విజయవాడలో బాబు బండారం బయటపెడతా: కేసీఆర్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. విజయవాడలో బహిరంగ సభ పెట్టి చంద్రబాబు బండారం బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు. అవసరమైతే తాను ఈ సభకు హాజరై బాబు మోసాన్ని ఆంధ్ర ప్రజలకు వివరిస్తానని తెలిపారు. చంద్రబాబులాగా తాము ఎప్పుడు ఎక్కడా ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్రలో ప్రస్తుతం సాగుతుంది ప్రజా వ్యతిరేక పాలన అని ఆయన అభివర్ణించారు. ఆదివారం హైదరాబాద్ మల్కాజ్గిరిలో రూ. 334 కోట్ల పురపాలక అభివృద్ధి నిధులతో నిర్మించిన తాగునీటి పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్లో నీటి వ్యవస్థను గత ప్రభుత్వాలు నాశనం చేశాయని విమర్శించారు. హైదరాబాద్ను తామే కట్టామని కొందరు నాయకులు చెబుతున్నారని... కానీ హైదరాబాద్ హైటెక్కు కాదు, లోటెక్కు సిటీ అని అన్నారు. నగరానికి 500 ఎంజీడీల తాగునీరు అవసరమైతే ప్రస్తుతం 340 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతుందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో ఇంత చేశాం, అంత చేశామని పొడిచేశామని చెప్తున్నవాళ్లు మోసం చేశారని విమర్శించారు. హైదరాబాద్పై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీరేందుకు ఆరు లేక ఏడు నెలలు పడుతుందన్నారు.