india navy
-
అది సున్నితమైన అంశం.. ఊహాగానాలు నమ్మొద్దు
ఢిల్లీ: ఖతార్‌లో మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత నావీ మాజీ అధికారుల విషయంలో భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అప్పీల్‌కు వెళ్లినట్లు గురువారం ప్రకటించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. ఇది సున్నితమైన అంశమని, ప్రచారంలోకి వస్తున్న ఊహాగానాల్ని నమొద్దని కోరుతోంది. ‘‘ఈ సమస్యకు సంబంధించి ఖతార్‌లోని భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. తీర్పు గోప్యతకు సంబంధించిన అంశం. కేవలం న్యాయ బృందానికి మాత్రమే తీర్పు సంబంధిత వివరాల్ని తెలియజేస్తారు. అందుకే ఈ వ్యవహారంలో ఎలాంటి ఊహాగానాలు నమ్మొద్దు’’ అని విదేశీ వ్వవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ ఎనిమిది మందిని కిందటి ఏడాది ఆగష్టులో అరెస్ట్ చేశారు. అక్టోబర్ నెలలో ఖతార్ కోర్టు వీళ్లకు మరణ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు భారత ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది కూడా. ‘‘ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నాం. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఇప్పటికే ఢిల్లీలో ఆ కుటుంబ సభ్యుల్ని కలిశారు. వీలైనంత మేర దౌత్య, న్యాయపరమైన సహాయం వాళ్లకు అందించేందుకు సిద్ధం. మంగళవారం నుంచే దౌత్యపరమైన సాయం వాళ్లకు అందుతోంది. ఈ సున్నితమైన వ్యవహారంలో ఊహాగానాలు నమ్మొద్దు అని బాగ్చీ మరోసారి అన్నారు. ఎనిమిది మంది మాజీ నేవీ అధికారులలో ఒకప్పుడు ప్రధాన భారతీయ యుద్ధనౌకలకు నాయకత్వం వహించిన వాళ్లు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్ట్ సమయంలో వాళ్లంతా దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ & కన్సల్టెన్సీ సర్వీసెస్ కోసం పనిచేస్తున్నట్లు సమాచారం. దహ్రా అనేది ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సేవలను అందించే ఒక ప్రైవేట్ సంస్థ. -
ఇండియన్ నేవీలోకి రోమియోలొచ్చేశాయ్, ప్రత్యేకతలివే!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్య ఘర్షణలతో దేశ భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగే ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు 24లో రెండు భారత్‌కి అందించింది. దీంతో దేశ నావికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. అగ్రరాజ్యంలో శుక్రవారం శాన్‌డియోగోలో నేవల్ ఎయిర్ స్టేషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రెండింటిని భారత్‌కు లాంఛనంగా అప్పగించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తారాంజిత్ సింగ్ సాంధు, అమెరికా నేవల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నెత్ వైట్సెల్, భారత్ కమాండర్ రవ్నీత్ సింగ్, హెలికాఫ్టర్లు తయారు చేసిన లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీటి చేరికతో అమెరికా, భారత్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైందని సాంధు అన్నారు. ఆకాశమే హద్దుగా అమెరికా, భారత్ స్నేహబంధం సాగిపోతోందని ఆయన ట్వీట్ చేశారు. గత నెలరోజులుగా హెలికాఫ్టర్ల వాడకంపై భారత్‌కు చెందిన 20 మంది అ«ధికారులు, సాంకేతిక నిపుణులకు అమెరికాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టం 2020 ఫిబ్రవరిలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 24 హెలికాప్టర్లని 240 కోట్ల డాలర్లు (ఇంచుమించుగా 18 వేల కోట్లు ) భారత్ కొనుగోలు చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్ చుట్టూ జలాంతర్గాముల్ని మోహరించింది. దీంతో ఇలాంటి అత్యాధునికమైన హెలికాప్టర్లు మన దగ్గర ఉండే అవసరం ఉందని భారత్ గుర్తించింది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి సీ కింగ్ హెలికాఫ్టర్లు మన దగ్గర ఉన్నాయి. అవి కదన రంగంలో మనకి ఉపయోగపడడం లేదు. దీంతో వాటిని కేవలం రవాణా అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ల రాకతో మన త్రివిధ బలగాలు మరింత బలోపేతం కానున్నాయి. హెలికాప్టర్ ప్రత్యేకతలు ► ఈ హెలికాప్ట్టర్ల పూర్తి పేరు ఎంహెచ్రోమియో సీహాక్ ► ప్రముఖ రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ హెలికాఫ్టర్లకు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవని పేరుంది ► వీటిని యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ ఆయుధంగా కూడా వాడవచ్చు. అంటే త్రివిధ బలగాల్లోనూ వీటిని వినియోగించుకోవచ్చు ► హెల్ఫైర్ క్షిపణులు, ఎంకే 54 టార్పెడోస్లను మోసుకుపోగలిగే సామర్థ్యం దీని సొంతం ► ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించడానికి అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు వాడారు. ► సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల కదలికల్ని పసిగట్టి దాడులు చేయగలదు ► జలాంతర్గాముల్ని కూడా వెంటాడి ధ్వంసం చేసేలా డిజైన్ని రూపొందించారు ► గంటకి 267కి.మీ. వేగంతో దూసుకుపోతుందిప్రకృతి విపత్తుల సమయాల్లో ఈ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవచ్చు ► సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు ► ప్రస్తుతం ఈ హెలికాప్టర్లను అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు మాత్రమే వినియోగిస్తున్నాయి. -
నావికా దళాధికారి ఆచూకీ లభ్యం
పారిస్/కోచి: తీవ్రంగా గాయపడి హిందూమహా సముద్రంలో గల్లంతైన భారతీయ అధికారి ఆచూకీ దొరికిందని ఫ్రాన్స్‌కు చెందిన గోల్డెన్‌గ్లోబ్ రేస్ సంస్థ ప్రకటించింది. భారత నావికాదళ కమాండర్ అభిలాష్ టామీ(39) తురయా అనే తన పడవలో ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చే ‘గోల్డెన్ గ్లోబ్ రేస్’లో భారత్ నుంచి పాల్గొన్న ఏకైక నావికుడు. ఫ్రాన్స్ తీరం నుంచి జూలై 1వ తేదీన 18 మంది పోటీదారులతో ప్రారంభమైన ఈ రేసులో ఇప్పటివరకు 10,500 నాటికల్ మైళ్లు ప్రయాణించారు. ప్రస్తుతం మూడోస్థానంలో ఉన్న అభిలాష్ హిందూమహా సముద్రంలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు 1,900 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా తీవ్ర తుపానులో చిక్కుకున్నారు. అలల తాకిడికి ఆయన పడవ తీవ్రంగా దెబ్బతింది. తీవ్రంగా గాయపడి, నిస్సహాయ స్థితిలో ఉన్న అభిలాష్ శనివారం రేస్ నిర్వాహకులకు మెసేజ్ పంపారు. రక్షణ చర్యల్లో పాల్గొనేందుకు నావికాదళానికి చెందిన ఆధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురాను ఆ ప్రాంతానికి పంపించినట్లు భారత నావికా దళం తెలిపింది. -
నేవీకి 'అల్బాట్రాస్' బై బై
న్యూఢిల్లీ: భారతీయ నేవీ నుంచి మరో దిగ్గజం రిటైర్ కానుంది. హిందూ మహాసముద్రంపై 30 ఏళ్ల పాటు డేగ కన్ను వేసిన టుపోలెవ్-142ఎమ్ ఎయిర్‌క్రాఫ్ట్(రష్యా నుంచి కొనుగోలు చేశారు) ఈ నెలాఖరుకు విధుల్లో నుంచి తప్పుకోనుంది. టర్బోప్రొపెల్లర్తో నడిచే టుపోలెవ్-142ఎమ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది, వేగవంతమైనది. రాయల్ బ్రిటీష్ నేవీలో కొద్దికాలంపాటు సేవలందించిన టుపోలెవ్-142లను ఆ తర్వాత భారత నేవీ తీసుకుని 'అల్బాట్రాస్' అని నామకరణం చేసింది. 1988లో ఎనిమిది టీయూ-142ఎమ్‌లను నేవీ ఇండక్ట్ చేసింది. యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లలో టీయూ-142ఎమ్‌లు ఎనలేని సేవలు అందించాయి. తమిళనాడులోని అరక్కోనం వద్ద మార్చి 29న భారత నేవీ టీయూ-142 విమానాలకు ఘనంగా వీడ్కోలు పలుకుతుందని ఓ నేవీ అధికారి చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ ప్రొపెల్లర్ జెట్ కూడా టీయూ-142 అంత ఎత్తులో ఎగరలేదని అయితే టీయూ-142ల రాడార్ వ్యవస్ధ పాతదైపోయిందని చెప్పారు. అప్పటికీ వాటిని వినియోగించదలచినా పాత వ్యవస్ధలను పునరుద్ధిరించడానికి పెద్ద ఎత్తున ఖర్చు అవుతోందని తెలిపారు. దీంతో నేవీ వాటిని విధుల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీయూ-142ల స్ధానంలో దాదాపు 3.2 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన పన్నెండు పీ-8ఐ లాంగ్ రేంజ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నేవీ వినియోగించనుంది. వీటిని అమెరికా నుంచి కొనుగోలు చేశారు. ఇప్పటివరకూ ఎనిమిది పీ-8ఐ విమానాలను అమెరికా భారత్‌కు అందించింది. భారత నేవీ నుంచి ఐఎన్ఎస్ విరాట్ ఇప్పటికే రిటైర్ అయిన విషయం తెలిసిందే.