సాక్షి, అమరావతి : కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. దీంతో ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో గతంలో మాదిరిగానే 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు కృష్ణా బోర్డు పంపిణీ చేయనుంది.
కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకం చేశాయి. దీని ప్రకారం 2015–16, 2016–17లో కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేసింది.
ఆ తర్వాత కృష్ణాబోర్డు సమావేశాల్లో.. చిన్న నీటిపారుదలలో వినియోగం, కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలను మినహాయించి, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణ వాడుకునేలా రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో 2017–18 నుంచి అదే విధానం ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది.
అడ్డం తిరిగిన తెలంగాణ..
ప్రస్తుత నీటి సంవత్సరం ఆరంభంలో జరిగిన కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానం ప్రకారం నీటిని పంపిణీ చేసుకోవడానికి తొలుత అంగీకరించిన తెలంగాణ.. ఆ తర్వాత అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని పట్టుబట్టడంతో ఈ అంశాన్ని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను.. 2రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ఆ ట్రిబ్యునల్ విచారిస్తుండటాన్ని గుర్తుచేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment