'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్‌ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి.. | Surat Man Claiming To Be ISRO Scientist Behind Chandrayaan-3, Police Initiated Probe - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌ 3: 'విక్రమ్ ల్యాండర్ నేనే తయారు చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..

Published Sat, Aug 26 2023 1:41 PM | Last Updated on Sat, Aug 26 2023 1:57 PM

Surat Man Claiming To Be ISRO Scientist Behind Chandrayaan 3 - Sakshi

అహ్మదాబాద్‌: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్‌ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్‌లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్‌ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సూరత్‌కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్‌స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్‌డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు.

ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్‌గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్‌లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. 

ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్‌ టీచర్‌.. ఇప్పటికే 4లక్షల మొక్కలు

  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement