికుమార్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. సర్వీస్ నుంచి రిటైరవుతున్న అడ్మిరల్ కరంబీర్‌సింగ్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన తల్లి విజయలక్ష్మికి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. అడ్మిరల్ కుమార్ ఇప్పటి వరకు వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్‌ఛీఫ్‌గా వ్యవహరించారు. 1962 ఏప్రిల్ 12వ తేదీన కేరళలో జన్మించిన అడ్మిరల్ కుమార్ భారత నావికాదళంలో 1983 జనవరి ఒకటో తేదీన జాయినయ్యారు. దాదాపు 39 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ విభాగాల్లో పలు బాధ్యతలు చేపట్టారు. ఐఎన్ఎస్ నిషాంక్, ఐఎన్ఎస్ కోరా, ఐఎన్ఎస్ రణ్వీర్, ఐఎన్ఎస్ విరాట్‌లపై కమాండింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. వెస్టర్న్ ఫ్లీట్‌కు ఆపరేషన్స్ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పరమ విశిష్ట, అతి విశిష్ట, విశిష్ట సేవా పతకాలను ఆయన అందుకున్నారు. -
నావికాదళంలోకి ఐఎన్ఎస్ వేలా
ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది. ఈ సందర్భంగా కరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు. పాక్‌కు చైనా ఎగుమతులు చైనా నుంచి పాకిస్తాన్‌కు మిలటరీ హార్డ్‌వేర్ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేకతలు.. ► వేలా సబ్‌మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ► ఐఎన్ఎస్ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్‌లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు. ► ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి. -
భారత జలాల్లోకి చైనా నౌక.. తరిమికొట్టిన నేవీ!
న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చైనా నౌక ఏవో అనుమానాస్పద అన్వేషణలు సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో చైనా నౌకను గుర్తించిన భారత నేవి అధికారులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక తిరిగి వెళ్లింది. రహస్యంగా సమాచారం సేకరించేందుకు చైనా ఆ నౌకను పంపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చైనా రీసెర్చ్ నౌక 'షి యాన్ 1' పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ మన జలాంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నట్టు గుర్తించారు. అప్రమత్తమైన ఇండియన్ నేవీ చైనా అధికారులకు హెచ్చరికలు పంపడంతో అక్కడి నుంచి షి యాన్ 1 నౌక తిరుగు పయనమైంది. గూఢచర్యానికి పాల్పడి ఉండవచ్చని భారత నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా.. చైనా తన సముద్ర భాగం నుంచి ఇండియన్ నేవీకి చెందిన పీ-81 మారిటైమ్ సర్వెయిలెన్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల గుర్తించారు. ఎప్పటికప్పుడు చైనా కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ జలభాగంలో పరిశోధనలు, అన్వేషణలు విరుద్దమని నేవీ అధికారులు వెల్లడించారు. -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్‌వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్‌వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్‌వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా, నూతన నేవీ చీఫ్ కరంబీర్ సింగ్‌లతో రైసినా హిల్స్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు, త్రివిధ దళాల పనితీరుపై వేర్వేరు నివేదికలు సిద్ధం చేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్, రక్షణ కార్యదర్శి సంజయ్ మిత్రా, సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రివిధ దళాల్లో సుదీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఆధునీకరణను వేగవంతం చేయడంతో పాటు వారి పోరాట సంసిద్ధతకు భరోసా ఇవ్వడం, అలాగే చైనాతో సరిహద్దు వద్ద శాంతి నెలకొల్పటం, చైనా నుంచి వచ్చే ఎలాంటి వ్యతిరేకతనైనా ఎదుర్కోడానికి అవసరమైన సైనిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం వంటివి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ ముందున్న అత్యంత కీలక సవాళ్లు. -
నేవీ ఛీఫ్‌గా అడ్మిరల్ కరంబీర్ సింగ్
న్యూ ఢిల్లీ : భారత నేవీ ఛీఫ్ అడ్మిరల్‌గా కరంబీర్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. అడ్మిరల్ సునీల్ లాంబా నుంచి 24వ నేవీ ఛీఫ్‌గా కరంబీర్ బాధ్యతలు స్వీకరించారు. నేవీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప గౌరవంగా భావిస్తానని కరంబీర్ తెలిపారు. చేతక్, కమోవ్-25, కమోవ్-28 హెలీకాఫ్టర్లను నడిపిన అనుభవం ఉంది. ఇండియన్ నేవీలో హెలీకాఫ్టర్ పైలెట్‌గా బాధ్యతలు నిర్వర్తించి ఇండియన్ నేవీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి వ్యక్తి కరంబీర్ సింగ్ కావడం విశేషం. భారత నౌకాదళాన్ని అడ్మిరల్ సునిల్ లాంబా ఎంతో పటిష్టం చేశారని నేవీకి ఆయన చేసిన సేవలను కరంబీర్ సింగ్ కొనియాడారు.