అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు | Indian External Affairs Ministry Navy Veterans Death Row In Qatar | Sakshi
Sakshi News home page

అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు

Published Thu, Nov 9 2023 7:17 PM | Last Updated on Thu, Nov 9 2023 9:03 PM

Indian External Affairs Ministry Navy Veterans Death Row In Qatar - Sakshi

ఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విషయంలో భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పీల్‌కు వెళ్లినట్లు గురువారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇది సున్నితమైన అంశమని, ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాల్ని నమొద్దని కోరుతోంది. 

‘‘ఈ సమస్యకు సంబంధించి ఖతార్‌లోని భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీర్పు గోప్యతకు సంబంధించిన అంశం. కేవలం న్యాయ బృందానికి మాత్రమే తీర్పు సంబంధిత వివరాల్ని తెలియజేస్తారు. అందుకే ఈ వ్యవహారంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు’’ అని విదేశీ వ్వవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 

ఈ ఎనిమిది మందిని కిందటి ఏడాది ఆగష్టులో అరెస్ట్‌ చేశారు. అక్టోబర్‌ నెలలో ఖతార్‌ కోర్టు వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కూడా. 

‘‘ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ఇప్పటికే ఢిల్లీలో ఆ కుటుంబ సభ్యుల్ని కలిశారు. వీలైనంత మేర దౌత్య, న్యాయపరమైన సహాయం వాళ్లకు అందించేందుకు సిద్ధం. మంగళవారం నుంచే దౌత్యపరమైన సాయం వాళ్లకు అందుతోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ఊహాగానాలు నమ్మొద్దు అని బాగ్చీ మరోసారి అన్నారు. 

ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వాళ్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్‌ సమయంలో వాళ్లంతా దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement