Indian Navy Force
-
‘ఇండియా జిందాబాద్’ నినాదాలు చేసిన పాకిస్తానీలు
సనా: అరేబియా మహాసముద్రంలో పైరేట్లు హైజాగ్ చేసిన ఇరాన్‌కు చెందిన అల్ కంబార్ చేపలబోటును భారత నేవీ రక్షించిన విషయం తెలిసిందే. ఈ చేపలబోటులో ఉన్న 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నేవీ పైరేట్ల బారి నుంచి కాపాడింది. 23 మంది పాకిస్తాన్ సిబ్బంది తమను రక్షించిన భారత నేవీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వీరంతా ‘ఇండియా జిందాబాద్’ అని నినాదాలు చేశారు. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ త్రిశూల్‌లు కలిసి 12 గంటల పాటు ఈ ఆపరేషన్ నిర్వహించి శుక్రవారం(మార్చ్ 29) తొమ్మిది మంది పైరేట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి.. భారత నేవీ మరో సాహసం -
ఖతార్ ‘మరణ’ మృదంగం!
గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది. వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్‌తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు. మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్‌కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్‌కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్‌తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది. దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్‌కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది. కానీ చివరికి మళ్లీ ఖతార్‌తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్‌కు సైతం ఖతార్‌లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్కూ, ఇరాన్‌కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్‌కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు. కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్‌ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి. -
అగ్నిపథ్‌ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు: నేవీ చీఫ్
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు, నిరసలను అస్సలు ఊహించలేదని, అగ్నిపథ్ పథకాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నావికా దళం అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అంటున్నారు. అగ్నిపథ్ ప్రణాళికలో తాను ఏడాదిన్నరగా పని చేశానని ఆయన చెప్పుకొచ్చారు. భారత సైన్యంలో అతిపెద్ద మానవ వనరుల నిర్వహణ పరివర్తనగా అగ్నిపథ్ పథకాన్ని అభివర్ణించారాయన. ‘‘అగ్నిపథ్ ప్లానింగ్ టీంలో నేను కూడా ఉన్నా. ఏడాదిన్నరగా పని చేశా. ఇది మంచి మార్పును అందించే పథకం. ఇది సైన్యాన్ని అనేక రూపాల్లో సహేతుకంగా ఉపయోగించుకునే మంచి మార్గం. యువతకు అనేక అవకాశాలు అందిస్తుంది. దేశానికి ఎంతో మేలు చేస్తుంది కూడా అని అడ్మిరల్ హరికుమార్ చెప్పారు. ఇంతకు ముందు ఒక వ్యక్తికి భారత సైన్యంలో పని చేసే అవకాశం దొరికితే.. ఇప్పుడు అగ్నిపథ్‌తో నలుగురికి అవకాశం దొరుకుతుంది. సైన్యంలో కొనసాగడమా? లేదంటే మరేదైనా ఉద్యోగం చూసుకోవడమా? అనేది అగ్నివీరులే నిర్ణయించుకుంటారు అని ఆయన తెలిపారు. అయితే ఆర్మీలో చేరాలనుకుంటున్న వాళ్లు, అభ్యర్థులు.. అగ్నిపథ్‌ను సరైన సమాచారం లేక తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, అందువల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వాళ్లు పునరాలోచన చేయాలని అడ్మిరల్ హరికుమార్ విజ్ఞప్తి చేశారు. #WATCH I didn't anticipate any protests like this. We worked on Agnipath scheme for almost a year & half...It's single biggest Human Resources Management transformation in Indian military...Protests are happening due to misinformation & misunderstanding of the scheme: Navy Chief pic.twitter.com/ek2KiK25iB — ANI (@ANI) June 17, 2022 చదవండి: అగ్నిపథ్- అపోహలు.. వాస్తవాలు -
విశ్వ విఖ్యాత విశాఖ..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం అంటే శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడి చేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర తూర్పు నౌకా దళానిది. ఈ విజయానికి గుర్తుగా ప్రతి యేటా డిసెంబరులో సాగర తీరంలో నేవీ డే నిర్వహిస్తారు. పలు యుద్ధనౌకల విన్యాసాలతో విశాఖ తీరం పులకిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మరో రెండు భారీ నౌకా దళ విన్యాసాలకు విశాఖ వేదిక కానుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ విన్యాసాలతో అంతర్జాతీయంగా నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాయని తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా తెలిపారు. నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కీలక నగరంగా వృద్ధి చెందుతున్న విశాఖపట్నం తీరంలో తూర్పు నౌకా దళం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్, రాష్ట్రపతి నౌకాదళ పరిశీలన), అదే నెల 25 తర్వాత 45 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, నౌకా దళాధికారులు, సిబ్బందితో మిలన్ విన్యాసాలు జరుగుతాయని చెప్పారు. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ టీజర్‌ని ఆవిష్కరించారు. పీఎఫ్ఆర్లో ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్, ఇండియన్ మర్చంటైన్ మెరైన్‌కి చెందిన 50 యుద్ధ నౌకలు, 50 యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ విన్యాసాల్లో పాల్గొంటాయని తెలిపారు. ఆ తర్వాత వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక వాతావరణం, పరస్పర సహకారంతో సత్సంబంధాలు బలోపేతం చేస్తూ మిలన్ విన్యాసాలు జరుగుతాయన్నారు. ఈ విన్యాసాలకు శత్రు దేశాలుగా భావించే పాకిస్తాన్, చైనాలకు మాత్రం ఆహ్వానం పంపలేదని, దీనిపై రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కోవిడ్ కారణంగా ఈసారి నేవీ డే, వార్ మెమోరియల్ వద్ద లేయింగ్ సెరమనీ రద్దు చేశామని ప్రకటించారు. దేశ రక్షణలో కీలకమైన విశాఖ జిల్లా రాంబిల్లిలోని నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బేస్‌లతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఇండియన్ నేవీ కీలకం భారత అభివృద్ధిలో ఇండియన్ నేవీ కీలకంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు భారత్ చేరుకోవాలంటే జల రవాణా ముఖ్య భూమిక పోషిస్తుందని తెలిపారు. అందుకే నౌకాయాన వాణిజ్య వ్యవస్థకు పూర్తిస్థాయి భద్రత కల్పించడానికి నౌకాదళం కృషి చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఏపీ నేవల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ కమాండర్ ఎం గోవర్థన్ రాజు, ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ తరుణ్ సోబ్తి, నేవల్ డాక్‌యార్డ్ అడ్మిరల్ సూపరింటెండెంట్ రియర్ అడ్మిరల్ ఐబీ ఉత్తయ్య, సబ్‌మెరైన్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ స్వప్న్‌శ్రీ గుప్త తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా ఐఎన్ఎస్ విక్రాంత్ స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిలో తయారైన యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ బేస్, సీ ట్రయల్స్ పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా పని చేస్తుందని చెప్పారు. చొరబాట్లను సమర్ధంగా ఎదుర్కొనేందుకు తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులను సమాయత్తం చేస్తున్నామన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆపరేషన్ సముద్ర సేతులో భాగంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న 4 వేల మంది భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చామని, వారిలో ఏ ఒక్కరికీ కోవిడ్ సోకకుండా పటిష్ట చర్యలు చేపట్టామని చెప్పారు. వివిధ దేశాల నుంచి ఆక్సిజన్ కూడా తెచ్చామన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా యుద్ధ నౌకల పరికరాల్ని స్థానిక పారిశ్రామికవేత్తల నుంచి కొనుగోలు చేస్తున్నామని బిస్వజిత్ తెలిపారు. -
గల్లంతైన మిగ్ పైలెట్ లెటర్ వైరల్
న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్ క్రాఫ్ట్ మిగ్-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. నిషాంత్ సింగ్ అనే మరో పైలెట్ గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతడిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. నిషాంత్ సింగ్‌కు సంబంధించిన ఓ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి సృజానత్మకతకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. త్వరగా.. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఏడు నెలల క్రితం నిషాంత్ సింగ్ వివాహం చేసుకున్నాడు. ఇందుకు గాను సీనియర్ అధికారుల అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తరంలో నిషాంత్ పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని త్యాగం చేయడం వంటిదే అన్నాడు. తెలిసి తెలిసి ఇందులోకి దూకుతున్నానని.. ఇక జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయనని.. కనుక ఈ ఒక్కసారి బుల్లెట్‌ని కొరకడానికి అనుమతివ్వాల్సిందిగా సీనియర్లను కోరాడు. అంతేకాక తన త్యాగానికి అధికారులంతా సాక్ష్యంగా ఉండాలని.. కావున వారంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని నిషాంత్ అభ్యర్థించాడు. ఈ ఏడాది మే 9న ఉన్నతాధికారులకు నిషాంత్ రాసిన లెటర్ ఇలా కొనసాగింది.. ‘ఇంత తక్కువ సమయంలో మీ మీద ఇలాంటి బాంబు వేశాను. కానీ మీరు అంగీకరించాలి. స్వయంగా నా మీద నేనే ఓ న్యూక్లియర్ బాంబ్ వేసుకుంటున్నానని గమనించాలి. కంబాట్‌లో ఓ పక్క వేడిని భరిస్తూనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం అలవాటయ్యంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి.. మరోసారి దీని గురించి ఆలోచించడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. మూడేళ్ల కాల వ్యవధి గల ఎస్‌సీటీటీ(సర్వైవబిలిటీ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ ట్రయల్స్)ట్రైనింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నేను, మిస్ నయాబ్ రంధవా ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మిగిలిన జీవితం అంతా ఒకరినొకరం చంపుకోకుండా కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించారు. కరోనా సమయం కావడంతో జూమ్ వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించారు. నా జీవితంలోని ప్రశాంతతని కోల్పోవడమే కాక, డ్యూటీకి సంబంధం లేని మరి ముఖ్యంగా చెప్పాలంటే .. నా జీవితాన్ని త్యాగం చేయాలని భావిస్తూ స్వయంగా నా చేతులారా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అనుమతి కావాలి’ అంటూ నిశాంత్ తన లెటర్లో అధికారులను కోరాడు. (చదవండి: పైలట్ కోసం సిక్కుల ఔదార్యం) కొనసాగిస్తూ.. ‘ఇక ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడటానికి నా పఠనాసక్తి కూడా సాయం చేయలేకపోయింది. కావాలనే చేస్తోన్న ఈ తప్పును మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక ఇలాంటి తప్పును నేను గాలిలో ఉండగా కూడా చేయను. అలానే నా ట్రైనీలకు ఇలాంటి తప్పులు చేయడం నేర్పను’ అంటూ ఉత్తరాన్ని ముగించాడు. ఇక చివర్లో మీ విధేయుడు అని రాసే చోట.. ‘సాధారణంగా మీ విధేయుడు అనే రాయాలి.. కానీ ఇక మీదట నేను తనకు విధేయుడిని’ అంటూ తన పేరు రాసి ముగించాడు. ఇంత సృజనాత్మంగా లెటర్ రాస్తే.. ఎవరు మాత్రం నో చెప్పగలరు. అందుకే అధికారులు కూడా అతని వివాహానికి అనమతించారు. నేవీ సాంప్రదాయం ప్రకారం, యువ అధికారులు వివాహం చేసుకోవడానికి వారి సీఐల అనుమతి తీసుకోవాలి. ఇక సుశాంత్ తెలివిగా లెటర్ హెడ్డింగ్‌ని "బుల్లెట్‌ని కొరకడానికి అనుమతించండి" అని పెట్టడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. -
భారత జలాల్లోకి చైనా నౌక.. తరిమికొట్టిన నేవీ!
న్యూఢిల్లీ: భారత సముద్ర జలాల్లో పోర్ట్ బ్లెయిర్ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా చైనా నౌక ఏవో అనుమానాస్పద అన్వేషణలు సాగిస్తోంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్‌లోని పోర్ట్ బ్లెయిర్ సమీపంలో చైనా నౌకను గుర్తించిన భారత నేవి అధికారులు వెంటనే తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో అక్కడి నుంచి చైనా నౌక తిరిగి వెళ్లింది. రహస్యంగా సమాచారం సేకరించేందుకు చైనా ఆ నౌకను పంపించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చైనా రీసెర్చ్ నౌక 'షి యాన్ 1' పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అనుమానాస్పదంగా కనిపించింది. అక్కడ మన జలాంతర్భాగంలో పరిశోధనలు చేస్తున్నట్టు గుర్తించారు. అప్రమత్తమైన ఇండియన్ నేవీ చైనా అధికారులకు హెచ్చరికలు పంపడంతో అక్కడి నుంచి షి యాన్ 1 నౌక తిరుగు పయనమైంది. గూఢచర్యానికి పాల్పడి ఉండవచ్చని భారత నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా.. చైనా తన సముద్ర భాగం నుంచి ఇండియన్ నేవీకి చెందిన పీ-81 మారిటైమ్ సర్వెయిలెన్స్‌ను పరిశీలిస్తున్నట్టుగా ఇటీవల గుర్తించారు. ఎప్పటికప్పుడు చైనా కదలికలపై నిఘా ఉంచుతున్నట్లు నేవీ అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం విదేశీ జలభాగంలో పరిశోధనలు, అన్వేషణలు విరుద్దమని నేవీ అధికారులు వెల్లడించారు. -
మిలన్-2020కు ఆతిథ్యమివ్వనున్న తూర్పు నావికా దళం
సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళంలో డిసెంబర్ నాలుగవ తేదికి అత్యంత ప్రాధాన్యత ఉందని తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పీసీ తెలిపారు. 1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సముద్ర మార్గం నుంచి శత్రు దేశాలు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఆన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కోస్టల్ భద్రతను, పెట్రోలింగ్‌ను పటిష్టపరిచినట్లు తెలిపారు. విశాఖ తూర్పు నావికా దళంలో వచ్చే ఏడాది నుంచి మిగ్ 29 యుద్ద విమానాలు భాగస్వామ్యం కాబోతున్నాయని వెల్లడించారు. మిగ్ 29 యుద్ద విమానాల శిక్షణా కేంద్రం విశాఖలో ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది 30కి పైగా దేశాలు విశాఖలో జరిగే మిలన్-2020కి తూర్పు నావికా దళం ఆతిధ్యమివ్వబోతుండటం గర్వకారణమన్నారు. గత కొన్నేళ్లుగా అత్యాధునిక యుద్ద షిప్‌లు, విమానాలు, హెలీకాప్టర్లు, ఆయుధాలను ఇండియన్ నేవీ సమకూర్చుకోగలిగిందని అతుల్ కుమార్ జైన్ తెలిపారు. -
‘దేశ రక్షణ రంగంలో నేవీ కీలక పాత్ర’
సాక్షి, విశాఖపట్నం : మన దేశంలో తయారైన రక్షణ పరికరాలను ఇతర దేశాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నావికాదళ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పేర్కొన్నారు. నగరంలో జరిగిన నావికాదళ వార్షిక నాణ్యతా సదస్సులో అతుల్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే తయారు చేస్తున్నామని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా మేకిన్ ఇండియాను ప్రోత్సహిస్తూనే నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. రక్షణ రంగంలో నాణ్యతా ప్రమాణాలకు డీజీక్యూఏ(డైరెక్టరేట్ జనరల్ క్వాలిటీ అస్సురెన్స్) విభాగం అత్యంత కీలకమని, దేశ రక్షణలో నేవీ ప్రధాన పాత్ర పోషించడంలో ఈ విభాగం ముఖ్య పాత్ర నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. గత 70 ఏళ్లలో నావికాదళం దేశ రక్షణలో అత్యంత కీలకంగా ఎదిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీజీ లెఫ్టినెంట్ జనరల్ సంజయ్ చౌహాన్, ఏడీజీ అతుల్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
నేవీకి మరింత శక్తి
వాషింగ్టన్: సముద్రంలో గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేకించిన ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 24 హెలికాప్టర్లకు మొత్తంగా ధర రూ.1.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. హిందూ మహాసముద్రంలో చైనా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో యుద్ధ సమయాల్లో భారత నావికాదళానికి ఈ హెలికాప్టర్లు ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. శత్రు దేశాల సబ్మెరైన్లు, నౌకలను వెంటాడి వాటిని ధ్వంసం చేసేందుకు వీలుగా వీటిని రూపొందించారు. సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి రక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. యుద్ధనౌకల నుంచి, విధ్వంసక నౌకల నుంచి, క్రూజర్ల నుంచి, ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ల నుంచి ప్రయోగించగలిగే హెలికాప్లర్లలో ఇవే అత్యాధునికమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవీ ప్రత్యేకతలు... ♦ అమెరికాలో ఎంహెచ్ 60ఆర్ సీహాక్ హెలికాప్టర్లను ‘రోమియో’అని కూడా పిలుస్తారు. ♦ లాక్‌హీడ్ మార్టిన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ (ఓవిగో) సంస్థ ఈ హెలికాప్టర్లను తయారుచేసింది. ♦ ఈ హెలికాప్టర్లలో సబ్మెరైన్లను ధ్వంసం చేసే పరికరాలతో పాటు సర్చ్, రెస్క్యూ, గన్ సపోర్ట్, నిఘా, సమాచారం చేరవేసే సాంకేతికతను అనుసంధానం చేసింది. ♦ సరుకులు, వ్యక్తుల తరలించే వెసులుబాటు ఉంది. ♦ 2721 కిలోగ్రాముల బరువైన సామగ్రిని తాడుతో తరలించే సదుపాయం కూడా ఇందులో ఉంది. ♦ జూలై 2001లో తొలి హెలికాప్టర్ తయారైంది. ♦ ఇందులో ముగ్గురు లేదా నలుగురు సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ♦ దీనికి సెన్సర్లను అమర్చారు. దీనివల్ల హెలికాప్టర్‌ను లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చే వాటిని గుర్తిస్తుంది. ♦ చిన్న ఆయుధాలు, మంటలు అంటుకున్నా కూడా ఎలాంటి హాని కలగకుండా ఏర్పాట్లు చేశారు. ♦ 1,425 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు టర్బో షాఫ్ట్ ఇంజన్లను దీనికి అమర్చారు. -
కరంజ్ జలప్రవేశం
ముంబై: భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా బుధవారం నాడిక్కడ ఐఎన్ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఐఎన్ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. అనంతరం లాంబా మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిపాటు పరీక్షించిన తర్వాతే కరంజ్‌ను విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్ఎస్ కరంజ్‌గా నామకరణం చేశామన్నారు. విధుల నుంచి తప్పించిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విరాట్‌ను వైజాగ్‌లో మ్యూజియంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందితే విరాట్‌ను అప్పగించే విషయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. -
నేనొక మగాడి శరీరంలో ఇరుక్కున్నా!
న్యూఢిల్లీ: సైన్యానికి సంబంధించి ఓ అరుదైన కేసు వెలుగు చూసింది. నౌకాదళంలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగానికి పనికి రారంటూ విధుల నుంచి తొలగించేశారు. విశాఖపట్నం ఐఎన్ఎస్ ఏకశిల బేస్ లో విధులు నిర్వహిస్తున్న ఆ నావికుడు కొన్ని నెలల క్రితం ఆ లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ కోసం కొందరు సన్నిహితులను సంప్రదించాడు. ఆపై తన సొంత డబ్బుతోనే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు అని నేవీ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రస్తుతం అతను మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో నావికాదళంలో అతను విధులు నిర్వర్తించటం చాలా కష్టం. మరోవైపు తోటి ఉద్యోగులు కూడా అతడి (ఆమె)తో పని చేసేందుకు ఇబ్బందిగా ఫీలయ్యారు. అందుకే అతన్ని స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగాలని కోరాం. వెంటనే అతను సంతోషంగా అంగీకరించాడు’ అని ఓ అధికారి తెలిపారు. నేనొక మగాడి శరరీరంలో చిక్కుకున్న మహిళను అంటూ తరచూ ఆ వ్యక్తి వ్యాఖ్యానించేవాడని సహచరులు చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్‌కు ముందు అతనికి వివాహం కూడా జరిగినట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో అతని(ఆమె) పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవటంతో రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంతోపాటు విస్తృత స్థాయి బాధ్యతలను కూడా అప్పజెప్పాలని ఓవైపు కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ తరహా కేసు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది.