
గౌరవ వందనం స్వీకరిస్తున్న ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కానుందని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా వెల్లడించారు. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ప్రధాన నేవల్ బేస్ ఐఎన్‌ఎస్ సర్కార్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో 73వ గణతంత్ర దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ గుప్తా.. గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ నౌకలు, సబ్ మెరైన్లు, ఇతర నౌకాదళ సిబ్బందితో కూడిన ప్లటూన్లు నిర్వహించిన పరేడ్‌ను ఆయన సమీక్షించారు.
అనంతరం ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విశాఖ వేదికగా ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోని ప్రధాన దేశాలు పాల్గొంటున్న ఈ ప్రతిష్టాత్మక నౌకాదళ విన్యాసాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కశ్మీర్‌లో టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన లీడింగ్ సీమాన్ నవీన్‌కుమార్‌కు, 29 ఏళ్ల పాటు నేవీలో విశిష్ట సేవలందించిన కమాండర్ రాహుల్‌విలాస్ గోఖలేకు నవ్‌సేనా మెడల్‌ను ఈఎన్‌సీ చీఫ్ అందించారు.
టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను రిటైర్డ్ లెఫ్టినెంట్ సీడీఆర్ తుషార్ బహ్ల్‌కు లెఫ్టినెంట్ వీకే జైన్ మెమోరియల్ అవార్డు, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్‌లో ఫ్లైట్ సేఫ్టీని మెరుగుపరిచిన హరనంద్‌కు కెప్టెన్ రవిధీర్ గోల్డ్‌మెడల్‌ను బహూకరించారు. అలాగే తూర్పు నౌకాదళ పరిధిలో 2020కి గాను అత్యుత్తమ సేవలందించిన నేవల్ డాక్‌యార్డు, ఐఎన్‌ఎస్ జలశ్వా యుద్ధ నౌకల బృందానికి యూనిట్ సైటేషన్ అవార్డు ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment