యుద్ధట్యాంకు నదిలో మునిగి కొట్టుకుపోయిన ఐదుగురిలో నాగరాజు
కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర నాగరాజు స్వగ్రామం
నేడు స్వగ్రామానికి నాగరాజు భౌతికదేహం
పెడన: సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లద్దాఖ్‌లోని ఎల్‌ఏసీ సమీపంలోని నదిని దాటుతున్న యుద్ధట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో మృతిచెందిన ఐదుగురిలో కృష్ణాజిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాను సాదరబోయిన నాగరాజు (32) ఉన్నారు. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి (47) మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు.
ఎనిమిదేళ్ల కిందట ఇంటర్ పూర్తయిన తరువాత నాగరాజు ఆర్మీలో చేరారు. నాగరాజుకు 2019 అక్టోబర్‌లో తేలప్రోలుకు చెందిన మంగాదేవితో వివాహమైంది. మంగాదేవి పెడన మండలం ఉరివి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వారికి ఏడాది వయసున్న కుమార్తె హాసిని ఉంది. భర్త మరణ వార్త విన్నప్పటి నుంచి మంగాదేవి ఉలుకుపలుకు లేకుండా ఉందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నాగరాజు తల్లిదండ్రులు వెంకన్న, ధనలక్షి్మ. నాగరాజుకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో సెలవులకు ఇంటికి వచి్చన నాగరాజు ఆర్మీ జవానుగా పనిచేస్తున్న తన తమ్ముడు శివయ్య కుమార్తెకు అన్నప్రాశన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో నాగరాజు తిరిగి విధులకు హాజరయ్యారు.
నేడు స్వగ్రామానికి మృతదేహం
నాగరాజు మృతదేహం సోమవారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంటుందని మిలటరీ అధికారులు కుటుంబ సభ్యులకు తెలిపారని పెడన ఎస్‌ఐ టి.సూర్యశ్రీనివాస్ చెప్పారు. ఆయన ఆదివారం నాగరాజు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యుల్ని ఓదార్చారు. నాగరాజు మృతదేహం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చేవేండ్ర గ్రామానికి చేరుకుంటుందని ఎస్‌ఐ తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా సైనిక లాంఛనాలు, స్థానిక పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment