గల్లంతైన మిగ్‌ పైలెట్‌‌ లెటర్‌ వైరల్ | Missing MiG 29K Pilot Wedding Invite That Went Viral | Sakshi
Sakshi News home page

‌‘బుల్లెట్‌ కొరకడానికి అనుమతివ్వండి’

Nov 28 2020 2:41 PM | Updated on Nov 28 2020 2:58 PM

Missing MiG 29K Pilot Wedding Invite That Went Viral - Sakshi

గల్లంతైన మిగ్‌ పైలెట్‌ నిషాంత్‌ సింగ్‌(ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ: భారత నేవీ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మిగ్‌‌-29కే శిక్షణ విమానం గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక పైలెట్‌ సురక్షితంగా బయటపడగా.. నిషాంత్‌ సింగ్‌ అనే మరో పైలెట్‌ గల్లంతయ్యాడు. ప్రస్తుతం అతడిని క్షేమంగా తిరిగి తీసుకొచ్చేందుకు నేవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా.. నిషాంత్‌ సింగ్‌కు సంబంధించిన ఓ లెటర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. అతడి సృజానత్మకతకి నెటిజనులు ఫిదా అవుతున్నారు. త్వరగా.. క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నారు. ఏడు నెలల క్రితం నిషాంత్‌ సింగ్‌ వివాహం చేసుకున్నాడు. ఇందుకు గాను సీనియర్‌ అధికారుల అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ ఉత్తరంలో నిషాంత్‌ పెళ్లి చేసుకోవడం అంటే జీవితాన్ని త్యాగం చేయడం వంటిదే అన్నాడు. తెలిసి తెలిసి ఇందులో​కి దూకుతున్నానని.. ఇక జీవితంలో మరోసారి ఇలాంటి తప్పు చేయనని.. కనుక ఈ ఒక్కసారి బుల్లెట్‌ని కొరకడానికి అనుమతివ్వాల్సిందిగా సీనియర్లను కోరాడు. అంతేకాక తన త్యాగానికి అధికారులంతా సాక్ష్యంగా ఉండాలని.. కావున వారంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని నిషాంత్‌ అభ్యర్థించాడు. 

ఈ ఏడాది మే 9న ఉన్నతాధికారులకు నిషాంత్‌ రాసిన లెటర్‌ ఇలా కొనసాగింది..  ‘ఇంత తక్కువ సమయంలో మీ మీద ఇలాంటి బాంబు వేశాను. కానీ మీరు అంగీకరించాలి. స్వయంగా నా మీద నేనే ఓ న్యూక్లియర్‌ బాంబ్‌ వేసుకుంటున్నానని గమనించాలి. కంబాట్‌లో ఓ పక్క వేడిని భరిస్తూనే సెకన్ల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవడం అలవాటయ్యంది. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడానికి.. మరోసారి దీని గురించి ఆలోచించడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. మూడేళ్ల కాల వ్యవధి గల ఎస్‌సీటీటీ(సర్వైవబిలిటీ అండ్ కంపాటిబిలిటీ టెస్టింగ్ ట్రయల్స్)ట్రైనింగ్‌ని విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత నేను, మిస్‌ నయాబ్‌ రంధవా ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మిగిలిన జీవితం అంతా ఒకరినొకరం చంపుకోకుండా కలిసి బతకాలని నిర్ణయించుకున్నాం. మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు ఆమోదించారు. కరోనా సమయం కావడంతో జూమ్‌ వీడియో కాల్‌ ద్వారా ఆశీర్వదించారు. నా జీవితంలోని ప్రశాంతతని కోల్పోవడమే కాక, డ్యూటీకి సంబంధం లేని మరి ముఖ్యంగా చెప్పాలంటే .. నా జీవితాన్ని త్యాగం చేయాలని భావిస్తూ స్వయంగా నా చేతులారా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మీ అనుమతి కావాలి’ అంటూ నిశాంత్‌ తన లెటర్‌లో అధికారులను కోరాడు. (చదవండి: పైలట్‌ కోసం సిక్కుల ఔదార్యం)

కొనసాగిస్తూ.. ‘ఇక ఈ అయోమయ పరిస్థితి నుంచి బయటపడటానికి నా పఠనాసక్తి కూడా సాయం చేయలేకపోయింది. కావాలనే చేస్తోన్న ఈ తప్పును మీరు మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమిస్తారని భావిస్తున్నాను. ఇక ఇలాంటి తప్పును నేను గాలిలో ఉండగా కూడా చేయను. అలానే నా ట్రైనీలకు ఇలాంటి తప్పులు చేయడం నేర్పను’ అంటూ ఉత్తరాన్ని ముగించాడు. ఇక చివర్లో మీ విధేయుడు అని రాసే చోట.. ‘సాధారణంగా మీ విధేయుడు అనే రాయాలి.. కానీ ఇక మీదట నేను తనకు విధేయుడిని’ అంటూ తన పేరు రాసి ముగించాడు. ఇంత సృజనాత్మంగా లెటర్‌ రాస్తే.. ఎవరు మాత్రం నో చెప్పగలరు. అందుకే అధికారులు కూడా అతని వివాహానికి అనమతించారు. నేవీ సాంప్రదాయం ప్రకారం, యువ అధికారులు వివాహం చేసుకోవడానికి వారి సీఐల అనుమతి తీసుకోవాలి. ఇక సుశాంత్‌ తెలివిగా లెటర్‌ హెడ్డింగ్‌ని "బుల్లెట్‌ని కొరకడానికి అనుమతించండి" అని పెట్టడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement