సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న 25 ఏళ్లలో భారతదేశం.. విశ్వగురువుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధీమా వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి నరనరాల్లో సంస్కృతి, సంప్రదాయాలు ఇమిడి ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నామని, 100 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవాలు చేసుకునే సమయంలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఢిల్లీకి వెలుపల రాష్ట్రపతి ఆధ్వర్యంలో మొదటిసారిగా విశాఖపట్నంలో భారత నావికాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో నిర్వహించిన నేవీ డే వేడుకలకు ఆమె ఆదివారం సాయంత్రం హాజరయ్యారు. అంతకు ముందు విజయవాడ నుంచి నేరుగా విశాఖ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. నావికా దళపతి, అధికారులు, రాష్ట్ర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు. భారత నౌకాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన యుద్ధ విన్యాసాల్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిలకించారు. రాష్టంలో వివిధ ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 6.25కి తూర్పు నౌకాదళానికి చెందిన అనంతగిరి కేంద్రానికి చేరుకొని నేవీ డే రిసెప్షన్‌కు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుంచి తిరుపతి బయలుదేరి వెళ్లారు. నేవీ డే వేడుకల సందర్భంగా రాష్ట్ర పతి ఏమన్నారంటే..
దేశ రక్షణలో నావికాదళం కీలక పాత్ర
భారత రక్షణలో మహిళల పాత్ర ఎంతో ఉంది. భారత నావికాదళంలో వివిధ హోదాల్లో మహిళలు కూడా దేశ రక్షణలో పాలుపంచుకుంటున్నారు. 1971లో పాకిస్థాన్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా డిసెంబరు 4వ తేదీన నేవీ డే వేడుకలను జరుపుకుంటున్నాం. ఈ యుద్ధంలో అసువులు బాసిన యుద్ధ వీరులను మరోసారి గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం.
వారి త్యాగాలను కీర్తిస్తూ.. ప్రతి తరానికి గుర్తు చేయడం మన బాధ్యత. మూడు వైపులా సముద్రం, ఒకవైపు పర్వతాలు కలిగిన మన దేశం.. మొదటి నుంచీ సముద్ర తీర దేశంగా ఉంది. సహజ సిద్ధంగా ఉన్న ఈ సముద్ర తీరం దేశాభివృద్ధికి ఎంతో కీలకం. తీర రక్షణలో భారత నేవీ ఎంతో కీలకపాత్ర పోషిస్తోంది.
భారత నావికాదళం ఎంతో శక్తివంతమైనదే కాకుండా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటోంది. భారత నూతన అభివృద్ధిలో నావికాదళం పాత్ర కీలకమైనదని త్రివిధ దళాధిపతిగా నాకు ఎంతో నమ్మకం ఉంది.
రాష్ట్రంలో ప్రారంభిస్తున్న వివిధ ప్రాజెక్టులు దేశాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయి. దేశ ప్రజలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఈ ప్రాజెక్టులు ఉపయుక్తంగా ఉంటాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కర్నూలు జిల్లాలో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్‌రేంజ్ (ఎన్‌వోఏఆర్)తో దేశ రక్షణలో మనం సిద్ధంగా ఉండేందుకు దోహదం చేయనుంది. ఇది దేశానికి మంచి ఆస్తిగా మారనుంది.
గిరిజన విద్యకు దోహదం
దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఏకలవ్య పాఠశాలలు గిరిజనుల్లో విద్యావకాశాలు పెంపొందేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి. రాష్ట్రంలో బుట్టాయగూడెం, చింతూరు, రాజవొమ్మంగి, గుమ్మలక్ష్మీపురంలో ప్రారంభిస్తున్న ఏకలవ్య పాఠశాలల వల్ల గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధితో పాటు గిరిజన ప్రజల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నా.
దేశంలో ఎవరైనా, వారి ప్రాంతం, కులం, మతంతో సంబంధం లేకుండా విద్య అందించేందుకు మనం
కృషి చేయాలి. విద్యను అందరికీ అందుబాటులో ఉంచేందుకు అన్ని చర్యలూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ రహదారి అభివృద్ధి పనులతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్దికి కూడా దోహదం చేస్తుంది.
రాష్ట్రపతి ప్రారంభించిన ప్రాజెక్టులు
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు రోడ్డు రవాణా, గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం 7 ప్రాజెక్టులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలులో రక్షణ పరిశోధన, లేబరేటరీ డెవలప్‌మెంట్ (డీఆర్‌డీఎల్) నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్(ఎన్‌ఓఏఆర్)ను ప్రారంభించారు.
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూ.932 కోట్ల వ్యయంతో చేపట్టిన నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించారు. అవి.. ఎన్‌హెచ్–340లో రాయచోటి నుంచి అంగళ్లు వరకు నిర్మించిన జాతీయ రహదారి, ఎన్‌హెచ్–205లో నిర్మించిన నాలుగు లేన్ల ఆర్‌వోబీతో పాటు ఎన్‌హెచ్–44లో కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటెడ్ స్ట్రక్చర్, స్లిప్ రోడ్స్, డోన్ నగర శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్స్, రహదారులు, ఎన్‌హెచ్–342లో ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు నిర్మించనున్న రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నిర్మించిన 4 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను (బుట్టాయగూడెం, చింతూరు, గుమ్మలక్ష్మీపురం, రాజవొమ్మంగి) రాష్ట్రపతి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment