
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు నమస్కరిస్తున్న మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంతంగా కనిపించే విశాఖ సాగరతీరం ఆదివారం సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. బాంబుల వర్షం.. యుద్ధ విమానాల చక్కర్లు, శత్రుమూకల దాడులు.. యుద్ధ ట్యాంకర్ల వీర విహారంతో.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. శత్రుదేశం పాక్‌పై విజయానికి ప్రతీకగా ఏటా విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్‌కే బీచ్‌లో ఆదివారం నేవీడే విన్యాసాలు నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ముందుగా నేవీ బ్యాండ్, నేవల్ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల ప్రదర్శనలతో ప్రారంభమైన విన్యాసాలు.. మార్కోస్ రాకతో వేడెక్కాయి. యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వైమానిక దళాల అద్భుత ప్రదర్శనలు, యుద్ధ, నిఘా విమానాలు, హెలికాప్టర్‌ల ద్వారా నిర్వహించబడే వ్యూహాత్మక విన్యాసాలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ఈవెంట్ అద్భుతంగా సాగింది. చివరిగా.. యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణతో నేవీడే విన్యాసాల్ని ముగించాయి.
విన్యాసాలకు విశిష్ట అతిథులుగా మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్, ఈఎన్‌సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్, ఎంపీ డా.సత్యవతి, కలెక్టర్ డా.మల్లికార్జున, సీపీ రవిశంకర్, జేసీ విశ్వనాథన్ హాజరయ్యారు. అనంతరం.. నేవీ హౌస్‌లో తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ‘ఎట్ హోమ్’ ఫంక్షన్ పేరుతో నిర్వహించిన తేనీటి విందులో గవర్నర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత నౌకాదళ పటిమని చాటిచెప్పే వీడియోను గవర్నర్ ఆవిష్కరించి తిలకించారు.