కశ్మీర్: శీతాకాలం వస్తే లద్దాఖ్‌కు వెళ్లే రోడ్లన్నీ మంచుతో కప్పబడిపోతాయి. వాహనాల రాకపోకలు స్తంభిస్తాయి. కాని సరిహద్దులో ఉన్న 50 వేల మంది సైనికులకు భోజనం అందాలంటే గ్యాస్ తప్పనిసరి. ఆ సమయంలో లద్దాఖ్‌లో ఉన్న ఏకైక ఇండియన్ ఆయిల్ ఎల్‌పీజీ ప్లాంటే శరణ్యం. ఇది ఆల్ ఉమెన్ క్రూ ప్లాంట్. ఇక్కడ పని చేసే 12 మంది స్త్రీలు గడ్డ కట్టే చలిని కూడా లెక్క చేయక గ్యాస్ నింపిన సిలిండర్లను సైనికులకు చేర్చి వారి ఆకలి తీరుస్తారు. సెరింగ్ ఆంగ్‌మో రోజూ ఆ ప్లాంట్‌కు 20 కిలోమీటర్ల నుంచి వస్తుంది ఉద్యోగం చేయడానికి. రిగ్‌జిన్ లాడో 35 కిలోమీటర్ల దూరం నుంచి హాజరవుతుంది ఉద్యోగానికి. అలాగే మిగిలిన పది మంది స్త్రీలు కూడా. వీరంతా 20 నుంచి 40 ఏళ్ల వయసు మధ్య ఉన్నవారు. వివాహితలు. తెల్లవారు జామునే లేచి ఇంటి పనులు చక్కబెట్టి, పిల్లలకు కావలసినవి చూసి ఎల్‌పీజీ ప్లాంట్‌కు తీసుకెళ్లే బస్ కోసం వచ్చి బయట నిలబడతారు. వాళ్లు ఆ బస్ మిస్ అయితే ఆ రోజుకు ఉద్యోగం చేయనట్టే. ఎందుకంటే తమకు తాముగా ప్లాంట్ వరకూ చేరుకోవడం ప్రయాసతో కూడిన పని.
లద్దాఖ్‌కు దాపునే ఇండియన్ ఆయిల్ వారు ఒక ఎల్‌పీజీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి ఉన్నారు. లద్దాఖ్ మొత్తానికి ఇది ఒక్కటే ఫిల్లింగ్ ప్లాంట్. సాధారణ రోజుల్లో ఇక్కడ నిండే సిలిండర్లు సామాన్య ప్రజల కోసమే అయినా శీతాకాలంలో ఈ ప్లాంట్ ప్రాముఖ్యం పెరుగుతుంది. ఎందుకంటే దేశం నుంచి గ్యాస్ సిలిండర్లు సైనికులకు వెళ్లే మార్గాలన్ని మంచుతో కప్పబడిపోతాయి. లద్దాఖ్ సరిహద్దున దేశ పహారాకు దాదాపు 50 వేల మంది సైనికులు కర్తవ్య నిర్వహణలో ఉంటారు. వారికి ఆహారం వండాలంటే గ్యాస్ తప్పనిసరి. అప్పుడు ఈ ప్లాంట్‌లో తయారయ్యే దాదాపు 40 శాతం సిలిండర్లు సైనిక స్థావరాలకు చేరుతాయి.
(చదవండి: ప్రెగ్నెన్సీ కోసం లద్దాఖ్‌కు విదేశీ యువతుల క్యూ)
‘నేను ఈ ప్లాంట్‌లో చేరినప్పుడు నాకు సిలిండర్‌కు రెగ్యులేటర్ బిగించడం కూడా రాదు. ఇప్పుడు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లే సిలిండర్ క్వాలిటీ కచ్చితంగా చెక్ చేయగలను’ అని చెప్పింది పద్మా సోగ్యాల్ అనే మరో కార్మికురాలు. ఈమె రోజూ చోగ్లమ్‌సర్ అనే ప్రాంతం నుంచి డ్యూటీకి వస్తుంది. ‘నేను దేశం కోసం ఎంతో కొంత చేయగలుగుతున్నాను అన్న సంతోషం ఉంది’ అంటుంది పద్మ. ఈ ప్లాంట్‌లో సెక్యూరిటీ గార్డులుగా, లోడ్ ఆపరేటర్లుగా మాత్రమే మగవారు ఉన్నారు. మిగిలిన టెక్నికల్ వర్క్ అంతా ఆడవారు చేస్తారు. ‘గడ్డ కట్టే చలిలో కూడా వీరు వచ్చి పని చేస్తారు. అది కూడా చాలా బాగా పని చేస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఫలితాలను ఇచ్చే స్త్రీ శక్తికి ఉదాహరణ ఇది’ అంటారు ఇండియన్ ఆయిల్ అధికారి ఒకరు.
ఈ మహిళా ఉద్యోగులు అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులే. అయితే వీరికి చింత లేదు. అంతంత దూరం నుంచి రోజూ వచ్చి పోతున్నందుకు బాధా లేదు.‘ఈ పనిని మేము సంతోషంగా చేస్తున్నాం’ అంటారు ఆ 12 మంది స్త్రీలు. మనం నగరాల్లో, పట్టణాల్లో పనులు చేసుకుంటూ ఉంటాం. మన కోసం సరిహద్దుల్లో సైనికులు పని చేస్తుంటారు. వారి కోసం పని చేసే వారూ ఉంటారు. ఆ పని చేసే వారు స్త్రీలు అని తెలుసుకోవడం ఈ దేశపు ప్రతి అవసరం లో స్త్రీ శ్రమ ఉందని తెలుసుకోవడం మనం స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవపు సూచిని మరింత పెంచుకునేలా చేస్తుంది. సెల్యూట్ .
Comments
Please login to add a commentAdd a comment