Espionage case
-
ఖతార్ ‘మరణ’ మృదంగం!
గల్ఫ్ దేశాల్లో పనిచేయటం కత్తిమీది సాము. అక్కడ అమలయ్యే చట్టాలు, న్యాయవ్యవస్థ తీరు తెన్నులు భిన్నమైనవి. కనుక ఉపాధి కోసం వెళ్లినవారు ఎంతో జాగురూకతతో వుంటారు. అందువల్లే ఆ దేశాల్లో ఒకటైన ఖతార్‌లో అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న మన నావికాదళ మాజీ అధికారులు ఎనిమిది మంది గూఢచర్యం ఆరోపణల సాలెగూటిలో చిక్కుకోవటం, అక్కడి న్యాయస్థానం గురువారం వారికి మరణదండన విధించటం అందరినీ కలవరపెట్టింది. వాస్తవానికి గూఢచర్యం ఆరోపణలున్నాయని మీడియాలో కథనాలు రావటం మినహా అధికారికంగా ఖతార్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. ఖతార్‌తో నిరుడు ఆగస్టు నుంచి సంప్రదింపులు జరుపుతూ, వారి విడుదలకు కృషి చేస్తున్న మన విదేశాంగ శాఖ కూడా ఏమీ చెప్పలేదు. న్యాయస్థానంలో విచారణ సరేసరి. అంతా గోప్యంగా ముగిసిపోయింది. మరణశిక్ష పడినవారు సాధారణ వ్యక్తులు కాదు. మన నావికాదళంలో పనిచేసినన్నాళ్లూ తమ సత్తా చాటినవారు. వీరిలో తెలుగువారైన సుగుణాకర్ పాకాల కమాండర్ స్థాయిలో పనిచేసి రిటైరయ్యారు. తన సర్వీసు కాలంలో రెండుసార్లు నావికాదళ నౌక ఐఎన్ఎస్ తరంగిణిపై ఒంటరిగా వెళ్లి భూమధ్య రేఖప్రాంతంలో అట్లాంటిక్, పసిఫిక్ మహా సము ద్రాలను దాటివచ్చినవారు. ఇతరులు కూడా నావికాదళ విభాగాల్లో నిపుణులు, లబ్ధ ప్రతిష్టులు. ఒక సందర్భంలో అందరినీ స్వదేశం వెళ్లేందుకు సిద్ధంగా వుండమని చెప్పిన ఖతార్ అధికారులు అంత లోనే నిర్ణయం మార్చుకున్నారని అంటున్నారు. వీరు పని చేసిన అల్ దహ్రా గ్లోబల్ సంస్థ నిర్వాహకులను కూడా అరెస్టు చేసిన ఖతార్ అధికారులు రెండు నెలలకే వారిపై ఎలాంటి విచారణ లేకుండా విడుదల చేశారు. మరి భారతీయుల విషయంలో ఈ వివక్ష ఎందుకో అర్థం కాని విషయం. ఇటలీ నుంచి ఖతార్ సమకూర్చుకున్న యు 212 జలాంతర్గామిపై ఆ దేశ నావికాదళ సిబ్బందికి శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నప్పుడు హఠాత్తుగా వీరిని అరెస్టు చేశారంటున్నారు. ఆ జలాంత ర్గామి సాంకేతిక వివరాలను ఇజ్రాయెల్‌కు చేరేశారన్నది ప్రధాన అభియోగమని చెబుతున్నారు. నేరారోపణలు ఎదుర్కొన్నవారికి న్యాయసహాయం లభించిందా... అసలు వారిపై వున్న ఆరో పణలు ఏమిటన్నది వెల్లడి కాలేదు. కనీసం కుటుంబ సభ్యులకైనా ఆ వివరాలు అందించారా లేదా అన్నది అనుమానమే. సాధారణంగా గూఢచర్యం కేసుల్లో ప్రభుత్వాలు ఎక్కడలేని గోప్యతా పాటి స్తాయి. ఇందువల్ల అటు ముద్దాయిలకు అన్యాయం జరగటంతోపాటు ఆ దేశానికి కూడా అంత ర్జాతీయంగా చెడ్డపేరొస్తుంది. ఖతార్‌కు ఈ విషయాలు తెలిసేవుండాలి. ఖతార్‌తో వున్న ద్వైపాక్షిక సంబంధాలను వినియోగించుకుని వీరందరి విడుదలకూ మన దేశం చేసిన ప్రయత్నాలను ఆ దేశం వమ్ముచేసింది. అక్కడి మీడియా సంస్థలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు ఈ కేసు లొసుగులను ఎత్తి చూపుతూ రాసిన కథనం తమ జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్నదని ఆగ్రహించి ఆమెను సైతం అరెస్టు చేయటానికి ఖతార్ అధికారులు ప్రయత్నించారని ఒక ఆంగ్ల దినపత్రికలో ఇటీవలే కథనం వెలువడింది. దీనిపై ముందుగా ఉప్పందటంతో ఆ జర్నలిస్టు, అక్కడ వేరే ఉద్యోగం చేస్తున్న ఆమె భర్త హుటాహుటీన ఆ దేశం విడిచి భారత్ వచ్చారని ఆ కథనం తెలిపింది. ఈ కేసుపై మొత్తంగా ఏడు వాయిదాల్లో విచారణ జరిగిందని చెబుతున్నారుగానీ, దాని తీరుతెన్నులెలా వున్నాయో జర్నలిస్టుకు ఎదురైన చేదు అనుభవమే తేటతెల్లం చేస్తోంది. ఆరోపణలొచ్చినంత మాత్రాన అన్నీ నిజమైపోవని ఖతార్‌కు తెలియదనుకోలేం. ఎందుకంటే ఆ దేశానికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయంటూ ఆరేళ్ల క్రితం గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) నుంచి దాన్ని సౌదీ అరేబియా సాగనంపింది. కానీ చివరికి మళ్లీ ఖతార్‌తో సంధి కుదుర్చుకోక తప్పలేదు. ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలిబన్లకు ఆశ్రయం ఇచ్చి, వారితో అమె రికా చర్చలు జరిపేలా చేయటంలో ఖతార్ విజయం సాధించింది. ఇప్పుడు ఇజ్రాయెల్‌లో చొరబడి ఆ దేశ పౌరులను కాల్చిచంపి, అనేకమందిని బందీలుగా పట్టుకున్న హమాస్‌కు సైతం ఖతార్‌లో కార్యాలయం వుంది. ఖతార్ మధ్యవర్తిత్వంతోనే హమాస్ తీవ్రవాదులు బందీల్లో ఇద్దరు అమెరికన్ పౌరులను విడుదల చేశారు కూడా. వీటన్నిటినీ చూపి ఖతార్‌ను ఉగ్రవాద దేశంగా పరిగణించాల్సిన అవసరం లేదు. గల్ఫ్ దేశాల్లో ఖతార్ చూడటానికి చిన్న దేశమే కావొచ్చుగానీ, దానికుండే సహజ వనరులు అపారమైనవి. దాని తలసరి ఆదాయం చాలా ఎక్కువ. ఖతర్కూ, ఇరాన్‌కూ మధ్య సముద్ర జలాల్లో అపారమైన సహజవాయు నిక్షేపాలున్నాయి. అందుకే ఆ దేశంతో ఖతార్‌కు స్నేహ సంబంధాలున్నాయి. ఇతర గల్ఫ్ దేశాల తీరు ఇందుకు భిన్నం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరణశిక్ష పడినవారికి 2015లో భారత్–ఖతార్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఒక ఆశాకిరణం. దాని ప్రకారం యావజ్జీవ శిక్ష పడినవారిని స్వదేశంలో శిక్ష అనుభవించటానికి వీలుగా వెనక్కిపంపే వీలుంటుంది. ప్రస్తుతం మరణశిక్ష పడిన ఎనిమిదిమందీ ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకుంటే వారిని నిర్దోషులుగా విడుదల చేయొచ్చు. కనీసం దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చే అవకాశం వుంటుంది. అదే గనుక జరిగితే 2015 ఒప్పందం కింద వీరిని భారత్ పంపే వీలుంటుంది. ఏదేమైనా ఈ వ్యవహారం మన దౌత్య నైపుణ్యానికి పెద్ద పరీక్ష. గత తొమ్మిది నెలలుగా తెరవెనక సాగించిన యత్నాలు పెద్దగా ఫలించలేదు. కనీసం ఇకముందైనా ఖతార్‌ను ఒప్పించటంలో, అది సహేతుకంగా వ్యవహరించేలా చేయటంలో మన ప్రభుత్వం విజయం సాధించాలని ఆశించాలి. -
విదేశాంగశాఖలో హనీట్రాప్ కలకలం.. సైనిక రహస్యాల కోసం పాక్ పన్నాగం
న్యూఢిల్లీ: భారత సైనిక సమాచారం కోసం పాకిస్థాన్ హనీట్రాప్ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. గూఢచర్యం ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూఢిల్లోని జవహర్లాల్ నెహ్రూ భవన్ వద్ద శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎమ్ఈఏ డ్రైవర్ పాక్ హానీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన మహిళ డ్రైవర్‌ను ముగ్గులోకి దింపి అతనితో సన్నిహితంగా ఉంటూ సైన్యానికి సంబంధించిన కీలక సేకరించినట్లు గుర్తించారు. కొన్నిసార్లు పాకిస్థాన్ మహిళ పూనమ్ శర్మ, మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకున్న ఆ దేశ గూఢచారి వలలో చిక్కుకున్న డ్రైవర్.. దేశ రక్షణ సమాచారం, డాక్యుమెంట్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఆగస్టులో ఢిల్లీలో 46 ఏళ్ల భాగ్‌చంద్ అనే వ్యక్తిని, రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌లో పుట్టిన ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి 1998లో ఢిల్లీకి రాగా.. 2016లో మన దేశ పౌరసత్వాన్ని పొందారు. ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయడం ప్రారంభించాడు. అయితే పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పోలీసులు ఆరోపించారు. పాకిస్థాన్‌లోని తన బంధువుల ద్వారా భాగ్‌చంద్ తన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉండేవాడని తెలిపారు. చదవండి: షాకింగ్ ఘటన: ప్రియురాలిని చంపి.. ముక్కలుగా కోసి.. తలను పాలిథిన్ సంచిలో! -
అవమానం ఎదురైన చోటే అందలం.. ఆ కిక్కే వేరు!
అవమానం ఎదురైన చోటే అందలం ఎక్కితే ఆ కిక్కే వేరు. పరువు పోయినచోటే మళ్లీ గౌరవం దక్కడం అంటే మాటలా? న్యాయం కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్(80) అలాంటి గౌరవాన్నే పొందారు. నకిలీ కేసుపై రాజీలేని పోరాటం చేసి గెలిచిన ఆయన తాజాగా మరో ఘనత సాధించారు. 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పద్మ పురస్కారాల ఎంపిక కమిటీలో నారాయణన్ కూడా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ 128 మందిని పద్మపురస్కారాలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 1990 దశకంలో ‘గూఢచారి’గా నిందించబడి, జైలుపాలై... 2019లో దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ అందుకునే వరకు నంబి నారాయణన్ సాగించిన పోరాటం అనన్య సామాన్యం. సత్యం కోసం చివరి వరకు నిలబడి పద్మ పురస్కారం అందుకోవడమే కాదు.. ఇప్పుడు సెలక్షన్ కమిటీలోనూ ఆయన చోటు దక్కించుకోవడం విశేషం. తనను నిరపరాధిగా నిరూపించుకోవడం, నష్టపరిహారం దక్కించుకోవడంతోనే ఆయన పోరాటం ముగించలేదు. దేశం ముందు తనను అపరాధిగా నిలబెట్టిన కుట్రదారులెవరో కనిపెట్టాలన్న ఆయన పంతం ఇంకా నెగ్గలేదు. నారాయణన్‌ను ‘గూఢచారి’ కేసులో ఇరికించిన సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని 2021, ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం ఈ పోరాటంలో మేలిమలుపు. అసలేం జరిగింది? 1994, అక్టోబర్‌లో మాల్దీవుల మహిళ మరియం రషీదా అరెస్ట్‌తో కథ మొదలైంది. ఇస్రో క్రయోజెనిక్ ఇంజన్ డ్రాయింగ్స్‌ను పాకిస్థాన్‌కు అమ్ముతుందంటూ ఆమెపై కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. క్రయోజెనిక్ ఇంజన్ డిజైన్ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న నంబి నారాయణన్‌తో పాటు ఆయన డిప్యూటీ డి. శశికుమారన్, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన భారత ప్రతినిధి కె. చంద్రశేఖర్, ఎస్.కె. లేబర్ కాంట్రాక్టర్ శర్మ, రషీదా స్నేహితుడు ఫౌసియా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై గూఢచర్యం కింద కేసులు నమోదు చేశారు. మాల్దీవుల జాతీయులు మినహా ఇస్రో శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు బెయిల్‌పై 1995 జనవరిలో విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 1996 ఏప్రిల్‌లో కేరళ కోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితులు ఎటువంటి గూఢచర్యానికి పాల్పడలేదని క్లీన్చిట్ ఇచ్చింది. సీబీఐ సమర్పించిన కేసు మూసివేత నివేదికను అంగీకరించిన కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. కీలక మలుపులు రాష్ట్ర పోలీసులతో కేసును మరోసారి దర్యాప్తు చేయించాలని 1996, జూన్‌లో కేరళ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాగా, కేసులో నిరపరాధులుగా తేలిన నిందితులకు 1998 మే నెలలో సుప్రీంకోర్టు రూ. 1 లక్ష పరిహారం ప్రకటించింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నిందితులు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు తనను నకిలీ కేసులో ఇరికించిన వారిని గుర్తించాలని నారాయణన్ వేసిన పిటిషన్‌పై 2017 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దుర్మార్గపు ప్రాసిక్యూషన్ కారణంగా నారాయణన్ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనికి కేరళ ప్రభుత్వం బాధ్యత వహించాలని 2018 మే 9న అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అబద్దపు కేసుతో నారాయణన్‌ను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని 2018 సెప్టెంబర్ 14న కేరళ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని 2019లో కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. (క్లిక్: తెలంగాణలో ‘ఆప్’సోపాలు.. ఢిల్లీ మోడల్ వర్కవుట్ అవుతుందా?) కొనసాగిన పోరాటం నష్ట పరిహారం దక్కినా నారాయణన్ న్యాయ పోరాటం ఆపలేదు. తనను అపఖ్యాతి పాల్జేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని కేరళ హైకోర్టు తలుపు తట్టారు. దీన్ని ముగిసిన అధ్యాయంగా భావించాలని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన సలహాతో సంతృప్తిచెందకుండా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జైన్, మరో ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు.. సీబీఐకి ఆదేశాలిచ్చింది. నారాయణన్‌ను గూఢచార్యం కేసులో ఇరికించిన వారిని తమ ముందు నిలబెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 18 మంది కేరళ పోలీసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. (క్లిక్: నవాబ్ మాలిక్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు) అమెరికా హస్తం? తమపై మోపిన గూఢచార్యం కేసు వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉందన్న అనుమానాన్ని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ వెలిబుచ్చారు. క్రయోజెనిక్ ఇంజన్‌ను భారత్ అభివృద్ధి చేయడాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఈ పనికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. భూ స్థిర కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపించేందుకు ఉపయోగించే క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని మన దేశానికి ఇవ్వడానికి పూర్వపు సోవియట్ యూనియన్ అంగీకరించినా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి ఆపించింది. తన నేతృత్వంలో దేశీయంగా క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టును గూఢచర్యం కేసుతో అమెరికా విచ్ఛిన్నం చేసిందన్నది నారాయణన్ వాదన. క్రయోజెనిక్ పరిజ్ఞానాన్ని భారత్ అభివృద్ధి చేసి ఉంటే, చాలా దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మన దేశాన్ని సంప్రదించేవని పేర్కొన్నారు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మనం తక్కువ ఖర్చుతో క్రయోజెనిక్ ఇంజన్ చేస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందన్న భయంతో అమెరికా ఇదంతా చేసిందన్న భావనను నారాయణన్ వ్యక్తపరిచారు. కాగా, 2014 జనవరిలో తొలి దేశీయ క్రయోజెనిక్ ఇంజన్‌ను భారత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగారు. పుస్తకాలు.. సినిమా అర్జున్ రామ్‌తో కలిసి ‘రెడీ టు ఫైర్: హౌ ఇండియా సర్వైవడ్ ది ఇస్రో స్పై కేస్’ పేరుతో నంబి నారాయణన్ పుస్తకం తెచ్చారు. గూఢచార్యం కేసు, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ‘క్లాసిఫైడ్: హిడెన్ ట్రూట్స్ ఇన్ ది ఇస్రో స్పై స్టోరీ’పేరుతో ప్రముఖ జర్నలిస్ట్ రాజశేఖర్ నాయర్ పుస్తకం రాశారు. ఇదే నేపథ్యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి కేవీ థామస్ కూడా ‘ఇస్రో మిస్ఫైరెడ్: ది ఇప్సినేజ్ కేస్ దట్ షుక్ ఇండియా’ పేరుతో పుస్తకం రూపొందించారు. నంబి నారాయణన్ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ పేరుతో ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కింది. నటుడు మాధవన్.. నంబి నారాయణన్ పాత్రలో నటించి, నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరోలు సూర్య, షారూఖ్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 1న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళంలోకి అనువదించి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన నంబి నారాయణన్ జీవితం వెండితెరపై ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. (క్లిక్: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్ మాలిక్?) - సాక్షి, వెబ్ స్పెషల్ -
‘పాకిస్తాన్ వెళ్లి పెద్ద తప్పు చేశాను’
లక్నో: 28 ఏళ్ల క్రితం పాకిస్తాన్ వెళ్లి.. గూఢచర్యం ఆరోపణల కింద దాదాపు 8 ఏళ్ల పాటు కరాచీ జైల్లో గడిపి భారత్‌కు తిరిగి వచ్చిన వ్యక్తికి స్థానికులు, పోలీసులు పూల మాలలతో స్వాగతం పలికారు. స్వదేశంలో తనకు లభించిన ఆత్మీయత, ఆదరణ చూసి ఆ వ్యక్తి ఏకధాటిగా కన్నీరు కార్చాడు. అనవసరంగా పాకిస్తాన్ వెళ్లాను. వారు మనల్ని శత్రువులుగా చూస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాలు.. కాన్పూర్‌కు చెందిన షంసుద్దీన్(70) 1992లో 90 రోజుల వీసా మీద పాకిస్తాన్ వెళ్లాడు. ఆ తర్వాత 1994లో పాక్ పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లు బాగానే గడిచింది. ఆ తర్వాత 2012లో గూఢచర్యం ఆరోపణలపై పాక్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి కరాచీ జైలులో ఉంచారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్ 26న విడుదల అయ్యాడు. అత్తారీ-వాగా సరిహద్దు ద్వారా భారతదేశానికి చేరుకున్నాడు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో అమృత్‌సర్‌లో 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్నాడు. అనంతరం నగరంలోని బజారియా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఆఫీసర్ తిర్పురారీ పాండే, షంసుద్దీన్‌కు పూల మాలతో స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు అతన్ని కంఘి-మోహల్‌లోని తన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన రాక కోసం ప్రజలు అక్కడ గుమిగూడారు. జనం అతనిని చుట్టుముట్టి పూల మాలలు వేసి కౌగిలించుకున్నారు. దశాబ్దాల తరువాత స్వదేశానికి తిరిగి వచ్చినందుకు ఆయనను అభినందించారు. దాదాపు 28 ఏళ్ల పాటు సొంత దేశానికి, పుట్టిన వారికి, ఇంటికి దూరంగా ఉన్న షంసుద్దీన్ స్వస్థలం చేరుకోగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆత్మీయులను చూసి ఆనందంతో ఏడ్చేశాడు. (చదవండి: మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం) అనంతరం షంసుద్దీన్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్లో భారతీయులను చాలా నీచంగా చూస్తారు’ అని మీడియాతో తెలిపాడు. "వారు మనల్ని శత్రువుల్లా చూస్తారు. పాకిస్తాన్లో లంచం, అవినీతి భారీ ఎత్తున ఉంది" అన్నారు. అంతేకాక పాక్ వెళ్లి చాలా పెద్ద తప్పు చేశాను. అక్కడే చనిపోతానేమో అనుకున్నాను. కానీ అదృష్టం బాగుండి బతికుండగానే నా వారి దగ్గరకు వచ్చాను అని కన్నీటి పర్యంతమయ్యాడు. -
విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: 2019 లో విశాఖపట్నం 'హానీట్రాప్' గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. గిటేలి ఇమ్రాన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ గుజరాత్లో అదుపులోకి తీసుకుంది. ఈ వ్యక్తి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టు ఎన్ఐఏ గుర్తించింది. విశాఖలోని నేవీ రహస్యాలను సేకరించేందుకు కుట్ర పన్నినట్లు తెలిపింది. ఈ క్రమంలో నేవీ సిబ్బందికి భారీగా ముడుపులు అందజేసినట్టు విచారణలో వెల్లడయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ 11 మంది నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సంఖ్య 15కు చేరింది. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు సదరు వ్యక్తి దర్యాప్తులో వెల్లడించినట్లు ఎన్ఐఏ తెలిపింది. (చదవండి: విశాఖలో ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ ) పాకిస్తాన్‌కు చెందిన కొందరు గూఢచారులు.. భారత నౌకలు, జలాంతర్గాముల లొకేషన్, ఇతర సమాచారాన్ని సేకరించేందుకు జూనియర్ స్థాయి నేవీ అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించారు. ఇందుకు గాను సోషల్ మీడియా ద్వారా అందమైన యువతులను వారు ఎర వేసి.. వివరాలను కనుగొనేందుకు ప్రయత్నించారు. -
కుల్‌భూషణ్‌కు కోర్టులో ఊరట
ఇస్లామాబాద్: మరణశిక్ష పడి, పాకిస్తాన్ జైల్లో మగ్గుతోన్న కుల్‌భూషణ్ జాదవ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవడానికి, భారత్‌కి మరో అవకాశం ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షని సమీక్షించడానికి ఇస్లామాబాద్ హైకోర్టు కేసు విచారణకు చేపట్టింది. భారత నావికాదళంలో పదవీ విరమణ చేసిన కుల్‌భూషణ్ జాదవ్‌కి, గూఢచర్యం, ఉగ్రవాద ఆరోపణలతో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు 2017లో మరణశిక్ష విధించింది.కుల్‌భూషణ్ తరఫున న్యాయవాదిని నియమించుకోవాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని భారత్‌కు తెలపాలని ఈ కేసుని అక్టోబర్ 3కి వాయిదా వేసింది. -
మాజీ సైంటిస్ట్‌కు 1.3 కోట్ల పరిహారం
తిరువనంతపురం: గూఢచర్యం కేసులో నిరపరాధిగా విడుదలైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ.1.3కోట్ల పరిహారం ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. 1994లో దేశ రహస్యాలను ఇతరులకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై నారాయణన్‌పై కేసు నమోదు కాగా.. విచారణలో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. తనను అన్యాయంగా కేసులో ఇరికించిన కారణంగా నష్టపరిహారం చెల్లించాలని 77 ఏళ్ల నారాయణన్ కేసు దాఖలు చేయగా కోర్టు అనుకూల తీర్పునిచ్చింది. దేశ అత్యున్నత న్యాయస్థానం, మానవ హక్కుల కమిషన్ ఈ కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు రూ.50 లక్షలు, రూ. పది లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పివ్వడం తెల్సిందే. తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన రూ.1.3 కోట్లు సుప్రీంకోర్టు పరిహారానికి అదనం. నారాయణన్ లేవనెత్తిన అంశాల పరిశీలనకు ప్రభుత్వం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జయకుమార్‌కు బాధ్యతలు అప్పగించగా ఆయన రూ.1.3 కోట్ల పరిహారం చెల్లించాలని సిఫారసు చేశారు. -
తీర్పు వచ్చింది... కానీ ఇస్రో సైంటిస్టు విషాదం
ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు తీర్పుతో భారీ ఊరట చెందిన సైంటిస్టులు అంతలోనే విచారంలో మునిగిపోయారు. సుదీర్ఘ నిరీక్షణ తరువాత వెలువడిన సంతోషకరమైన వార్తను వినకుండానే ఆరోపణలు ఎదుర్కొన్న ఇస్రో మాజీ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తీర్పు వెలువడడానికి కొన్ని గంటలకు ముందే ఆరోపణలుఎదుర్కొన్న ఆరుగురు శాస్త్రవేత్తల్లోఒకరైన కె.చంద్రశేఖర్ (76) కోమాలోకి వెళ్ళిపోయారు. చివరకు తప్పుడు కేసునుంచి విముక్తులమయ్యామన్న వార్త వినకుండానే కన్నుమూశారు. దీంతో ఆయన సన్నిహితులు, ఇతర శాస్త్రజ్ఞులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తరువాత ఇస్రో మాజీ సైంటిస్టులపై గూఢచర్యం ఆరోపణలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అలాగే తప్పుడు ఆరోపణలతో వారిని మానసింగా వేధించినందుకుగాను 50లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న తీర్పు సెప్టెంబరు 14 ఉదయం 11 గంటలకు వచ్చింది. కానీ ఆ రోజు అప్పటికే ఆయన నిర్జీవంగా పడివున్నారు. తీవ్ర అనారోగ్యం చికిత్స పొందుతున్న ఆయన కొలంబియా ఆసియా హాస్పిటల్లో ఆదివారం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచీ తీర్పు కోసం ఆయన ఆందోళనతో ఎదురుచూశారని చంద్రశేఖర్ భార్య హెచ్ఎంటీ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన కె.జె.జయస్మా కన్నీరు పెట్టుకున్నారు. చంద్రశేఖర్ చివరి గంటల్లో అనుభవించిన బాధను, పడ్డ వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు. తప్పుడు కేసులతో కేరళ పోలీసులు ఏం సాధించారని ఆమె ప్రశ్నించారు. ఇన్నేళ్ల తమ క్షోభకు ఎవరు బాధ్యులు, చంద్రశేఖర్ కరియర్‌ను మనశ్శాంతిని దూరం చేశారు. కేసు విచారణ సందర్భంగా తమ ఇంటిపై దాడిచేసి మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా ఎందుకు చేశారో ఇప్పటికైనా తమకు తెలియాలని విజయమ్మ డిమాండ్ చేశారు. శుక్రవారం తీర్పు రానుందని ఆయన కు తెలుసు. అలాగే కచ్చితంగా గెలుస్తారనే విశ్వాంస కూడా ఆయనకుంది. కానీ రెండు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న తీర్పు వార్తను వినడానికి ఆయన లేరని ఆమె వాపోయారు. కాగా చంద్రశేఖర్ 1992 నుండి రష్యా అంతరిక్ష సంస్థ గ్లవ్కోస్మోస్క్కు భారత ప్రతినిధిగా పనిచేశారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. చదవండి: ఇస్రో శాస్త్రవేత్తకు 50 లక్షల పరిహారం -
ఇస్రో శాస్త్రవేత్తకు 50 లక్షల పరిహారం
న్యూఢిల్లీ: 1994నాటి గూఢచర్యం కేసులో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ అరెస్టుకు సంబంధించిన కేసులో కేరళ పోలీసు అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అనవసరంగా అరెస్టు చేయడంతోపాటు మానసికంగా వేధింపులకు గురిచేశారని మండిపడింది. ఈ కేసుకు సంబంధించి కేరళ పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని ఆదేశించింది. 76ఏళ్ల ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ. 50 లక్షల పరిహారాన్ని ఎనిమిది వారాల్లో ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్టు చేసిన కేసుకు బాధ్యులైన నాటి కేరళ డీఐజీ సిబీ మ్యాథ్యూస్, ఇద్దరు ఎస్పీలు కేకే జోషువా, ఎస్ విజయన్ (ఈ ముగ్గురు రిటైరయ్యారు)లపై చర్యలు తీసుకోవాలంటూ తను దాఖలు చేసిన కేసును కేరళ హైకోర్టు తోసిపుచ్చడంతో నారాయణన్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పై తీర్పును వెలువరించింది. ఆ ముగ్గురిపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. కావాలనే కుట్ర మోపారు: నారాయణన్ అనవసరంగా తనను అరెస్టు చేశారంటూ సుప్రీం కోర్టు పేర్కొనడంపై నంబి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. కేరళ పోలీసులు కావాలనే తనపై గూఢచర్యం కేసు మోపారని ఆయన పేర్కొన్నారు. 1994లో తాను చౌర్యం చేసి విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నంచినట్లుగా చెబుతున్న సాంకేతికత అప్పటికి భారత్‌కు అందుబాటులోకి రానేలేదని ఆయన తిరువనంతపురంలో పేర్కొన్నారు. కాగా, ఈ కేసును విచారించిన మాజీ డీజీపీ (1994లో డీఐజీ) సిబీ మ్యాథ్యూస్, ఇద్దరు మాజీ ఎస్పీలు ఈ తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు. అసలేం జరిగింది? భారత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రహస్యాలను నారాయణన్‌తోపాటు మరో శాస్త్రవేత్త శశికుమారన్లు విదేశాలకు అమ్మేశారని 1994లో సంచలన ఆరోపణలు వచ్చాయి. మాల్దీవులకు చెందిన, అప్పటికి కేరళలో ఉంటున్న మహిళ మరియం రషీదా, మరో ముగ్గురికి నారాయణన్ ఈ సమాచారాన్ని ఇచ్చారని కేరళ పోలీసులు అభియోగం మోపారు. అందరూ ఆయనను దేశ ద్రోహిగా ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపి అలాంటిదేమీ లేదనీ, నారాయణన్ ఏ తప్పూ చేయలేదని తేల్చింది. ఆ సమయంలో దాదాపు రెండు నెలలపాటు ఆయన జైలులో ఉండాల్సి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత్ అభివృద్ధి చెందకుండా అమెరికా, ఫ్రాన్స్‌లే కుట్ర పన్ని ఇలా చేయించాయని ఆయన తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు. -
ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మోర్సీకి 40 ఏళ్ల జైలు శిక్ష
కైరో: గూఢచర్యం కేసులో ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ మోర్సీకి ఆ దేశ కోర్టు శనివారం జీవిత ఖైదు విధించింది. సహ నిందితులైన మరో ఆరుగురికి మరణశిక్ష వేసింది. సైనిక నిఘా సంబంధ అధికార రహస్యాలను ఖతర్‌కు, దోహాలోని ఓ టీవీ నెట్‌వర్క్‌కు మోర్సీ, ఇతర నిందితులు అందజేశారన్న ఆరోపణలపై విచారణ జరిపిన కైరో క్రిమినల్ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. మరో ఇద్దరికి సైతం జీవిత ఖైదు పండింది. వీరికి 25 ఏళ్ల చొప్పున(జీవిత ఖైదు) జైలుశిక్ష విధించింది. దేశ భద్రతకు సంబంధించిన పత్రాల చౌర్యానికి పాల్పడ్డారంటూ మోర్సీకి అదనంగా 15 ఏళ్ల జైలుశిక్షను విధించింది. ఈజిప్ట్ చరిత్రలో మొట్టమొదటిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు మోర్సీ. 2012 నుంచి 2013 జూలై మధ్యకాలంలో అధ్యక్షునిగా కొనసాగారు.