
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల వివాదంపై పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై ఈనెల 6న ఎపీ , తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది.
ఈ అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో శనివారం సమావేశం నిర్వహించారు. కానీ తెలంగాణా సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు దేబశ్రీ ప్రకటించారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు.
నీటి విడుదలకు సంబంధించి ఎపీ ఇచ్చిన ఇండెంటుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈనెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపీ, తెలంగాణా రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు.
విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్‌పీఎఫ్ బలగాలు
Comments
Please login to add a commentAdd a comment