INS రణ్‌వీర్‌ నౌకలో పేలుడు.. ముగ్గురు మృతి | Explosion In internal Compartment Of INS Ranvir Several Injured | Sakshi
Sakshi News home page

INS రణ్‌వీర్‌ నౌకలో పేలుడు.. ముగ్గురు మృతి

Published Tue, Jan 18 2022 9:56 PM | Last Updated on Wed, Jan 19 2022 5:02 AM

 Explosion In internal Compartment Of INS Ranvir Several Injured - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముంబైలోని నావల్‌ డాక్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబై డాక్‌ యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ యుద్ధనౌకలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ముంబైలోని ఐ.ఎన్‌.ఎస్‌. అశ్విన్‌ హాస్పిటల్‌ లో చికిత్స అందిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌లోని ఇంటర్నల్‌ కంపార్ట్‌మెంట్‌లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన జరగ్గానే నౌకలోని ఇతర సిబ్బంది తక్షణమే స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా నౌకలో కీలక మెటీరియల్‌ ఏమీ దెబ్బతినలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన సెయిలర్స్‌ వివరాల్ని నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 

విశాఖ కేంద్రంగా రణ్‌వీర్‌ సేవలు 
ఐఎన్‌ఎస్‌ రణ్‌వీర్‌ విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986 అక్టోబర్‌ లో భారత నౌకాదళంలో చేరిన రణ్‌వీర్‌ యుద్ధనౌక సోవియట్‌ యూనియన్‌లో నిర్మితమైంది. 35 మంది అధికారులు సహా మొత్తం 320 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. రాజ్‌పుత్‌ క్లాస్‌ డిస్ట్రాయర్‌గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్‌ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్‌ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్‌ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది.

2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్‌ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్‌వీర్‌  ముఖ్య భూమిక పోషించింది. క్రాస్‌ కోస్ట్‌ ఆపరేషన్స్‌ కోసం ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ నేతృత్వంలో రణ్‌వీర్‌ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్‌లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ బేస్‌ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement