బీజింగ్: చైనా న్యాయస్థానం గూఢచర్యం ఆరోపణలున్న సీనియర్ జర్నలిస్ట్ డాంగ్ యుయు(62)కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో స్వేచ్ఛ, పాలనా సంస్కరణల కోసం పోరాడుతున్న అతికొద్ది మందిలో డాంగ్ ఒకరు. అధికార కమ్యూనిస్ట్ పార్టీకి అనుకూలంగా ఉండే ఐదు ప్రధాన పత్రికల్లో గ్వాంగ్‌మింగ్ డైలీ ఒకటి. ఈ పత్రికలో ఎడిటోరియల్ విభాగం డిప్యూటీ చీఫ్ అయిన డాంగ్ 2022లో బీజింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జపాన్ దౌత్యాధికారితో చర్చలు జరుపుతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. జపాన్ ప్రభుత్వం నిరసన తెలపడంతో ఆ దేశ దౌత్యాధికారిని కొద్ది గంటల తర్వాత విడిచిపెట్టారు.
డాంగ్ మాత్రం అప్పటి నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా అమెరికా, జపాన్ తదితర దేశాల అధికారులతో సమావేశాలు జరపడం నచ్చని ప్రభుత్వం ఆయనపై గూఢచర్యం ఆరోపణలు మోపింది. శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. 1989లో బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్‌లో నిరసనలకు దిగిన వేలాది మంది విద్యార్థుల్లో డాంగ్ కూడా ఉన్నారు. అప్పట్లో ఆయన అరెస్టయ్యారు. పలు జపాన్ యూనివర్శిటీల్లో విజిటింగ్ ఫెలోగా, ప్రొఫెసర్‌గాను ఆయన పనిచేశారు. న్యూయార్క్ టైమ్స్‌కు పలు వ్యాసాలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment