నంబి నారాయణన్
న్యూఢిల్లీ: 1994నాటి గూఢచర్యం కేసులో మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ అరెస్టుకు సంబంధించిన కేసులో కేరళ పోలీసు అధికారులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన్ను అనవసరంగా అరెస్టు చేయడంతోపాటు మానసికంగా వేధింపులకు గురిచేశారని మండిపడింది. ఈ కేసుకు సంబంధించి కేరళ పోలీసు అధికారుల పాత్రపై విచారణ జరిపించాలని ఆదేశించింది. 76ఏళ్ల ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు రూ. 50 లక్షల పరిహారాన్ని ఎనిమిది వారాల్లో ఇవ్వాలని కేరళ ప్రభుత్వాన్ని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది.
తనను అక్రమంగా అరెస్టు చేసిన కేసుకు బాధ్యులైన నాటి కేరళ డీఐజీ సిబీ మ్యాథ్యూస్, ఇద్దరు ఎస్పీలు కేకే జోషువా, ఎస్ విజయన్ (ఈ ముగ్గురు రిటైరయ్యారు)లపై చర్యలు తీసుకోవాలంటూ తను దాఖలు చేసిన కేసును కేరళ హైకోర్టు తోసిపుచ్చడంతో నారాయణన్ సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు పై తీర్పును వెలువరించింది. ఆ ముగ్గురిపై విచారణ జరిపేందుకు మాజీ న్యాయమూర్తి జస్టిస్ డీకే జైన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది.
కావాలనే కుట్ర మోపారు: నారాయణన్
అనవసరంగా తనను అరెస్టు చేశారంటూ సుప్రీం కోర్టు పేర్కొనడంపై నంబి నారాయణన్ హర్షం వ్యక్తం చేశారు. కేరళ పోలీసులు కావాలనే తనపై గూఢచర్యం కేసు మోపారని ఆయన పేర్కొన్నారు. 1994లో తాను చౌర్యం చేసి విదేశాలకు అమ్మేందుకు ప్రయత్నంచినట్లుగా చెబుతున్న సాంకేతికత అప్పటికి భారత్‌కు అందుబాటులోకి రానేలేదని ఆయన తిరువనంతపురంలో పేర్కొన్నారు. కాగా, ఈ కేసును విచారించిన మాజీ డీజీపీ (1994లో డీఐజీ) సిబీ మ్యాథ్యూస్, ఇద్దరు మాజీ ఎస్పీలు ఈ తీర్పుపై స్పందించేందుకు నిరాకరించారు.
అసలేం జరిగింది?
భారత అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన రహస్యాలను నారాయణన్‌తోపాటు మరో శాస్త్రవేత్త శశికుమారన్‌లు విదేశాలకు అమ్మేశారని 1994లో సంచలన ఆరోపణలు వచ్చాయి. మాల్దీవులకు చెందిన, అప్పటికి కేరళలో ఉంటున్న మహిళ మరియం రషీదా, మరో ముగ్గురికి నారాయణన్ ఈ సమాచారాన్ని ఇచ్చారని కేరళ పోలీసులు అభియోగం మోపారు. అందరూ ఆయనను దేశ ద్రోహిగా ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపి అలాంటిదేమీ లేదనీ, నారాయణన్ ఏ తప్పూ చేయలేదని తేల్చింది. ఆ సమయంలో దాదాపు రెండు నెలలపాటు ఆయన జైలులో ఉండాల్సి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత్ అభివృద్ధి చెందకుండా అమెరికా, ఫ్రాన్స్‌లే కుట్ర పన్ని ఇలా చేయించాయని ఆయన తన స్వీయ చరిత్రలో రాసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment