బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని భావించిన ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ విన్నవించిన అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. దీంతో మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం కావడంతో ఆ ప్రాజెక్టులను భారీ మొత్తంలో ఖర్చుపెట్టి పూర్తి చేశారు.
ట్రిబ్యునల్ తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగనుంది.