వాషింగ్టన్ : అమెరికా సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు నేవీ అధికారులు.. తోటి మహిళా ఉద్యోగులను ఉద్దేశిస్తూ లైంగిక వ్యాఖ్యలు చేస్తూ తయారు చేసిన లిస్ట్ ఒకటి ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 74 పేజీలతో రెండు భాగాలుగా ఈ లిస్ట్‌ను తయారు చేశారు. ఒక దానిలో కొందరు మహిళా ఉద్యోగుల పేర్లు రాసి.. వాటి పక్కన స్టార్ రేటింగ్‌తో సూచించగా.. మరోదానిలో ఇంకొందరు మహిళా ఉద్యోగుల పేర్లను రాసి.. పక్కన అసభ్యకర కామెంట్లు చేసి ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం గత ఏడాదే వెలుగులోకి వచ్చింది. కానీ దీనిపై అధికారులేవరూ స్పందించకపోవడం గమనార్హం. తాజాగా మిలిటరీ.కామ్ అనే వెబ్‌సైట్ ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది.
ఈ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. ‘యూఎస్‌ఎస్ ఫ్లోరిడా గైడెడ్ సబ్‌మెరైన్’ మహిళా ఉద్యోగులను నియమించుకున్న రెండో సబ్‌మెరైన్‌గా ఓ ప్రత్యేకత సాధించుకుంది. మొత్తం ఈ సబ్‌మెరైన్‌లో 173 మంది పని చేస్తుండగా.. వారిలో 32 మంది మహిళా క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరిని గత ఏడాది ఫిబ్రవరిలో విధుల్లోకి తీసుకున్నారు. ఓ నాలుగు నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాత ఈ లైంగిక వ్యాఖ్యల వ్యవహారం చోటు చేసుకుంది. సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు అధికారులు మహిళా ఉద్యోగులను.. వారి శరీరాకృతి, క్యారెక్టర్ వంటి అంశాల ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. దానిలో ఒక దానికి ‘రేప్ లిస్ట్’ అని పేరు పెట్టారు. ఇందులో పేర్కొన్న మహిళలపై అత్యాచారం చేయాలని భావిస్తున్నట్లు లిస్ట్‌లో వెల్లడించారు.
మరో లిస్ట్‌లో కొందరు మహిళల పేర్లను చేర్చి వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరగడం వంటి అంశాలన్ని చాలా సీక్రెట్‌గా జరిగాయని సదరు వెబ్‌సైట్ తెలిపింది. ఈ విషయంపై అధికారులేవరు నోరు మెదపడంలేదు. ఇందుకు పాల్పడిన ఓ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకున్నట్లు మిలిటరీ.కామ్ వెబ్‌సైట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ రేప్ లిస్ట్ వ్యవహారం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment