ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని బ్యాగులో దొరికిన ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు
ఉన్నత చదువులు, ఆధునిక వస్త్రధారణ, మంచి జీతం, మరెన్నో అలవెన్సులు, అందరిలో గుర్తింపు.. వీలైనంతమేరలో హైఫై జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ సంతృప్తి చెందని ఎయిర్ ఇండియా మహిళా ఉద్యోగిని.. అప్పనంగా దొరికినకాడికి దోచేసుకునే ప్రయత్నం చేసింది.
విమానంలో ప్రాయాణికులకు అందించాల్సిన ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లను ఎంచక్కా బ్యాగులో తోసేసి దొంగతనానికి పాల్పడింది. చివరికి ఎయిర్ పోర్టు విజిలెన్స్ అధికారులకు పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకుంది. చెన్నై విమానాశ్రయంలో జనవరి 27న పట్టుబడ్డ ఆ ఆడ దొంగ వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఎయిర్ ఇండియా 274 (కొలంబో- ఢిల్లీ- చెన్నై) సర్వీసులో విధులు నిర్వహించిన మహిళా ఉద్యోగి.. ట్రిప్ పూర్తయిన వెంటనే భారీ బ్యాగుతో విమానంలోనుంచి దిగింది. ఆమె తీరును అనుమానించిన ఎయిర్ పోర్ట్ విజిలెన్స్ అధికారులు బ్యాగును తనిఖీ చేయగా అందులో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు, లిక్కర్ బాటిళ్లు కనిపించాయి. అవన్నీ ప్రయాణికులకు అందజేయాల్సినవే కావటం గమనార్హం.
మహిళా సిబ్బంది చర్యను తీవ్రంగా పరిగణించిన ఎయిర్ ఇండియా వెంటనే ఆమెను విధుల నుంచి తొలిగించింది. సిబ్బంది ఇలా దొంగతనాలకు పాల్పడిన వార్తలు గతంలోనూ వెలుగుచూసినప్పటికీ ఇంత భారీ మొత్తంలో వస్తువులు లభించడం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.