న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చైనా నౌక ఏవో అనుమానాస్పద అన్వేషణలు సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో చైనా నౌకను గుర్తించిన భారత నేవి అధికారులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక తిరిగి వెళ్లింది. రహస్యంగా సమాచారం సేకరించేందుకు చైనా ఆ నౌకను పంపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చైనా రీసెర్చ్ నౌక 'షి యాన్ 1' పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ మన జలాంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నట్టు గుర్తించారు.
అప్రమత్తమైన ఇండియన్ నేవీ చైనా అధికారులకు హెచ్చరికలు పంపడంతో అక్కడి నుంచి షి యాన్ 1 నౌక తిరుగు పయనమైంది. గూఢచర్యానికి పాల్పడి ఉండవచ్చని భారత నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా.. చైనా తన సముద్ర భాగం నుంచి ఇండియన్ నేవీకి చెందిన పీ-81 మారిటైమ్ సర్వెయిలెన్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల గుర్తించారు. ఎప్పటికప్పుడు చైనా కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ జలభాగంలో పరిశోధనలు, అన్వేషణలు విరుద్దమని నేవీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment