'వాదనలు వినిపించనందునే వాటా దక్కలేదు'
- డిపెండబులిటీ తగ్గడంతో రాష్ట్రానికి అన్యాయం
- సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపిస్తే నీటి కోటా పెరుగుతుంది
- ఫీజు బకాయిలివ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు
- బీసీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి అభినందనలు
- కేంద్రం నుంచి సంక్షేమానికి మరిన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తా
- కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
హైదరాబాద్: నీటి వాటాలపై బ్రిజేష్ ట్రిబ్యూనల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో విఫలమైందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. డిపెండబులిటీ 75 నుంచి 65కు తగ్గించడంతో కొంత నష్టపోగా... సరైన వానదలు వినిపించక పోవడంతో మరింత నష్టం జరిగిందని, ఫలితంగా రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు జరిగాయన్నారు. చివరగా సుప్రీంకోర్టులో మరో అవకాశం ఉందని, ఈసారైన సరైన నిపుణులను సంప్రదించి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి సూచించారు. నీటి వాటాలు పెరిగితే రాష్ట్రంలో ప్రాజెక్టులు కళకళలాడతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నీటిపై హక్కు ఉండేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదివారం దిల్‌కుషా అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫీజు బకాయిలు కోట్లలో పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరగడంతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.2వేల కోట్ల బకాయిలున్నాయని, గత నాలుగేళ్లుగా ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. పేదప్రజల సంక్షేమానికి కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తానని, త్వరలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, దీంతో ఆయా సంస్థలు దివాలా తీస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాయితీ రుణాలు పొందేందుకు ఇష్టపడడం లేదన్నారు. ప్రతి సంస్థకు కనిష్టంగా రూ.150 కోట్ల బడ్డెట్ పెంచాలని, కులవృత్తులు అంతరించిపోతున్నాయని, వీటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలని, దీంతో ఉత్పత్తులు పెరగడంతో పాటు ఆయా కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. దేశప్రజలకు ప్రధాని మోదీ సైనిక వందనాలకు పిలపునిచ్చారని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో పాటు సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరిశంకర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రాంచెంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.