న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం అంశంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా జలవివాదంపై తాను తీర్పు చెప్పలేనని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి అంగీకరిస్తే చీఫ్ జస్టిస్ బెంచ్ ఈ అంశంలో సహాయపడుతుందని వెల్లడించారు. మధ్యవర్తిత్వం కాకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలనుకుంటే.. వేరే ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తరఫున హాజరైన న్యాయవాదులకు సూచించారు.
ఈ క్రమంలో ఇరు వర్గాలు తమ నిర్ణయం తెలియజేయాలని ఆదేశించిన సీజేఐ రమణ.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, తెలంగాణ తరపున సిఎస్ వైద్యనాధన్ వాదనలు నేటి విచారణలో తమ వాదనలు వినిపించారు. కాగా కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment