
మాట్లాడుతున్న కరమ్‌వీర్ సింగ్ (మధ్య వ్యక్తి)
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్‌వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్‌వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్‌వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు.