women crew member
-
పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమాన సర్వీసులు
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం అనే నారీశక్తి నినాదానికి మరింత మద్దతు పలికింది ఎయిర్ఇండియా. మార్చి ఒకటోతేదీ నుంచి 90 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి మహిళా సిబ్బందితోనే నడిపింది! బుధవారం సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మొత్తం 1,825 మంది పైలెట్లలో 15 శాతం మంది అంటే 275 మంది పైలెట్లు మహిళలేనని పేర్కొంది. ఎయిర్ఇండియా మొత్తం సిబ్బందిలో 40 శాతానికిపైగా నారీమణులే ఉండటం విశేషం. కాక్‌పిట్ క్రూలో 15 శాతం అతివలే. ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది కమర్షియల్ ఉమెన్ పైలెట్లు ఉన్న దేశం భారత్’ అని ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు. ‘ వైమానిక రంగ సంబంధ వృత్తులను ఎంచుకుంటున్న భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించగలిగే అవకాశం వచ్చింది’ అని ఆయన అన్నారు. -
సౌదీ ఏవియేషన్ చరిత్రలో తొలిసారి..
Women-only Crew Operates: గల్ఫ్ దేశాల్లో మహిళలకు ఎలాంటి ఆంక్షలు ఉంటాయో అందరికీ తెలిసిందే. అలాంటి సౌదీ అరేబియాలో తొలిసారిగా ఒక విమానాన్ని మొత్తం మహిళలే నిర్వహిస్తున్నారు. అందులో మొత్తం మహిళా సిబ్బందే పనిచేస్తారు. ఇది మహిళా సాధికారతకు ఒక పెద్ద నిర్వచనంగా చెప్పవచ్చు. ఈ విమానాన్ని ఇటీవలే ప్రారంభించామని ఒక చిన్న దేశీయ ప్రయాణాన్ని కూడా చేసిందని సౌదీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ఎర్రసముద్ర తీరం నుంచి జెడ్డా వరకు విమానాన్ని నడిపారని కూడా తెలిపారు. ఫ్లైడీల్ ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తుండగా, సౌదీ విమానయాన చరిత్రలో తొలిసారిగా సరికొత్త ఏ 320 విమానాన్ని మొత్తం మహిళా సిబ్బందితో నడిపించిందని అన్నారు. అంతేకాదు ఈ విమానాన్ని నడిపిన మహిళా ఫైలెట్ కూడా అత్యంత పిన్న వయసురాలు కావడం మరో విశేషం. గత కొన్ని సంవత్సరాలుగా సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో ఎక్కువ శాతం మహిళల భాగస్వామ్యం ఉండేలా కృషి చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ విమానాన్ని పూర్తిగా మహిళలే నిర్వహించేలా చేసింది. For the first time in Saudi aviation history!🇸🇦 #flyadeal operated the first flight with all-female crew, majority of which are Saudis by the newest A320 aircraft. Flight 117, flew from #Riyadh to #Jeddah ✈️💜 pic.twitter.com/fWo08hYMd7 — طيران أديل (@flyadeal) May 20, 2022 (చదవండి: వైరల్ వీడియో.. ఎయిర్‌పోర్టులో కన్వేయర్ బెల్ట్‌పై మృతదేహం?) -
ఆ 12 మంది స్త్రీలకు సెల్యూట్..
కశ్మీర్: శీతాకాలం వస్తే లద్దాఖ్‌కు వెళ్లే రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోతాయి. వాహనాల రాకపోకలు స్తంభిస్తాయి. కాని సరిహద్దులో ఉన్న 50 వేల మంది సైనికులకు భోజనం అందాలంటే గ్యాస్ తప్పనిసరి. ఆ సమయంలో లద్దాఖ్‌లో ఉన్న ఏకైక ఇండియన్ ఆయిల్ ఎల్పీజీ ప్లాంటే శరణ్యం. ఇది ఆల్ ఉమెన్ క్రూ ప్లాంట్. ఇక్కడ పని చేసే 12 మంది స్త్రీలు గడ్డ కట్టే చలిని కూడా లెక్క చేయక గ్యాస్ నింపిన సిలిండర్లను సైనికులకు చేర్చి వారి ఆకలి తీరుస్తారు. సెరింగ్ ఆంగ్మో రోజూ ఆ ప్లాంట్‌కు 20 కిలోమీటర్ల నుంచి వస్తుంది ఉద్యోగం చేయడానికి. రిగ్జిన్ లాడో 35 కిలోమీటర్ల దూరం నుంచి హాజరవుతుంది ఉద్యోగానికి. అలాగే మిగిలిన పది మంది స్త్రీలు కూడా. వీరంతా 20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు. వివాహితలు. తెల్లవారు జామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టి, పిల్లలకు కావలసినవి చూసి ఎల్పీజీ ప్లాంట్‌కు తీసుకెళ్లే బస్ కోసం వచ్చి బయట నిలబడతారు. వాళ్లు ఆ బస్ మిస్ అయితే ఆ రోజుకు ఉద్యోగం చేయనట్టే. ఎందుకంటే తమకు తాముగా ప్లాంట్ వరకూ చేరుకోవడం ప్రయాసతో కూడిన పని. లద్దాఖ్‌కు దాపునే ఇండియన్ ఆయిల్ వారు ఒక ఎల్పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. లద్దాఖ్ మొత్తానికి ఇది ఒక్కటే ఫిల్లింగ్ ప్లాంట్. సాధారణ రోజుల్లో ఇక్కడ నిండే సిలిండర్లు సామాన్య ప్రజల కోసమే అయినా శీతాకాలంలో ఈ ప్లాంట్ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఎందుకంటే దేశం నుంచి గ్యాస్ సిలిండర్లు సైనికులకు వెళ్లే మార్గాలన్ని మంచుతో కప్పబడిపోతాయి. లద్దాఖ్ సరిహద్దున దేశ పహారాకు దాదాపు 50 వేల మంది సైనికులు కర్తవ్య నిర్వహణలో ఉంటారు. వారికి ఆహారం వండాలంటే గ్యాస్ తప్పనిసరి. అప్పుడు ఈ ప్లాంట్‌లో తయారయ్యే దాదాపు 40 శాతం సిలిండర్లు సైనిక స్థావరాలకు చేరుతాయి. (చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లద్దాఖ్‌కు విదేశీ యువతుల క్యూ) ‘నేను ఈ ప్లాంట్‌లో చేరినప్పుడు నాకు సిలిండర్‌కు రెగ్యులేటర్ బిగించడం కూడా రాదు. ఇప్పుడు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లే సిలిండర్ క్వాలిటీ కచ్చితంగా చెక్ చేయగలను’ అని చెప్పింది పద్మా సోగ్యాల్ అనే మరో కార్మికురాలు. ఈమె రోజూ చోగ్లమ్‌సర్ అనే ప్రాంతం నుంచి డ్యూటీకి వస్తుంది. ‘నేను దేశం కోసం ఎంతో కొంత చేయగలుగుతున్నాను అన్న సంతోషం ఉంది’ అంటుంది పద్మ. ఈ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డులుగా, లోడ్ ఆపరేటర్లుగా మాత్రమే మగవారు ఉన్నారు. మిగిలిన టెక్నికల్ వర్క్ అంతా ఆడవారు చేస్తారు. ‘గడ్డ కట్టే చలిలో కూడా వీరు వచ్చి పని చేస్తారు. అది కూడా చాలా బాగా పని చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఫలితాలను ఇచ్చే స్త్రీ శక్తికి ఉదాహరణ ఇది’ అంటారు ఇండియన్ ఆయిల్ అధికారి ఒకరు. ఈ మహిళా ఉద్యోగులు అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. అయితే వీరికి చింత లేదు. అంతంత దూరం నుంచి రోజూ వచ్చి పోతున్నందుకు బాధా లేదు.‘ఈ పనిని మేము సంతోషంగా చేస్తున్నాం’ అంటారు ఆ 12 మంది స్త్రీలు. మనం నగరాల్లో, పట్టణాల్లో పనులు చేసుకుంటూ ఉంటాం. మన కోసం సరిహద్దుల్లో సైనికులు పని చేస్తుంటారు. వారి కోసం పని చేసే వారూ ఉంటారు. ఆ పని చేసే వారు స్త్రీలు అని తెలుసుకోవడం ఈ దేశపు ప్రతి అవసరం లో స్త్రీ శ్రమ ఉందని తెలుసుకోవడం మనం స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవపు సూచిని మరింత పెంచుకునేలా చేస్తుంది. సెల్యూట్ . -
రేప్ లిస్ట్... స్టార్ మార్క్
వాషింగ్టన్ : అమెరికా సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు నేవీ అధికారులు.. తోటి మహిళా ఉద్యోగులను ఉద్దేశిస్తూ లైంగిక వ్యాఖ్యలు చేస్తూ తయారు చేసిన లిస్ట్ ఒకటి ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. దాదాపు 74 పేజీలతో రెండు భాగాలుగా ఈ లిస్ట్‌ను తయారు చేశారు. ఒక దానిలో కొందరు మహిళా ఉద్యోగుల పేర్లు రాసి.. వాటి పక్కన స్టార్ రేటింగ్‌తో సూచించగా.. మరోదానిలో ఇంకొందరు మహిళా ఉద్యోగుల పేర్లను రాసి.. పక్కన అసభ్యకర కామెంట్లు చేసి ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం గత ఏడాదే వెలుగులోకి వచ్చింది. కానీ దీనిపై అధికారులేవరూ స్పందించకపోవడం గమనార్హం. తాజాగా మిలిటరీ.కామ్ అనే వెబ్సైట్ ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించింది. ఈ వెబ్సైట్ కథనం ప్రకారం.. ‘యూఎస్ఎస్ ఫ్లోరిడా గైడెడ్ సబ్‌మెరైన్’ మహిళా ఉద్యోగులను నియమించుకున్న రెండో సబ్మెరైన్గా ఓ ప్రత్యేకత సాధించుకుంది. మొత్తం ఈ సబ్‌మెరైన్‌లో 173 మంది పని చేస్తుండగా.. వారిలో 32 మంది మహిళా క్రూ మెంబర్స్ ఉన్నారు. వీరిని గత ఏడాది ఫిబ్రవరిలో విధుల్లోకి తీసుకున్నారు. ఓ నాలుగు నెలలు బాగానే గడిచింది. ఆ తర్వాత ఈ లైంగిక వ్యాఖ్యల వ్యవహారం చోటు చేసుకుంది. సబ్‌మెరైన్‌లో పని చేస్తున్న కొందరు అధికారులు మహిళా ఉద్యోగులను.. వారి శరీరాకృతి, క్యారెక్టర్ వంటి అంశాల ఆధారంగా రెండు భాగాలుగా విభజించారు. దానిలో ఒక దానికి ‘రేప్ లిస్ట్’ అని పేరు పెట్టారు. ఇందులో పేర్కొన్న మహిళలపై అత్యాచారం చేయాలని భావిస్తున్నట్లు లిస్ట్‌లో వెల్లడించారు. మరో లిస్ట్‌లో కొందరు మహిళల పేర్లను చేర్చి వారి గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడం.. దీనిపై ఫోరెన్సిక్ విచారణ జరగడం వంటి అంశాలన్ని చాలా సీక్రెట్‌గా జరిగాయని సదరు వెబ్సైట్ తెలిపింది. ఈ విషయంపై అధికారులేవరు నోరు మెదపడంలేదు. ఇందుకు పాల్పడిన ఓ ముగ్గురు అధికారుల మీద చర్యలు తీసుకున్నట్లు మిలిటరీ.కామ్ వెబ్సైట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ రేప్ లిస్ట్ వ్యవహారం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
ఈ విమానంలో అంతా మహిళా సిబ్బందే
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేషనల్ క్యారియర్ ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడుపుతోంది. అందరూ మహిళా సిబ్బందితోనే కోల్కత్తా-డిమాపూర్-కోల్కత్తా సెక్టార్లో ఈ విమానాన్ని ఆపరేట్ చేస్తోంది. ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో విమానం ఏఐ709, ఎయిర్‌బస్ 319కు కాక్‌పిట్ సిబ్బందిగా కెప్టెన్ ఆకాంక్ష వర్మ, కెప్టెన్ సతోవిసా బెనర్జీ వ్యవహరిస్తున్నారని, క్యాబిన్ సిబ్బందిగా డి భుటియా, ఎంజీ మోహన్‌రాజ్, టీ ఘోస్, యతటిలి కత్‌లు ఉన్నారని తెలిపింది. ఎయిరిండియా జనరల్ మేనేజర్, పర్సనల్ నవ్‌నీత్ సిధు, ఇతర సీనియర్ సిబ్బంది కలిసి ఈ విమానానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారని ఎయిర్‌లైన్స్ పేర్కొంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీకంతా పలు ఈవెంట్లను ఈ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే తొలిసారి అంతా మహిళా సిబ్బందితో కూడా విమానాన్ని 1985లో ఎయిరిండియా నడిపింది. అత్యంత పొడవైన మార్గం ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో-ఢిల్లీ రూట్లో కూడా అంతా మహిళా సిబ్బందితో ఎయిరిండియా ఓ ప్రత్యేక విమానాన్ని నడిపి, ప్రపంచ రికార్డును సాధించింది. -
ఆకాశంలో ఆడ దొంగ..
ఉన్నత చదువులు, ఆధునిక వస్త్రధారణ, మంచి జీతం, మరెన్నో అలవెన్సులు, అందరిలో గుర్తింపు.. వీలైనంతమేరలో హైఫై జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సంతృప్తి చెందని ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని.. అప్పనంగా దొరికినకాడికి దోచేసుకునే ప్రయత్నం చేసింది. విమానంలో ప్రాయాణికులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లను ఎంచక్కా బ్యాగులో తోసేసి దొంగతనానికి పాల్పడింది. చివరికి ఎయిర్ పోర్టు విజిలెన్స్ అధికారులకు పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకుంది. చెన్నై విమానాశ్రయంలో జనవరి 27న పట్టుబడ్డ ఆ ఆడ దొంగ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా 274 (కొలంబో- ఢిల్లీ- చెన్నై) సర్వీసులో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగి.. ట్రిప్ పూర్తయిన వెంటనే భారీ బ్యాగుతో విమానంలోనుంచి దిగింది. ఆమె తీరును అనుమానించిన ఎయిర్ పోర్ట్ విజిలెన్స్ అధికారులు బ్యాగును తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. అవన్నీ ప్రయాణికులకు అందజేయాల్సినవే కావటం గమనార్హం. మహిళా సిబ్బంది చర్యను తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా వెంటనే ఆమెను విధుల నుంచి తొలిగించింది. సిబ్బంది ఇలా దొంగతనాలకు పాల్పడిన వార్తలు గతంలోనూ వెలుగుచూసినప్పటికీ ఇంత భారీ మొత్తంలో వస్తువులు లభించడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.