భారీగా తరలివచ్చి జోహార్లు పలికిన గ్రామస్తులు, పరిసర గ్రామాల ప్రజలు
విమానాశ్రయం(గన్నవరం)/రేపల్లె రూరల్/పెడన: లద్దాఖ్‌లో భారత్ – చైనా సరిహద్దు సమీపంలోని షియోక్ నదిలో జరిగిన దుర్ఘటనలో మృతి చెందిన రాష్ట్రానికి చెందిన ముగ్గురు జవాన్లకు ప్రజలు అశ్రు నివాళులర్పించారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లెకు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ముత్తముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్రకు చెందిన జవాను సాదరబోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్‌కు చెందిన హవల్దార్ సుభాన్‌ఖాన్ మృతి చెందారు. వారి పారి్ధవదేహాలు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి సోమవారం చేరుకున్నాయి.
వీర జవాన్ల భౌతికకాయాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి భారత వాయుసేనకు చెందిన విమానంలో సాయంత్రం ఇక్కడికి తీసుకువచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్‌లోని ఇంటర్నేషనల్ టెరి్మనల్ ఆవరణలో జవాన్ల పార్ధివదేహాలను ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వీర జవాన్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తరపున ఆయన ఏడీసీ దీపక్‌శర్మ, పలువురు సైనికాధికారులు పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం జవాన్ల భౌతికకాయాలను రోడ్డు మార్గం ద్వారా వారి స్వగ్రామాలకు తరలించారు. హవల్దార్ సభాన్‌ఖాన్, జవాను నాగరాజు అంత్యక్రియలు సోమవారం వారి స్వగ్రామాల్లో సైనిక లాంఛనాలతో ఘనంగా నిర్వహించారు. జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు మంగళవారం ఆయన స్వగ్రామంలో ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సుభాన్‌ఖాన్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు
సుభాన్‌ఖాన్ (42) భౌతికకాయం సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అతని స్వగ్రామం ఇస్లాంపూర్‌కు చేరుకుంది. సుభాన్
ఖాన్ భౌతికకాయంను కడసారి చూసి తుది వీడ్కోలు పలికేందుకు గ్రామస్తులతో పాటు సమీప గ్రామంలోని ప్రజలు అతని గృహం వద్దకు చేరుకున్నారు. దేశరక్షణలో భాగంగా ప్రాణాలర్పించిన సుభాన్‌ఖాన్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి కన్నీటిపర్యంతమయ్యారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సుభాన్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆర్డీవో హెలా షారోన్, డీఎస్పీ మురళీకృష్ణ, పలు శాఖల అధికారులు సుభాన్‌ఖాన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. అనంతరం సైనిక, పోలీసు లాంఛనాలతో ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
17 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా జీవితం ప్రారంభం
సుభాన్‌ఖాన్ 17 సంవత్సరాల క్రితం ఆర్మీలో సైనికునిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఈఎంఈ మెకానికల్ విభాగంలో పని చేస్తూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. సుభాన్‌ఖాన్‌కు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఆయన మరో రెండు సంవత్సరాలలో ఉద్యోగ విరమణ చేయనున్నాడు. సుఖాన్‌ఖాన్ తన కుటుంబాన్ని చూసుకునేందుకు ఈ నెల 7న కైతేపల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఆయన ఆకస్మిక మృతిని జీరి్ణయించుకోలేని కుటుంబ సభ్యులు విలపిస్తున్న తీరు చూపరులు సైతం కంటతడి పెట్టిస్తోంది.
జవాన్ నాగరాజుకు ఘనంగా అంతిమ వీడ్కోలు
ఆర్మీ జవాను సాదరబోయిన నాగరాజు (32) పారి్ధవదేహం సాయంత్రం 5.30 గంటల సమయంలో స్వగ్రామమైన చేవెండ్లకు చేరుకుంది. ఈ విషయం తెలిసి స్వగ్రామంతోపాటు మండలంలోని పలు గ్రామాల ప్రజలు వడ్లమన్నాడుకు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ ఊరేగింపుగా చేవేండ్రకు తీసుకొచ్చారు. అక్కడ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ నయీం ఆస్మీ, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎస్పీ, సీఐలు, పలువురు అధికారులు, వివిధ పారీ్టల నాయకులు నాగరాజు పారి్ధవదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంతిమక్రియలు నిర్వహించారు. నాగరాజు మరణం దురదృష్టకరమని, దేశం ఓ వీరుడిని కోల్పోయిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment