Navy Sailor
-
నేవీ ట్రైనింగ్‌లో ప్రమాదవశాత్తు చందక గోవింద్ మృతి
-
విజయనగరంలో విషాదం.. చందక గోవింద్ మృతి
సాక్షి, హైదరాబాద్: మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేవీ అధికారి చందక గోవింద్(31) మృతిచెందారు. దీంతో, గోవింద్ స్వగ్రామం విజయనగరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, పారాచ్యూట్ తెరుచుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు నేవీ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకగా.. పారాచ్యూట్ పూర్తిగా తెరుచుకోలేదు. దీంతో తీవ్ర గాయాలై మృతి చెందారు. ఇక, బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తున్నట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా.. పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్న వ్యూహాత్మక విమానాల్లో జవాన్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లు ఇక్కడ కసరత్తులలో పాల్గొంటాయి. పారాట్రూపర్ల బృందంలో సభ్యులైన గోవింద్.. C130J సూపర్ హెర్క్యులస్ విమానం నుంచి సాధారణ డ్రాప్ సమయంలో అదృశ్యమయ్యారని భారత వైమానిక దళం తెలిపింది. ఇక, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు తెలిపారు. కాగా, చందక గోవింద్ స్వగ్రామం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పర్ల గ్రామం. మరోవైపు.. రేపు స్వగ్రామానికి చందక గోవింద్ మృతదేహం చేరుకోనుంది. Adm R Hari Kumar #CNS & all personnel of #IndianNavy pay tribute to Chandaka Govind, Petty Officer who lost his life whilst undergoing training exercise at Panagarh on 05 Apr 23 and extend heartfelt condolences to the bereaved family. pic.twitter.com/FRLZ9k5018 — SpokespersonNavy (@indiannavy) April 5, 2023 -
నావీ షిప్లో అగ్ని ప్రమాదం.. 17 మందికి గాయాలు
లాస్ ఏంజిల్స్ : కాలిఫోర్నియాలోని యునైటెడ్ స్టేట్స్ నావీ షిప్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శాన్‌డియాగో ఓడరేవులో ఉన్న యూఎస్ బోన్హోమ్ రిచర్డ్, ఆన్ అంఫిబియస్ అసల్ట్ నౌకలో అనూహ్యంగా పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడినట్లు అధికారులు, స్థానిక మీడియా పేర్కొంది. దట్టమైన పొగ పీల్చడం ద్వారా 17 మంది నావికులు నలుగురు పౌరులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటన సమయంలో సుమారు 160 మంది నావికులు పోర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (ఐదురోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు) -
భారత నావికులకు వలపు వల
ఈ ఏడాది జనవరిలో.. ఫేస్బుక్లో అనితా చోప్రా అనే పాక్ యువతి వేసిన వలలో ఆర్మీ జవాన్లు చిక్కుకుని మన సైనిక సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. దాయాది దేశమైన పాకిస్తాన్ భారత నౌకాదళ సమాచారాన్ని దోచుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ ఇలా! నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు శత్రు దేశమైన పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకు 2017లో భారత నావికులను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని కొందరు యువతులతో హనీ ట్రాప్ (వలపు వల) వేసింది. ఇలా కొందరు యువతులు ఫేస్బుక్ ద్వారా నావికులతో పరిచయం పెంచుకున్నారు. తాము వ్యాపార వేత్తలమంటూ వారు నావికుల్ని నమ్మించి వారితో శారీరక సంబంధం వరకు వెళ్లారు. నావికులతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పాక్ ఏజెంట్లు ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి పాక్ గూఢచర్య విభాగం భారత నావికుల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారత నౌకాదళ సమాచారం తమకు చేరవేయాలని, ఇందుకు ప్రతిఫలంగా హవాలా ద్వారా సొమ్ము కూడా ఇస్తామని ఆశ చూపడంతో నేవీ సెయిలర్స్ వారికి లొంగిపోయారు. ఏడాది నుంచి సమాచారం ఈ సెయిలర్స్ 2018 అక్టోబర్ నుంచి పాకిస్తాన్‌కు సమాచారం అందించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తిం చాయి. యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సమాచా రాన్ని శత్రు దేశానికి చేరవేసినట్లు సమాచారం. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది, వివిధ జలాంతర్గాముల ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి.. తదితర కీలక సమాచారం సెయిలర్లు దాయాది దేశానికి చేరవేశారు. సమాచారం ఇచ్చిన ప్రతి నెలా వారికి పాక్ ఏజెంట్లు హవాలా రూపంలో డబ్బులు అందజేసేవారు. ఇందుకోసం ఒక హవాలా ఆపరేటర్‌ను సైతం నియమించారు. ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’తో బట్టబయలు భారత నౌకాదళంలో కొందరు దేశద్రోహులున్నారని అధికారిక వర్గాలకు రహస్య సమాచారం అందింది. నౌకాదళ నిఘా వర్గాలు 4 నెలల క్రితం ఓ సెయిలర్ ఫోన్ మాట్లాడుతుండగా.. రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాయి. మిగిలిన వారిపైనా నిఘా పెంచగా.. ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. వారి ఫేస్బుక్ సంభాషణల్నీ గమనించారు. దీంతో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలు పెట్టాయి. హవాలా ద్వారా డబ్బులు తీసుకుంటున్న సమయంలో నావికుల్ని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 7 నేవీ సెయిలర్స్‌తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు, విశాఖకు చెందిన ముగ్గురు నౌకాదళ సిబ్బందితోపాటు ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్ ఉన్నారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుల్ని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించగా.. జనవరి 3 వరకూ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద మొత్తం లో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
రేప్ లిస్ట్... స్టార్ మార్క్
వాషింగ్టన్ : అమెరికా సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు నేవీ అధికారులు.. తోటి మహిళా ఉద్యోగులను ఉద్దేశిస్తూ లైంగిక వ్యాఖ్యలు చేస్తూ తయారు చేసిన లిస్ట్ ఒకటి ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 74 పేజీలతో రెండు భాగాలుగా ఈ లిస్ట్‌ను తయారు చేశారు. ఒక దానిలో కొందరు మహిళా ఉద్యోగుల పేర్లు రాసి.. వాటి పక్కన స్టార్ రేటింగ్‌తో సూచించగా.. మరోదానిలో ఇంకొందరు మహిళా ఉద్యోగుల పేర్లను రాసి.. పక్కన అసభ్యకర కామెంట్లు చేసి ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం గత ఏడాదే వెలుగులోకి వచ్చింది. కానీ దీనిపై అధికారులేవరూ స్పందించకపోవడం గమనార్హం. తాజాగా మిలిటరీ.కామ్ అనే వెబ్సైట్ ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. ఈ వెబ్సైట్ కథనం ప్రకారం.. ‘యూఎస్ఎస్ ఫ్లోరిడా గైడెడ్ సబ్‌మెరైన్’ మహిళా ఉద్యోగులను నియమించుకున్న రెండో సబ్మెరైన్గా ఓ ప్రత్యేకత సాధించుకుంది. మొత్తం ఈ సబ్‌మెరైన్‌లో 173 మంది పని చేస్తుండగా.. వారిలో 32 మంది మహిళా క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరిని గత ఏడాది ఫిబ్రవరిలో విధుల్లోకి తీసుకున్నారు. ఓ నాలుగు నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాత ఈ లైంగిక వ్యాఖ్యల వ్యవహారం చోటు చేసుకుంది. సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు అధికారులు మహిళా ఉద్యోగులను.. వారి శరీరాకృతి, క్యారెక్టర్ వంటి అంశాల ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. దానిలో ఒక దానికి ‘రేప్ లిస్ట్’ అని పేరు పెట్టారు. ఇందులో పేర్కొన్న మహిళలపై అత్యాచారం చేయాలని భావిస్తున్నట్లు లిస్ట్‌లో వెల్లడించారు. మరో లిస్ట్‌లో కొందరు మహిళల పేర్లను చేర్చి వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరగడం వంటి అంశాలన్ని చాలా సీక్రెట్‌గా జరిగాయని సదరు వెబ్సైట్ తెలిపింది. ఈ విషయంపై అధికారులేవరు నోరు మెదపడంలేదు. ఇందుకు పాల్పడిన ఓ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకున్నట్లు మిలిటరీ.కామ్ వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ రేప్ లిస్ట్ వ్యవహారం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
నేనొక మగాడి శరీరంలో ఇరుక్కున్నా!
న్యూఢిల్లీ: సైన్యానికి సంబంధించి ఓ అరుదైన కేసు వెలుగు చూసింది. నౌకాదళంలో లింగ మార్పిడి చేయించుకున్న ఓ నావికాధికారిని ఉద్యోగానికి పనికి రారంటూ విధుల నుంచి తొలగించేశారు. విశాఖపట్నం ఐఎన్ఎస్ ఏకశిల బేస్ లో విధులు నిర్వహిస్తున్న ఆ నావికుడు కొన్ని నెలల క్రితం ఆ లింగ మార్పిడి చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆపరేషన్ కోసం కొందరు సన్నిహితులను సంప్రదించాడు. ఆపై తన సొంత డబ్బుతోనే లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడు అని నేవీ వర్గాలు వెల్లడించాయి. ‘ప్రస్తుతం అతను మహిళగా మారిపోయాడు. ఈ నేపథ్యంలో నావికాదళంలో అతను విధులు నిర్వర్తించటం చాలా కష్టం. మరోవైపు తోటి ఉద్యోగులు కూడా అతడి (ఆమె)తో పని చేసేందుకు ఇబ్బందిగా ఫీలయ్యారు. అందుకే అతన్ని స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలగాలని కోరాం. వెంటనే అతను సంతోషంగా అంగీకరించాడు’ అని ఓ అధికారి తెలిపారు. నేనొక మగాడి శరరీరంలో చిక్కుకున్న మహిళను అంటూ తరచూ ఆ వ్యక్తి వ్యాఖ్యానించేవాడని సహచరులు చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్‌కు ముందు అతనికి వివాహం కూడా జరిగినట్లు సమాచారం. ఇలాంటి సందర్భాల్లో అతని(ఆమె) పై చర్యలు తీసుకునేందుకు ఎలాంటి నిబంధనలు నేవీ చట్టంలో లేకపోవటంతో రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించినట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించటంతోపాటు విస్తృత స్థాయి బాధ్యతలను కూడా అప్పజెప్పాలని ఓవైపు కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ తరహా కేసు వెలుగులోకి రావటం చర్చనీయాంశంగా మారింది. -
గన్ పేలి విశాఖలో నేవీ ఉద్యోగి మృతి
ఆత్మహత్య అనే అనుమానాలు మల్కాపురం (విశాఖపశ్చిమ): అనుమానాస్పద రీతిలో నేవీ ఉద్యోగి మృతి చెందిన ఘటన గురువారం విశాఖలో జరిగింది. గన్ పేలి వికాశ్ (21) అనే నేవీ సెయిలర్ ప్రాణాలు కోల్పోయాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన వికాశ్ ఐఎన్ఎస్ రాణా యుద్ధనౌకలో సెయిలర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతను విధుల్లో చేరాడు. యుద్దనౌకకు సమీపాన నేవల్ డార్మినేటర్లో తోటి ఉద్యోగులతో కలసి ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజాము నాలుగు గంటలకు నౌక వద్దకు సెక్యూరిటీ విధులకు వెళ్లాడు. అయితే విధుల్లో ఉండగా.. కొద్ది సేపటికే గన్ పేలింది. వికాశ్ దవడ క్రింద భాగం నుండి తల పైభాగం మీదుగా బుల్లెట్ వెళ్లింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. గన్ శబ్దంతో శత్రువులు ఎవరైనా వచ్చారా అని చూడటానికి వచ్చిన తోటి ఉద్యోగులు.. కుప్పకూలి ఉన్న వికాశ్‌ను చూసి పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వికాశ్‌ను ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందించారు. అనంతరం మల్కాపురం పోలీసులకు నేవీ అధికారులు ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐ కేశవరావు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతిపై అనుమానాలు..: యుద్ధనౌకలో దిగువ స్థాయి ఉద్యోగులను ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. వికాశ్ మృతికి ఈ కారణం ఏమైనా ఉంటుందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే వ్యక్తిగత సమస్యల కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు.