నేనొక మగాడి శరీరంలో ఇరుక్కున్నా!
లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగానికి పనికి రారంటూ...
న్యూఢిల్లీ: సైన్యానికి సంబంధించి ఓ అరుదైన కేసు వెలుగు చూసింది. నౌకాదళంలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగానికి పనికి రారంటూ విధుల నుంచి తొలగించేశారు.
విశాఖపట్నం ఐఎన్‌ఎస్ ఏకశిల బేస్ లో విధులు నిర్వహిస్తున్న ఆ నావికుడు కొన్ని నెలల క్రితం ఆ లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ కోసం కొందరు సన్నిహితులను సంప్రదించాడు. ఆపై తన సొంత డబ్బుతోనే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు అని నేవీ వర్గాలు వెల్లడించాయి.
‘ప్రస్తుతం అతను మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో నావికాదళంలో అతను విధులు నిర్వర్తించటం చాలా కష్టం. మరోవైపు తోటి ఉద్యోగులు కూడా అతడి (ఆమె)తో పని చేసేందుకు ఇబ్బందిగా ఫీలయ్యారు. అందుకే అతన్ని స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగాలని కోరాం. వెంటనే అతను సంతోషంగా అంగీకరించాడు’ అని ఓ అధికారి తెలిపారు. నేనొక మగాడి శరరీరంలో చిక్కుకున్న మహిళను అంటూ తరచూ ఆ వ్యక్తి వ్యాఖ్యానించేవాడని సహచరులు చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్‌కు ముందు అతనికి వివాహం కూడా జరిగినట్లు సమాచారం.
ఇలాంటి సందర్భాల్లో అతని(ఆమె) పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవటంతో రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంతోపాటు విస్తృత స్థాయి బాధ్యతలను కూడా అప్పజెప్పాలని ఓవైపు కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ తరహా కేసు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది.