ప్రతి సమస్యకు బాబే కారణమంటే ఎట్లా ?
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ వాస్తవాలు దాచి ప్రజలను, శాసనసభను తప్పు దారి పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతకు ఆంధ్ర సీఎం చంద్రబాబే కారణమని ఆ రాష్ట్ర శాసనసభ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించడం సరికాదని అని ఆయన వ్యాఖ్యానించారు.
మంగళవారం హైదరాబాద్లో యనమల రామకృష్ణుడు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణలో ప్రతి సమస్యకు చంద్రబాబే కారణమంటే ఎట్లా అని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు. ఇరు రాష్ట్రాలకు మంచి జరగాలని తమ పార్టీ కోరుకుంటుందన్నారు. అదికాక ఇరు రాష్ట్రాల మధ్య ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్నారని ఆయన యనమల ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన విద్యుత్ వాటాను సైతం తెలంగాణనే వాడుకుంటుందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించిన అందులో ఆంధ్రప్రదేశ్కు కనీసం వాటా కూడా ఇవ్వలేదన్నారు. కొత్త ప్రాజెక్టుల నుంచి విద్యుత్ వాడుకుంటూనే ఆంధ్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని కేసీఆర్ కు యనమల రామకృష్ణుడు హితవు పలికారు.