గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది.
వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్‌తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు.
తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్‌ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు.
మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్‌కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే.
సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్‌కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్‌తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది.
దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్‌కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది.
కానీ చివరికి మళ్లీ ఖతార్‌తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్‌లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్‌కు సైతం ఖతార్‌లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు.
గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్‌కూ, ఇరాన్‌కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్‌కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు.
కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్‌ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి.
Comments
Please login to add a commentAdd a comment