సాక్షి, విశాఖపట్నం : భారత నావికా దళంలో డిసెంబర్ నాలుగవ తేదికి అత్యంత ప్రాధాన్యత ఉందని తూర్పు నావికా దళం అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ పీసీ తెలిపారు. 1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నేవీ డే ను నిర్వహిస్తున్నామన్నారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయ్యిందని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. బుధవారం విశాఖ ఆర్‌కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సముద్ర మార్గం నుంచి శత్రు దేశాలు, ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఆన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతో కోస్టల్ భద్రతను, పెట్రోలింగ్‌ను పటిష్టపరిచినట్లు తెలిపారు.
విశాఖ తూర్పు నావికా దళంలో వచ్చే ఏడాది నుంచి మిగ్ 29 యుద్ద విమానాలు భాగస్వామ్యం కాబోతున్నాయని వెల్లడించారు. మిగ్ 29 యుద్ద విమానాల శిక్షణా కేంద్రం విశాఖలో ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది 30కి పైగా దేశాలు విశాఖలో జరిగే మిలన్-2020కి తూర్పు నావికా దళం ఆతిధ్యమివ్వబోతుండటం గర్వకారణమన్నారు. గత కొన్నేళ్లుగా అత్యాధునిక యుద్ద షిప్‌లు, విమానాలు, హెలీకాప్టర్లు, ఆయుధాలను ఇండియన్ నేవీ సమకూర్చుకోగలిగిందని అతుల్ కుమార్ జైన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment