ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళానికి చెందిన మాజీ అధికారులకు ఊరట లభించింది. ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మందికి విధించిన మరణ శిక్షను ఖతార్ కోర్టు తగ్గించింది. దీనిని జైలు శిక్షగా మారుస్తున్నట్లు తీర్పునిచ్చింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) గురువారం ఈ విషయాన్ని తెలిపింది.
అయితే ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పు పూర్తి వివరాలు బయటకు రాకపోవడంతో.. శిక్షను ఎంత తగ్గించారన్న విషయంపై కూడా స్పష్టత లేదు. తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునేందుకు న్యాయ బృందంతోపాటు బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కేంద్రం పేర్కొంది. తాము మొదటి నుంచి భారతీయ మాజీ నేవీ అధికారులకు అండగా ఉన్నామని, రాయబార సంప్రదింపులతోపాటు చట్టపరమైన సహాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది. దీనిపై ఖతార్ అధికారులతోనూ చర్చిస్తున్నట్లు తెలిపింది.
చదవండి: నిజ్జర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టుకు రంగం సిద్ధం?!
కాగా భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు గూఢచర్యం కేసు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేసిన భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది.ఈ ఏడాది అక్టోబర్‌లో వారికి మరణశిక్ష విధించింది.
దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ నేవీ అధికారులకు విధించిన మరణ శిక్ష అపీల్‌పై ఖతార్ కోర్టు విచారణ జరిపి.. మరణ శిక్షను తగ్గించి జైలు శిక్షగా మార్పు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment