చింతలపూడి : తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రా రవాణా వాహనాలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ విధిస్తూ.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనదారులు మాత్రం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకుండానే దొడ్డిదారిన దర్జాగా వెళ్లిపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించింది.
రాజమండ్రి-హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ రవాణా శాఖ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయగా.. ఏపీ ప్రభుత్వం మన జిల్లాలోని జీలుగుమిల్లి వద్ద చెక్‌పోస్ట్ నెలకొల్పింది. ఏపీలోకి వచ్చే తెలంగాణ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో మన రాష్ట్రానికి నెలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఆ మేరకు రావడం లేదు. కారణం ఏమిటని ఆరా తీస్తే.. తెలంగాణ రాష్ట్రం నుంచి నిత్యం వందలాదిగా భారీ ట్రాలీ లారీలు గ్రానైట్ రాళ్లతో దొడ్డిదారిన మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు వెళ్తున్నాయి. ఈ వాహనాలను చెక్‌పోస్ట్ ఉన్న జీలుగుమిల్లి మీదుగా కాకుండా ఖమ్మం జిల్లా గంగారం నుంచి చింతల పూడి మండలం రాఘవాపురం మీదుగా భీమడోలు మండలం పూళ్ల చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి విజయవాడ-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణించి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం అడ్డరోడ్డు నుంచి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా రాజమండ్రి వైపు హైవేపై ప్రయాణిస్తున్నాయి.
దీనివల్ల మన రాష్ట్రానికి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే భారీ వాహనాలు దొడ్డిదారిన ప్రయాణించడం వల్ల గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏ దశలోనూ వీటిని తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు తరచూ తని ఖీలు నిర్వహించి దొడ్డిదారిన వెళ్తున్న వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూ లు చేస్తే ఎంట్రీ ట్యాక్స్ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సరిహద్దుల్లో మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి..
Published Sat, May 30 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement