కృష్ణా నదీ జలాల్లో అర్ధభాగం అసంబద్ధం | Andhra Pradesh Has Largest Share Of Krishna Water | Sakshi
Sakshi News home page

Krishna Water: అర్ధభాగం అసంబద్ధం

Published Mon, Jul 5 2021 2:17 AM | Last Updated on Mon, Jul 5 2021 4:01 PM

Andhra Pradesh Has Largest Share Of Krishna Water - Sakshi

ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెరిసగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్‌ కొత్త పల్లవి అందుకోవడంపై న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేస్తూ జూన్‌ 19, 2015న కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటుచేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదిస్తూ.. ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని చెబుతున్నారు.

చెరిసగం కానేకాదు..
బచావత్‌ ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యతకు మధ్యన అందుబాటులో ఉన్న 448 టీఎంసీలను ప్లాన్‌–బి కింద మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీల వాటా దక్కిందని గుర్తుచేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూల్‌లో ఏపీలోని తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది. అలాగే, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలనూ గుర్తించింది. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ ప్లాన్‌–బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు ఏపీకి, 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశముందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందని.. తెలంగాణ వాటా 342.96 టీఎంసీలకు చేరుతుందే తప్ప.. చెరిసగం కానేకాదని  నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది తెలిసి కూడా తెలంగాణ సర్కార్‌ తద్భిన్నంగా వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రీయంగానే పంపిణీ
కృష్ణా జలాలను పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి ఏప్రిల్‌ 10, 1969న జస్టిస్‌ బచావత్‌ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్‌ మే 27, 1976న తుది తీర్పు ఇచ్చింది. అందులో ప్రధానాంశాలివీ..
కృష్ణా జలాల పంపిణీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ ఫస్ట్‌ ఇన్‌ యూజ్‌.. ఫస్ట్‌ ఇన్‌ రైట్‌(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది.
కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. కేసీ(కర్నూల్‌–కడప) కెనాల్‌ ఆయకట్టుకు 1933 నుంచి నీళ్లందిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ను 1945లో చేపట్టి 1953 నాటికి పూర్తిచేసి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నారు. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ మినహా ఏపీలోని ప్రాజెక్టులన్నీ 1976కు ముందు చేపట్టినవే. 
1976కు ముందు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న బచావత్‌ ట్రిబ్యునల్‌.. నీటి కేటాయింపులో వాటికే తొలి ప్రాధాన్యం ఇచ్చింది.
కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060.. పునరుత్పత్తి 70తో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్‌ ట్రిబ్యునల్‌.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది.
ఉమ్మడి రాష్ట్రానికి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా ఇచ్చింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పే ప్రామాణికం
కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయడానికి ఏప్రిల్, 2004లో కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌.. బచావత్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ అక్టోబర్‌ 19, 2016న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానాంశాలివీ..
కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ కొనసాగించింది.
75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 448 టీఎంసీల్లో ఆర్డీఎస్‌ కుడి కాలువకు 4 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలతో సహా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి అదనంగా కేటాయించింది. దాంతో ఏపీకి 1,005 టీఎంసీల వాటా దక్కింది. కర్ణాటకకు అదనంగా 173, మహారాష్ట్రకు 81 టీఎంసీలు అదనంగా దక్కాయి. 
బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీకి 512.04 టీఎంసీలతో పాటూ అదనంగా 150.5 టీఎంసీలు వెరసి 662.54 టీఎంసీల వాటా దక్కుతుంది. తెలంగాణకు 342.96 టీఎంసీలు దక్కుతాయి. 
బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ సర్కార్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను ఇటీవల వెనక్కి తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో.. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు.

విభజన చట్టాన్ని అపహాస్యం చేస్తారా?
ఉమ్మడి రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతలను బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కే విభజన చట్టం అప్పగించింది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై ఐదేళ్లుగా బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ విచారణ జరుపుతోంది. బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల జోలికి బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ వెళ్లే అవకాశం లేదని.. అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు పంపిణీ చేయడంపైనే కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పును నోటిఫై చేసే దాకా.. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయింపుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ జూన్‌ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.

ప్రాజెక్టుల వారీగా బచావత్‌ ట్రిబ్యునల్‌ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ చేసిన ఒడంబడికపై ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వెలువడే దాకా ఇదే ఒప్పందం ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాస్తవాలిలా ఉంటే.. కృష్ణా జలాల్లో చెరి సగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్‌ తీర్మానం చేయడం, 2015లో ఆమోదించిన ఒప్పందం నుంచి బయటకొస్తామని ప్రకటించడాన్ని న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని స్పష్టంచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement