Naval stunts
-
ప్రతిష్టాత్మక విన్యాసాలకు వేదికగా.. విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా వెల్లడించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన నేవల్ బేస్ ఐఎన్ఎస్ సర్కార్‌లోని పరేడ్ గ్రౌండ్లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ గుప్తా.. గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ నౌకలు, సబ్ మెరైన్లు, ఇతర నౌకాదళ సిబ్బందితో కూడిన ప్లటూన్లు నిర్వహించిన పరేడ్‌ను ఆయన సమీక్షించారు. అనంతరం ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక నౌకాదళ విన్యాసాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్లో టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన లీడింగ్ సీమాన్ నవీన్‌కుమార్‌కు, 29 ఏళ్ల పాటు నేవీలో విశిష్ట సేవలందించిన కమాండర్ రాహుల్‌విలాస్ గోఖలేకు నవ్‌సేనా మెడల్‌ను ఈఎన్సీ చీఫ్ అందించారు. టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రిటైర్డ్ లెఫ్టినెంట్ సీడీఆర్ తుషార్ బహ్ల్‌కు లెఫ్టినెంట్ వీకే జైన్ మెమోరియల్ అవార్డు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌లో ఫ్లైట్ సేఫ్టీని మెరుగుపరిచిన హరనంద్‌కు కెప్టెన్ రవిధీర్ గోల్డ్‌మెడల్‌ను బహూకరించారు. అలాగే తూర్పు నౌకాదళ పరిధిలో 2020కి గాను అత్యుత్తమ సేవలందించిన నేవల్ డాక్‌యార్డు, ఐఎన్ఎస్ జలశ్వా యుద్ధ నౌకల బృందానికి యూనిట్ సైటేషన్ అవార్డు ప్రదానం చేశారు. -
చైనా నేవీకి నిధులు, వనరుల మళ్లింపు
న్యూఢిల్లీ: చైనా ఆర్మీలోని వివిధ ఇతర విభాగాల నుంచి నిధులు, వనరులను భారీ స్థాయిలో నౌకాదళానికి మళ్లించారని భారత నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ గురువారం చెప్పారు. ఈ విషయాన్ని భారత్ జాగ్రత్తగా గమనించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. సైనిక అభివృద్ధిపై చైనా రక్షణ శాఖ బుధవారమే ఓ శ్వేతపత్రం విడుదల చేసింది. తన మిలటరీ అభివృద్ధిని ఇండియా, అమెరికా, రష్యాల అభివృద్ధితో చైనా ఈ శ్వేతపత్రంలో పోల్చింది. అందులోని వివరాలను పరిశీలించిన మీదట కరమ్‌వీర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిక్కీ నిర్వహించిన ‘నౌకల నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం’ అనే కార్యక్రమంలో కరమ్‌వీర్ సింగ్ ప్రసంగించేందుకు వచ్చి, అక్కడి విలేకరులతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘చైనా తన శ్వేత పత్రంలోనే కాదు. గతంలోనూ ఈ వివరాలు చెప్పింది. ఆర్మీలోని ఇతర విభాగాల నుంచి నిధులను, వనరులను నౌకాదళానికి వారు మళ్లించారు. ప్రపంచ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేశారు. మనం దీనిని జాగ్రత్తగా గమనిస్తూ, మనకున్న బడ్జెట్, పరిమితుల్లోనే ఎలా స్పందించగలమో ఆలోచించాలి’ అని అన్నారు. అనంతరం వేదికపై కరమ్‌వీర్ ప్రసంగిస్తూ 2024 కల్లా 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ప్రభుత్వ లక్ష్యానికి, నౌకా నిర్మాణ రంగం ఎంతగానో చేయూతనివ్వగలదని పేర్కొన్నారు. -
చైనాను హెచ్చరించేలా భారత్ ఫ్రాన్స్ విన్యాసాలు!
పణజీ: గోవా సమీపలోని సముద్రంలో భారత్, ఫ్రాన్స్‌లు నౌకా విన్యాసాలను శుక్రవారం ప్రారంభించాయి. ఫ్రాన్స్‌కు చెందిన విమాన వాహక నౌక చార్లెస్ డీ గాల్లె కేంద్రంగా ఈ విన్యాసాలు సాగుతున్నాయి. చైనాను హెచ్చరించేలా ఈ విన్యాసాలు ఉన్నాయని భావిస్తుండగా, అలాంటిదేమీ లేదని ఫ్రాన్స్ కొట్టిపారేసింది. దక్షిణ చైనా సముద్రంలోని ఇతర దేశాల భాగాలను తమవిగా చైనా చెప్పుకోవడం ఉద్రిక్తతలకు దారితీయడం తెలిసిందే. ఫ్రెంచ్ ఫ్లీట్‌కు సారథ్యం వహిస్తున్న రియర్ అడ్మిరల్ ఒలివియర్ లెబాస్ మాట్లాడుతూ ‘అంతర్జాతీయ వాణిజ్యం పరంగా వ్యూహాత్మకమైన ఈ ప్రాంతంలో మేం మరింత స్థిరత్వం తీసుకురాగలమని అనుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ విన్యాసాల్లో ఇరు దేశాల నుంచి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు కలిపి 12 (ఒక్కో దేశం నుంచి ఆరు) పాల్గొంటున్నాయి. -
ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ నావెల్ ఫ్లీట్
79 దేశాల నావికాదళ విన్యాసాలు సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం ఆధ్వర్యంలో విశాఖ సముద్రతీరంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో ఇంటర్నేషనల్ నావెల్ ఫ్లీట్ జరగనుంది. ఫ్లీట్ నిర్వహణపై హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, నావికాదళ ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూలో పాల్గొని నగరానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ యువరాజ్ వివరాలను గురువారం మీడియాకు వివరించారు. మన దేశంలో ప్రతీ ఐదేళ్లకొకసారి జాతీయ స్థాయిలో ప్రెసిడెన్షియల్ నావెల్ ఫ్లీట్స్ నిర్వహిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో రెండేళ్లకొకసారి నావెల్ ఫ్లీట్స్ జరుగుతుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో నావెల్ ఫ్లీట్ జరగడం విశాఖలో ఇదే తొలిసారి. దేశంలో ఇది రెండోసారి. 2001లో ముంబయిలో తొలి అంతర్జాతీయ ఫ్లీట్ జరిగింది. విశాఖలో ఫ్లీట్‌కోసం భారత్‌తో పాటు 79 దేశాల నావికాదళాలకు చెందిన నౌకలు ఇక్కడ విన్యాసాలు చేయనున్నాయి. 45 దేశాలు అంగీకారం తెలియచేశాయి. ఫ్లీట్‌లో పాల్గొనే దేశాలతో కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ సంప్రదింపులు జరుపుతోంది. రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జి, ప్రధాని నరేంద్రమోదీలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు, గవర్నర్లు పలుదేశాధినేతలుకూడా పాల్గొనే అవకాశాలున్నాయి. ఏర్పాట్లు చేసేందుకు కోస్టల్ బ్యాటరీ వద్ద సముద్ర తీరాన్ని నావికాదళం తమ స్వాధీనంలోకి తీసుకోనుంది. ఫ్లీట్ 6వ తేదీనుంచి ప్రారంభం కానుండగా నాల్గవ తేదీ నుంచే కార్యక్రమాలు మొదలవుతాయని కలెక్టర్ యువరాజ్ చెప్పారు.